శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 07, 2020 , 01:29:39

స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి

స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి

  • సీపీ డాక్టర్‌ వీ రవీందర్‌
  • కమిషనరేట్‌లో పోలీస్‌ సిబ్బందికి వైద్య పరీక్షలు

వరంగల్‌ క్రైం, జూన్‌06: కరోనా నుంచి రక్షించుకోవడానికి స్వీయరక్షణ ఉత్తమమైన మార్గమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వీ రవీందర్‌ అన్నారు. పోలీస్‌ సిబ్బంది కరోనా బారిన పడకుండా శనివారం కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్‌ సిబ్బందికి వైద్యపరీక్షలు చేయిస్తున్నామన్నారు.

కమిషనరేట్‌ పరిధిలోని అన్ని విభాగాలకు పల్సీ ఆక్సిమీటర్లను అందజేస్తున్నామని, వీటి ద్వారా ఆక్సిజన్‌ సాట్యూరేషన్‌, హార్ట్‌బీట్‌ రేట్‌ తెలుసుకోవచ్చని అన్నారు. సిబ్బందికి రోగనిరోధకశక్తి పెంపునకు మందులు అందజేయనున్నట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే సందర్శకులకు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేస్తామని అన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌ ధరించాలని అన్నారు. ఈకార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జి డీసీ పీ మల్లారెడ్డి, అదనపు డీసీపీలు భీంరావు, గిరిరాజు, ఏసీపీ ప్రతాప్‌కుమార్‌, పోలీ స్‌ సంక్షేమాధికారి ఆర్‌ఐ భాస్కర్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు కిశోర్‌కుమార్‌, మల్లయ్య, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, యూనిట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, జిల్లా మెడికల్‌ వైద్యబృందం సునీల్‌దత్‌, అరుణ్‌చంద్ర, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంజీఎంలో కరోనా బాధితుడి మృతి

వరంగల్‌ చౌరస్తా: వరంగల్‌ ఎంజీఎంలో మొదటి కరోనా మృ తి నమోదైనట్లు  ఎంజీఎం కొవిడ్‌ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓవ్యక్తి (55) శుక్రవారం శ్వాసకోశ సమస్యతో ఎంజీఎంలో అడ్మిట్‌ అయ్యాడు. బాధితుడికి కరోనా లక్షణాలు కనిపిం చడంతో వైద్యులు ఆయన నుంచి నమూనాలు సేకరించి టెస్ట్‌కు పంపించారు.

శనివారం అందిన రిపోర్టుల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో బాధితుడిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే తీవ్ర శ్వాసకోశ సమస్యతో మృతి చెందాడు. మృతుడి వివరాలను కరీంనగర్‌ డీఎంహెచ్‌వోకు తెలియపరిచి నట్లు కొవిడ్‌ విభాగం నోడల్‌ అధికారి తెలిపారు. మృతదేహాన్ని ప్రత్యేక విధానంతో ప్యాకింగ్‌ చేసిన అధికారులు అంత్య క్రియలకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

మరో పాజిటివ్‌ కేసు నమోదు

వరంగల్‌ ఎంజీఎంలో శనివారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు ఎంజీఎం కొవిడ్‌ విభాగం నోడల్‌ అధికారి తెలిపారు. శుక్రవారం ఒకరికి కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆయన కుటుంబసభ్యుల నుంచి నమూనాలు సేకరించి టెస్ట్‌కు పంపించామని తెలిపారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో సదరు వ్యక్తి కుటుంబంలోని మరొకరికి పాజిటివ్‌ ఉన్నట్టు తేలిందని, బాధితుడిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించామన్నారు.logo