శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jun 03, 2020 , 03:01:59

సారు చెప్పిన పంటలే పండిస్తామని తీర్మానాలు చేస్తున్నరు

సారు చెప్పిన పంటలే పండిస్తామని తీర్మానాలు చేస్తున్నరు

  • వ్యవసాయమే నమయమని చదువుకున్నవాళ్లూ సాగుబాట పడుతున్నరు
  • పల్లెల్లో కరోనా వ్యాప్తి చెందకపోవడానికి పల్లెప్రగతే కారణం 
  • పల్లె, పట్నం మెరవాలె
  • అభివృద్ధికి నిధుల కొరత లేదు 
  • పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత 
  • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

(వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ)

‘పల్లెలు పచ్చగుండాలె. పట్నాలు మెరవాలె. ప్రతి ఇల్లూ పరిశుభ్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ అమలవుతున్న ది. పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో కరోనా పల్లెలకు పాకలేదు. ముఖ్యమంత్రి ఆలోచనా విధా నం వల్ల పల్లెలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నవి. ఈ నెల 8 వరకు పల్లెల్లో పారిశుధ్యంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానానికి రైతుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని ఆయన అన్నారు. రైతును రాజు చేయాలనే ఆలోచనతో సీఎం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయానికి చదువుకున్న యువత సైతం వ్యవసాయం వైపు మళ్లుతున్నదని అన్నారు. మంగళవారం ఎర్రబెల్లి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

నమస్తే తెలంగాణ : ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఈసారి ఏ అంశాలను తీసుకున్నారు? 

మంత్రి ఎర్రబెల్లి : పల్లెప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌  మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వచ్చేది వానకాలం. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనిపై పల్లెల్లో ఇప్పటికే సర్పంచ్‌ల నుంచి మంత్రుల దాకా అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా కార్యక్రమాన్ని డిజైన్‌ చేశాం. గతంలో మనం ఊరు ను కేంద్రంగా అందరినీ భాగస్వామ్యం చేశాం. ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తూ ఇల్లిల్లూ శుభ్రంగా ఉంచాలని ప్రజలకు చెబుతున్నాం. ప్రతిపల్లె నీట్‌గా ఉండాలి. ప్రతి ఇల్లూ పరిశుభ్రంగా ఉండాలి. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఊరంతా పాటిస్తది. ఇందుకోసం గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాల సభ్యులు అందరూ కృషి చేయాలి. మలేరియా, డెంగీ, విషజ్వరాలు ప్రబలకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. ఇండ్లళ్ల పాతసామానుంటే తీసిపారేయాలి. ఇంటిచుట్టూ నీళ్లు నిల్వ ఉండకుంట జాగ్రత్తలు పాటించాలి. గ్రామాల్లో ఖాళీ జాగలన్నీ క్లీన్‌ కావాలి. మురికి కాల్వలు శుభ్రంగా ఉంచేలా గ్రామ పంచాయ తీ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. ఇంట్ల నుంచి బయటికెళ్లి నా, వ్యవసాయ పనులకు పోయినా అందరూ మాస్కులు (దస్తీ, తువ్వాల, ఏదైతే అది) ధరించేలా ప్రజ ల్ని చైతన్యపరుస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని చెబుతున్నం. 

నమస్తే తెలంగాణ: గతంలో పల్లెప్రగతి కార్యక్రమం    ద్వారా ఎలాంటి ఫలితాలొచ్చాయి? 

మంత్రి ఎర్రబెల్లి : బ్రహ్మాండమైన ఫలితాలొచ్చినయ్‌. పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండడం వల్లనే కరోనా పల్లెలకు పాకలేదు. మీరు ఏ ఊరికి పోయినా సరే, పల్లె ప్రగతికి ముందు తర్వాత స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రజలే చెప్తరు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, గ్రామానికో నర్సరీ, హరితహారం  కనిపిస్తాయి.  ప్రపంచం అంతా కరోనాతో వణికిపోతుంటే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎవరి పని వాళ్లు చేసుకున్నరు. అయితే ఇప్పుడు అనేక రాష్ర్టాల నుంచి వచ్చారు (మనవాళ్లే). అన్నిచోట్ల అని చెప్పలేము. కానీ, కొన్నిచోట్ల అలా వచ్చిన వారు మాత్రం హోం  క్వారంటైన్‌లో ఉండాలె. ఒకరి నుంచి ఒకరికి కరో నా పాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

నమస్తే తెలంగాణ : స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పనిచేస్తున్నారు. పార్టీ పరంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఇందులో భాగస్వామ్యం ఎంత?  

మంత్రి ఎర్రబెల్లి : ప్రజల సమస్యలు, గ్రామ సమస్యలు ఏవైనా ఉంటే ఎక్కడికక్కడ పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పినం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పనిచేస్తరు. అక్కడక్కడా ఇతర పార్టీల వాళ్లు కొందరు ఏమైనా తప్పు డు ప్రచారం చేస్తే వారి విషయాలను పట్టించుకోవద్దని, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న మంచి పనుల్ని ప్రజలకు వివరించాలని అనుకున్నం. ఇప్పటికే ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఈ విషయం చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి చేసే విజ్ఞప్తి ఒక్కటే, గతంలో పాలించిన ప్రభుత్వాలు, పార్టీలకు టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసే మంచి పనుల్ని గౌరవించండి, ఆదరించండి, తప్పులుంటే మా దృష్టికి తీసుకురండి బాహాటంగా ప్రజలకు చెప్పినం. ప్రజలు అర్థం చేసుకున్నరు. 

నమస్తే తెలంగాణ: కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు? కానీ నిధులు ఇవ్వడం లేదని కొంతమంది అంటున్నరు? దీనికి మీరేమంటారు? 

మంత్రి ఎర్రబెల్లి: అట్లా అనేవాళ్లను ఒకసారి గ్రామాల్లో తిరగమని చెప్పండి. అడగమని చెప్పండి. బుద్ది ఉన్నవారెవరూ ఇలాంటి మాటలు మాట్లడరు.  శాతగానివాళ్లు, కండ్లమంటతో ఏడ్చి సచ్చేవాళ్లు, టీఆర్‌ఎస్‌ ఇక మాకేం ఉండనీయదు అనే అక్కసుతో మాట్లాడే మాటల్ని మేం పట్టించుకోదలచుకోలేదు. ప్రతి గ్రామంలో యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఫండ్‌ ఉంది.   

నమస్తే తెలంగాణ : నియంత్రిత సాగువిధానంపై రైతులు ఏమంటున్నారు? 

మంత్రి ఎర్రబెల్లి:  రైతును రాజును చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. బయట మార్కెట్‌ను బట్టి మనం పంటలు పండించాలె. పొరుగు  రాష్ర్టా ల్లో ఎక్కడా ధరల్లేవు. కొంటలేరు. కానీ మన దగ్గర రైతులు పండించిన ప్రతి గింజనూ మంచి ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటాంది. ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటదా? ఇప్పుడంటే కరోనా పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకుంటున్నాం. నీళ్లు పుష్కలంగా ఉన్నయని అందరం వరి, మొక్కజొన్న ఏస్తే ఎట్ల? అందుకే ఎక్కడ ఏ పంట వేయాలి? అన్నది ప్రభుత్వం ఫీల్డ్‌ లో అగ్రికల్చరల్‌ ఆఫీసర్లతోటి సర్వే చేయించింది. భవిష్యత్‌లో మార్కెట్‌ ఎట్లా ఉంటది అన్న విషయాలను లోతుగా పరిశీలించిన తర్వాతే సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఉత్తిగనే ఆషామాషీగా చెప్పలేదు. ఈ విషయం రైతులకు అర్థం కావడంతోనే ఊరూరా సారు చెప్పిన పంటలే పండిస్తాం అని ముందుకొస్తున్నరు. గ్రామాలకు గ్రామాలే తీర్మానాలు చేస్తాన య్‌. పట్టణాల్లో చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తామని ముందుకొస్తున్నరు. 


logo