శనివారం 11 జూలై 2020
Warangal-city - May 31, 2020 , 04:04:39

బంగారాన్ని పండిస్తున్న చెరువులు

బంగారాన్ని పండిస్తున్న చెరువులు

  • మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
  • ఉచితంగా చేప విత్తనాలతో సర్కారు ప్రోత్సాహం
  • ఉమ్మడి జిల్లాలో అంచనాలకు మించి దిగుబడి
  • కోట్లలో ఆదాయం.. పెరిగిన మార్కెటింగ్‌ సౌకర్యం
  • నెరవేరుతున్న ప్రభుత్వ ఆశయం..

చెరువుల్లో మీనం మెరిసింది.. మత్స్యకారుల ఇంటా సిరులొలికించింది. జలాశయాల్లో   ఎగిరిదుంకుతూ.. సందడి చేస్తూ.. బంగారు వర్ణమై మెరుస్తున్నది. జిమ్మనే నమ్ముకున్న కుల వృత్తికి జవసత్వాలను తెచ్చింది. సీఎం కేసీఆర్‌ స్వప్నాన్ని నిజం చేస్తూ మత్స్య సంపద..‘పసిడి’రాశులుగా మారుతున్నది. జలపుష్పాలు..నీలివిప్లవాన్ని సృష్టించి తెలంగాణను అభిషేకించాయి. ప్రభుత్వం మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పోస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మండు వేసవిలోనూ జలాశయాలన్నీ ఈ ఏడాది నీటితో కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో పోసిన చేప పిల్లలు పెరగడంతో మత్స్యకారులు ప్రస్తుతం వాటిని పడుతున్నారు. గత ఏడాది వానలు, నీటి వసతి అనుకూలంగా ఉండడంతో అంచనాలకు మించి దిగుబడి వస్తున్నది. మత్స్య సహకార సంఘాలు ఆదాయం ఆర్జిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. దీంతో మత్స్యకారుల ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమ ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తున్నారు.

వరంగల్‌ సబర్బన్‌ : జిల్లాలో 91 మత్స్యపారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. అందులో 9500 మంది సభ్యులు ఉన్నారు. 23 మహిళా మత్య్సపారిశ్రామిక సంఘాలుండగా 2300 మంది సభ్యత్వం తీసుకున్నారు. జిల్లాలోని 561 చెరువుల్లో ప్రభుత్వం విత్తన చేపలు కలిపింది. ఇందులో 80 నుంచి 100 మిల్లీమీటర్లు ఉన్న 22.10 లక్షల చేప పిల్లలను వదిలారు. 35 నుంచి 45 మిల్లీమీటర్ల పొడవున్న 148. 09 లక్షల పిల్లలను 537 చెరువుల్లో కలిపారు. ఈ ఏడాది 5500 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయని మత్స్యశాఖ అధికారులు అంచనా వేశారు. వీటి ద్వారా జిల్లాలో సంఘాల సభ్యులకు రూ. 55 కోట్ల ఆదాయం లభించనున్నట్లు చెప్పారు. ఈ సారి చెరువుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. చేపలు పెరిగేందుకు అనుకూలమైన వాతావరం ఏర్పడింది. కరోనా నేపథ్యంలో చేపల విక్రయాలకు కొంత ఆటంకాలు ఏర్పడ్డా.. స్థానికంగా పెద్దమొత్తంలో చేపలు అమ్ముడు పోయాయి. 

ఉర్సు చెరువు చేపలకు గిరాకీ..

కరీమాబాద్‌: ఉర్సు రంగలీల మైదానంలోని రంగసముద్రం చెరువు చేపలకు గిరాకీ పెరిగింది. ఈ చెరువు చేపలు రుచిగా ఉంటాయని వరంగల్‌ వాసుల నమ్మకం. సెలవులు వచ్చాయంటే చేపలను కొనేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఉర్సు సొసైటీలో 75 మంది వరకు సభ్యులుంటారు. ఏటా వారు సొంత డబ్బులతో చేపపిల్లలను కొనుగోలు చేసి ఉర్సు చెరువులో పోసేవారు. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం ఆ చెరువులో మూడు దఫాలుగా ఉచితంగా చేపపిల్లలు వదిలింది. మొదటి దఫాలో 45 వేలు, రెండో దఫాలో 45 వేలు, మూడో దఫాలో 75 వేల చేపపిల్లలను పోసింది. దీనికి తోడు సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని చేపలు కొని పోసుకున్నారు. మిషన్‌ కాకతీయలో భాగంగా ఈ చెరువులో పూడిక మట్టిని తొలగించడంతో లోతైంది. సంఘంలోని సభ్యులతో పాటు మత్స్యకారులందరూ చేపలు పట్టుకుంటారు. ఆదివారం వచ్చిందంటే ఇక్కడ సందడి ఉంటున్నది. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికే చేపలు విక్రయించే పరిస్థితి ఉందంటే డిమాండ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. logo