శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - May 29, 2020 , 01:04:27

టెలిగ్రామ్‌లో టెస్ట్‌

టెలిగ్రామ్‌లో టెస్ట్‌

  • యాప్‌లో చానల్‌ ఏర్పాటు 
  • టెన్త్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు 
  • ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంబాబు వినూత్న ఆలోచన 
  • మెరిట్‌ విద్యార్థులకు ప్రోత్సాహకం ..

కమలాపూర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులంతా ఇంటికే పరిమి తం అయ్యారు. వచ్చే నెలలో మిగిలిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు, వారి ప్రతిభను వెలికి తేసేందుకు కమలాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేరాల రాంబాబు నూతనంగా ఓ టెలిగ్రామ్‌ చానల్‌ రూపొందించాడు.

ప్రస్తుతం ఆయన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో రాణించేందుకు ఆన్‌లైన్‌లో మాక్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. మే 31, జూన్‌ 2, 4 తేదీల్లో ఉదయం 10:30 నిమిషాల నుంచి 12 గంటల వరకు గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టులపై వంద మార్కుల పేపర్‌తో పరీక్ష నిర్వహించనున్నాడు. ఇందుకోసం విద్యార్థులు ప్లేస్టోర్‌లోకి వెళ్లి టెలిగ్రామ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్టర్‌ అయిన తర్వాత  ‘https://t.me/ onlinetestforssc’ లింక్‌ను ఓపెన్‌ చేసి పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఈ టెలిగ్రాం చానల్‌ ద్వారా విద్యార్థులకు ప్రతి రోజూ నాలుగు సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించి వెంటనే రిజల్ట్‌ ఇవ్వనున్నట్లు రాంబాబు తెలిపారు. పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ. 1116లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేగాక టెలిగ్రాం చానల్‌ ద్వారా పాలీసెట్‌, టీఎస్‌ఆర్‌జేసీ పోటీ పరీక్షలకు మాక్‌ టెస్ట్‌లను నిర్వహిస్తామని పేర్కొన్నారు. 


logo