గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - May 28, 2020 , 03:29:08

సీజనల్‌ వ్యాధులు రాకుండాచర్యలు

సీజనల్‌ వ్యాధులు రాకుండాచర్యలు

  • గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి
  • పలు కాలనీల్లో ఆకస్మిక తనిఖీ

వరంగల్‌/నయీంనగర్‌, మే 27 : కరోనా వైరస్‌ నియంత్రణ, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా రోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి అన్నా రు. బుధవారం  49వ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ లు చేశారు. కాలనీల్లో పారిశుధ్య పనులు అధ్వానంగా ఉండడంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు నిర్లక్ష్యం వీడి అంకితభావం తో పనులు చేయాలని సూచించారు. డ్రైనేజీల్లో నిత్యం పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు పరిశుభ్ర వాతావరణం ఉండాలన్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయాలన్నారు. పచ్చదనం ఉండేలా విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనులు త్వరగా చేపట్టాలి

నగర ప్రధాన రహదారుల విస్తరణ పనులు త్వరగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మహానగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. సీఎం హామీ పనుల్లో భాగంగా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి కేయూ వరకు కరీంనగర్‌ హైవేను 60 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి అలంకార్‌ జంక్షన్‌ వరకు రోడ్డును 60 ఫీట్ల నుంచి 80 ఫీట్లకు విస్తరిస్తూ పనులు చేపడుతున్నారు. వీటిని కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పమేలా సత్పతి మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో స్థలాలను కోల్పోతున్న యజమానులను ఒప్పించి, త్వరగా విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్‌ వెంట డిప్యూటీ సిటీ ప్లానర్‌ నర్సింహరాములు, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గణపతి తదితరులు ఉన్నారు.