బుధవారం 08 జూలై 2020
Warangal-city - May 26, 2020 , 02:33:18

ప్రపంచం మెచ్చిన తెలంగాణ సోనా!

ప్రపంచం మెచ్చిన తెలంగాణ సోనా!

జయశంకర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 వంగడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. తెలంగాణ సోన పేరిట విడుదలైన ఈ రకం వరి ధాన్యం మార్కెట్‌లో పోటాపోటీగా అమ్ముడు పోతున్నది. సన్న గింజ, తక్కువ ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ ఉండడంతో మధుమేహ వ్యాధిగ్రస్తులతో పాటు ప్రజలు తినడానికి ఇష్టపడుతున్నారు. 125 రోజుల స్వల్పకాలిక రకం కావడం, పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి అధికంగా ఉండడంతో రైతులు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు.       

‘అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడి మన ధాన్యం అమ్ముడు పోవాలి. అంటే బియ్యం గింజ సైజు 6.3 మిల్లీమీటర్లుకు మించి ఉండాలె. తెలంగాణ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం తెలంగాణ సోనా. ఈ రకానికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్నది. షుగర్‌ పరిమాణం తక్కువగా ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చినరు. అంతర్జాతీయ, అమెరికా జర్నల్స్‌లో దీనిపై ప్రచురించారు. ఈ ధాన్యం హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నది’ - సీఎం కేసీఆర్‌

ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 (తెలంగాణ సోనా) వంగడాన్ని రాష్ట్ర వ్యవసాయ విత్తనాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వరి పరిశోధనా కేంద్రం (జయశంకర్‌ యూనివర్సిటీ) నుంచి 2015లో విడుదల చేశారు. 2014 నుంచి పరిశోధనలు జరిపి, 8 రకాల వంగడాలను (కూనారం సన్నాలు, బతుకమ్మ, వరంగల్‌-44, వరంగల్‌-14, వరంగల్‌ 32100, జగిత్యాల-1798, జగిత్యాల-384, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 తెలంగాణ సోనా) విడుదల చేశారు. అందులో తెలంగాణ సోనా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. అతి తక్కువ ైగ్లెసిమిక్‌ ఇండెక్స్‌ (ఆహారం తిన్న తర్వాత అది ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో తెలిపేది. జీఐ. దీనిని పాయింట్లలో లెక్కిస్తారు.) కలిగి ఉన్న రకం. ఇతర రకాలలో 55-62 శాతం జీఐ ఉంటుండగా, తెలంగాణ సోనాలో 51.6 శాతం ఉన్నట్లు తేల్చారు.

స్వల్పకాలిక రకం..

  • ఆలస్యంగా నార్లు పోసుకునే రైతులకు తెలంగాణ సోనా రకం అనువైనది. వానకాలం సాగులో రైతులు పచ్చిరొట్ట జనుము, జీలుగ, పిల్లి పెసర వేసి, భూసారం పెంచుకున్న తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 
  • యాసంగిలో ఇది మరింత దిగుబడి ఇస్తుంది. గింజ రాలిపోయే గుణం తక్కువగా ఉండి వడగళ్ల వాననూ ఇది కొంత వరకు తట్టుకుంటుంది. ఎంటీయూ 1010 రకంతో సమాన దిగుబడి వస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుది. 
  • వానకాలంలో జూలై 15 తర్వాత, యాసంగిలో నవంబర్‌ 15 తర్వాత నార్లు పోసుకొని మూడు వారాల తర్వాత నాట్లు వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. పంట కాలం 125రోజులు. 
  • యాసంగిలో చలిని, అగ్గితెగులు, మెడ విరుపు తెగులును ఇది తట్టుకుంటుంది.

పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • ఈ వరి పంట వానకాలం, యాసంగి సాగులో తక్కువ నూకశాతం కలిగిన మంచి నాణ్యమైన (68%-70% నూక లేని) బియ్యం ఇస్తుంది.
  • వానకాలం జూలై మాసంలోనే నార్లు పోసుకోవాలి. జూన్‌లో నార్లు పోస్తే పంట కాలం ఎక్కువగా ఉంటుంది. వానకాలం ఇది ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది. 
  • నత్రజని ఎరువును మోతాదు (సుమారు 25%) తగ్గించాలి. స్వల్ప కాలిక రకం కనుక నాటేసుకున్న తర్వాత 15 రోజుల వ్యవధితో మూడు దఫాలుగా చిరు పొట్ట దశలోపే నత్రజని వేయాలి. 
  • పంటకు కాండం తొలుచు పురుగు (మొగి పురుగు) ఆశించే అవకాశం ఉంటుంది. నాటిన 7నుంచి 10రోజుల్లో, చిరుపొట్ట దశలో కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌, క్లోరానిల్‌త్రిపోల్‌ లాంటి క్రిమిసంహారక మందులు వాడాలి. 
  • బెట్ట పరిస్థితుల్లో కంకి నల్లి ఆశించకుండా చిరు పొట్ట దశలో ప్రొఫెనోఫాస్‌, డైకోఫాల్‌, స్పైరోమెపిఫెన్‌ తదితర మందులను పిచికారీ చేసుకోవాలి.
  • 10 నుంచి 15 రోజుల నిద్రావస్థను కలిగి ఉంటుంది. కోసిన వెంటనే కాకుండా ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, మొలక శాతాన్ని పరీక్షించి నార్లు పోసుకోవాలి.


logo