మంగళవారం 26 మే 2020
Warangal-city - May 24, 2020 , 03:17:03

ఎలమందహాసం ఎవుసానికి జీవం

ఎలమందహాసం ఎవుసానికి జీవం

  • గొర్రె ఎరువుతో నాణ్యమైన భూసారం
  • మన్నెంబాట వీడిన గొల్లకురుమలు 
  •  పల్లెల్లో ఆవిష్కృతమవుతున్న అపూర్వపు దృశ్యాలు 

వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ : మందెంట పోతుంటే ఎలమందా.. అంటూ గొల్లకురుమల జీవనగతిని ఆవిష్కృరించిన పాట తెలంగాణ ఉద్యమకాలంలో ఉర్రూతలూపింది. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఎలమంద‘హాసం’ ఎవుసానికి సరికొత్త జీవం పోయనున్నది. సంప్రదాయ ఎవుసానికి యలమంద ఎరువులధార పోస్తున్నది. పల్లెల్లో సేంద్రియ ఎవుసం ఎలమంద రూపం లో తిరిగి పాదుకొల్పుతున్నది. నాలుగైదేళ్ల క్రితం దాకా పల్లెల్లో నెలకొన్న గొర్ల గ్రాసానికి కొరత ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే గొర్లకు, గొర్లకాపరులకు ఊరూరి దూరాలు దగ్గరయ్యే దాకా కాలు కాలు తిరిగేది. ఎక్కడ పచ్చికబయళ్లుంటే అక్కడికి మన్నెం (గొర్ల కాపరులు, జీవాలను కొట్టుకొని పోయే సంస్కృతి ఉండేది). కాలం మారింది. ఇప్పు డు ఊరూరా మన్నెం మందలే దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో అందించిన గొర్లతోపాటు సొంత గొర్లను కలుపుకొని గొర్లకాపరులు పూర్వజీవన యానం చేస్తున్నారు. గొర్లను సాదటం ఒకప్పుడు యుద్ధప్రయాస. దూరభారం. రోజుల తరబడి ప్రయాణం. కానీ, పరిస్థితులు మారిపోయాయి. ఊరూరు జలసిరుల మా గాణం కావడం, పంటల విస్తీర్ణం పెరగడం, రెండు పంటలు సమృద్ధిగా పండుతుండంతో పల్లెల్లో పచ్చిక బయళ్లకు కొదువలేకుండా పోయింది. 

గ్రాసంలో స్వయం సమృద్ధి

ఏ ఊరి గొర్లు ఆ ఊరిలోనే ఉండడం.. గ్రాసంలో స్వ యం సమృద్ధి సాధించిన సాక్ష్యానికి నిలువెత్తు దర్పణం. పల్లెల్లో ఒకప్పుడు ఎవుసం ఎరువులో కీలకమైన గొర్లమందలు పల్లెల్లో పునర్దర్శనం అవుతున్నాయి. చేలల్లో గొర్ల మందలు పెట్టడం ద్వారా భూసారం పెరిగేది. రైతులు తమతమ పంట పొలాల్లో గొర్ల మందలు పెట్టేందుకు పోటీపడుతున్నారు. దీంతో గొర్ల మందల గిరాకీ పెరిగిపోయింది. గొర్ల మందలను పొలాల్లో ఒక పూట ఉంచితే గొల్లకురుమలకు రూ.700 నుంచి రూ.900వరకు రైతులు చెల్లిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం గ్రామాల్లో మోతుబరి రైతుల పట్టాభూముల కంచెల్లో, ఊరుమ్మడి కంచెల్లోనే గొర్లను మేపుకునే అవకాశం ఉండేది. అలా కంచెల నిర్వహణకు తమకు భూములనిచ్చిన రైతులకు భూవిస్తీర్ణం, గ్రాసం లభ్యతను బట్టి గొల్లకురుమలు పండుగలు, పబ్బాలకు లేదా వారి ఇండ్లల్లో శుభకార్యాల్లో గొర్లను ఇచ్చేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. కాళేశ్వరం, దేవాదుల సాగునీటి ప్రాజెక్టుల ద్వారా,  ఎస్సారెస్పీ కాలువల ద్వారా పుష్కలమైన నీరు అందుబాటులోకి రావడంతో భూగర్భజాలు పెరిగి వేలాది ఎకరాల బీడు భూములు వ్యవసాయానికి అనువుగా మారాయి. గొల్లకురుమలు గొర్లను మేపుకునేందుకు కాలు కాలు తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. రైతులే ఉల్టా గొల్లకురుమలకు డ బ్బు ఇచ్చి గొర్రెలను తమ భూముల్లోకి తీసుకు వస్తున్నారు. ఇవీ స్వరాష్ట్రంలో ఆరు సంవత్సరాలుగా మారిన పరిస్థితులు. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఒక్కొక్కరికి 21 సబ్సిడీ గొర్లను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరూ ఆత్మగౌవరంతో బతికేలా అతి పెద్ద ఆసరా అయ్యింది. 

భూసారాన్ని పెంచేందుకు మందలు 

ఇరవై, ముప్ఫై ఏళ్ల క్రితం గ్రామాల్లో రైతుల వ్యవసాయ భూముల్లో గొర్లమందలు పెట్టే దృశ్యాలు కనిపించేవి. ఈ దృశ్యాలు మళ్లీ ఇప్పుడు పల్లెల్లో కనువిందు చేస్తున్నాయి. అంతేకాకుండా గొల్లకురుమలకు అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. మన్నెంబాట పట్టే పరిస్థితులు దాదాపు కనుమరుగు అయ్యాయి. ఏ గ్రామానికి చెందిన గొర్లు ఆ గ్రామంలోనే మందలు పెడుతున్నా రు. పంటపొలాల్లో మందలకు ఇప్పుడు భలే గిరాకీ నెలకొన్నది. ఆరేడుగురు గొల్లకురుమలు వారి వారి గొర్లను సమీకరించి వంతుల వారీగా పొద్దంతా మందను ఇడిసి సాయంత్రం రైతు పొలాల్లో మందపెడుతున్నారు. మంద పెట్టుకునే రైతులు పూటకు ఏడు నుంచి తొమ్మిది వందల దాకా (గొర్ల సంఖ్యను బట్టి రేటు మారుతూ ఉంటుంది) చెల్లిస్తున్నారు.

మన్నెం బాధపోయింది 

ఎండాకాలం వత్తే బహుగోస ఉండేది. గొర్లనేసుకొని రోజులకు రోజులే పోయేది. ఎండాకాలం సుతం మన్నెం పోవుడే ఉండేది. ఇల్లోకాడ. గొర్ల్లోకాడ అన్నట్టు ఉండేది. కానీ, ఇప్పుడు మా ఊళ్లెనే మందలు పెడుతున్నం. పొద్దంతా గొర్లను మేపుకొని వచ్చి సాయంత్రం నుంచి తెల్లారేదాకా మందపెడతం. వాటి ఎరువుతో పంటలు కూడా మంచిగా పండుతానయ్‌. ఎటు చూసినా పసిరికలే. మా నాగలకు (నాగ అంటే గొర్రె), మాకు తిరుగుడే లేకుంట పోయింది. కేసీఆర్‌ 21 నాగ ఇచ్చిండు. వాటితోటి మావి కొన్ని ఉండె. కత్తుల కొమురయ్య, దయ్యాల రాజు, రత్నగిరి రమేశ్‌, దద్దు రాజు, దద్దు కొమరయ్య, నేను ఇలా ఆరుగురి నాగలను కలిపి మందపెడుతున్నం. ఇదువరకు పోతుంటె పో తుంటె అక్కడో, ఇక్కడో మందపెట్టేది. కానీ, ఇప్పుడు ఎక్కడి గొర్లు అక్కడే మందలకు సరిపోతలేవు. పెద్ద రైతులు, చిన్న రైతు అనేది లేదు. అందరూ మందలు పెట్టుమని అడుగుతున్నరు. ఎకరానికి ఎనిమిదిపూటలు పెడతే సరిపోతున్నది. గొర్రెరువు నేలకు మంచిదని తెలుసుకాబట్టే మందలకు గిరాకీ మస్తుగున్నది. ఈసారి శానా మందే మంద పెట్టుకుంటున్నరు.       

-దాసరి సమ్మయ్యlogo