బుధవారం 27 మే 2020
Warangal-city - May 18, 2020 , 01:38:36

10 నిమిషాలు పనిచేద్దాం

10 నిమిషాలు పనిచేద్దాం

పరిశుభ్రత..సర్వరోగ నివారిణి. ఇందుకనుగుణంగా తెలంగాణ సర్కారు ముందే చర్యలు చేపట్టింది. పల్లె ప్రగతి పేరుతో గ్రామాలు, కాలనీలను శుభ్రం చేసింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి, ముందున్న వర్షాకాలంలో దోమల వల్ల కలిగే డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల పాటు స్వచ్ఛత పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రెండో ఆదివారం సైతం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా కదిలారు. ఇంట్లోని పూలకుండీలు, డ్రమ్ముల్లో ఉన్న నీటిని తొలగించి, చెత్తాచెదారాన్ని పారిశుధ్య కార్మికులకు అందజేశారు. మురికి కాల్వల్లో యాంటీ లార్వా బాల్స్‌ వేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, తాటికొండ రాజయ్య తమ క్యాంపు కార్యాలయాల్లో పనులు చేశారు. కొత్త రోగాలు దరి చేరకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.

ప్రజలకు అవగాహన కల్పిస్తా..చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ 

నయీంనగర్‌ : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మంత్రి కేటీఆర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, వచ్చే ఆదివారం స్లమ్‌ ఏరియాలో పర్యటించి దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తానని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. బాలసముద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో పూలతొట్లలో నిల్వ ఉన్న నీటిని పారబోసి, కొత్త నీటిని నింపారు. నిరుపయోగంగా ఉన్న వస్తువులను మున్సిపల్‌ సిబ్బందికి అందజేశారు. 

చెత్త పేరుకుపోకుండా చూడాలి:ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ 

వర్ధన్నపేట : నివాస ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోతే దోమలు వృద్ధి చెంది, రోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. వర్ధన్నపేటలోని తన క్యాంపు కా ర్యాలయాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి శుభ్రం చేశారు. డ్రమ్ములో నిల్వ ఉన్న నీటిని పారబోసి కొత్తనీటిని పట్టారు. పరిసరాలను శుభ్రగా ఉంచాలని ప్రజలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్‌ రవీందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుమారస్వామి ఉన్నారు.

సీజనల్‌ వ్యాధులను తరిమేద్దాం

వరంగల్‌ చౌరస్తా : సీజనల్‌ వ్యాధులను తరిమేద్దామని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌ పిలుపునిచ్చారు. వరంగల్‌ 26వ డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మబజార్‌ మార్కెట్‌ రోడ్డులో పరిశుభ్రతా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కార్పొరేషన్‌ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. మురుగుకాల్వలు, నీటి గుంతల్లో క్రిమిసంహారక మందు పిచికారీ చేశారు. పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ ప్రత్యేకంగా తయారు చేయించిన టోపీలను వారికి అందజేశారు.


logo