శనివారం 30 మే 2020
Warangal-city - May 18, 2020 , 01:38:38

పుట్లకు పుట్లు!

 పుట్లకు పుట్లు!

మహబూబాబాద్‌ జిల్లాలో గత యాసంగి సీజన్‌లో వచ్చిన దిగుబడి కంటే ఈ సారి మూడింతలు దిగుబడి పెరిగింది. గతంలో వర్షాభావ పరిస్థితుల్లో బోరుబావుల నుంచి వచ్చే నీటిపై రైతులు ఎక్కువగా ఆధారపడి వరిపంట పండించేవారు. ఈసారి మాత్రం కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ ద్వారాజిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటినీ నింపారు. ఎండాకాలంలోనూ చెరువుల్లో మత్తళ్లకు నీళ్లు ఉండడంతో వరినాట్లు విపరీతంగా వేశారు. దీంతో వరి కరువుతీరా పండి.. దిగుబడి భారీగా పెరిగింది. 2018 వానకాలంలో 31వేల హెక్టార్లలో వరి పంట సాగు చేయగా 98,976 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 2018 యాసంగిలో 11వేల హెక్టార్లలో 55వేల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. గతేడాది వానకాలంలో 36,114 హెక్టార్లలో 1,42,210 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాగా, యాసంగిలో 15,833 హెక్టార్లలో 1,60,650 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 165 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,01, 191మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. ఇంకా  60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ మహేందర్‌ తెలిపారు. ఈనెల చివరి వారం లేదంటే జూన్‌ మొదటి వారంలోపు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు.

రైతుల ఖాతాల్లోకి రూ. 79కోట్లు..

జిల్లా వ్యాప్తంగా 165 కొనుగోలు కేంద్రాల ద్వారా 19,909మంది రైతుల నుంచి 1,01,191మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేశారు. ఇందులో 10,104మంది రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్యాబ్‌లో నమోదు చేశారు. 8,998మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.79కోట్లు జమయ్యాయి. మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు రోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలోనూ  రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ధాన్యం కొనుగోళ్లు నిర్వహించడం గమనార్హం.


logo