శనివారం 30 మే 2020
Warangal-city - May 15, 2020 , 01:34:22

సరికొత్తగా సాగుదాం..

సరికొత్తగా సాగుదాం..

  • రైతన్నకు పూలబాట 
  • నూతన విధానంపై విస్తృత చర్చ 
  • రైతుల మేలు కోసమే: వ్యవసాయ శాస్త్రవేత్తలు  
  • ఆందోళన అవసరం లేదు: వ్యవసాయ అధికారులు 

ఒకే పంటను దశాబ్దాలపాటు సాగుచేస్తే భూమిలో సారం ఉంటదా..? నిన్న తిన్న తిండే ఇయ్యాల తింటున్నమా..? మార్పు రాకపోతే ఎట్లా..? రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం నుంచి సాగువిధానంలో మార్పులు తేవాలని సంకల్పించిన నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. పంటసాగు విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారా రైతులకు మరింత మేలు చేయాలని సర్కారు సంకల్పిస్తున్నది. ఆ మేలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమేనని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

(వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ)

మునుపెన్నడూలేనివిధంగా వ్యవసాయ రంగం పరిఢవిల్లుతున్న సందర్భం వెనుక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రైతు కేంద్రంగా వచ్చిన మార్పులే కారణమని, ఈ మార్పుల పర్యవసానంగా తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా పథకం, కాళేశ్వరం, దేవాదుల సాగునీటి ప్రాజెక్టులతో రికార్డుస్థాయిలో పంట దిగుబడి కళ్లముందు కనిపించే అక్షరసాక్ష్యం. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సాగు విధానం అమలైతే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలు ఎట్లా ఉంటాయనే అంశాలను బేరీజు వేసుకోవాలి. సరికొత్త సాగువిధానం ఉండాల్సిందేనన్న నిశ్చితాభిప్రాయం సర్కారులో నెలకొనడం స్వాగతించాల్సిందే. వ్యవసాయ సంస్కరణల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని, ఆ వ్యూహం అంతిమంగా రైతును రాజు చేయడమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

మెట్టప్రాంతాల్లోనూ వరి పండితే.. 

జిల్లాలోని వేలేరు, ధర్మసాగర్‌, ఎల్కతుర్తి వంటి మండలాల్లో ఉన్న మెట్ట భూముల్లో రైతులు గతంలో పత్తి సాగుచేశారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టు నీరు అందుబాటులోకి రావడంతో చాలా మంది రేగడి భూములు, చెల్కలను పొలం మడులు కట్టించారు. దీంతో తాత్కాలిక ప్రయోజనం కలిగింది.. కానీ దీర్ఘకాలిక నష్టం ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. వరి విస్తీర్ణం ఏటేటా పెరుగుతూ పోతే పరిస్థితి ఏంటి, అందులో దొడ్డురకాలను పండించే పరిస్థితే కొనసాగితే మనం తినే సన్నరకాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అందుకే సన్న రకాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోనున్నది. మరోవైపు ఉద్యానవన పంటలు పెరగాలి. అంతర పంటలు విస్తీర్ణం పెరగాలి. అంతిమంగా ఆహార పంటల విషయంలో ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లాకు ఆ జిల్లా స్వయం సమృద్ధి సాధించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తినెలకొన్నది. 

మార్పుల వెనుక మౌలిక సూత్రం.. 

ఒకే పంటను దశాబ్దాలపాటు సాగుచేస్తే భూసారం తగ్గిపోయి, చీడపీడలు విపరీతంగా పెరిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తమవుతున్నది. పండించిన పంటలకూ గిట్టుబాటు ధర రాదనేది జగమెరిగిన సత్యమే. ఇలాంటి సందర్భంలో పంటల సాగు విధానంలో మార్పులు అనివార్యమని రైతులు భావిస్తున్నారు. సాగులో హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పథం ఉన్న ప్రభుత్వం కనుక మార్పులకు శ్రీకారం చుట్టిందని వ్యవసాయరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చిన్నకమతాల సాగు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఏకసూత్ర విధానం ఎట్టిపరిస్థితుల్లోనూ వాంఛనీయం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త వ్యవసాయ విధానం తీసుకొస్తుందని, దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వచ్చే కొత్తసాగు విధానంతో అంతిమంగా రైతులకు మేలు జరుగుతుందే కానీ కీడు జరగదని జిల్లా వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు కే దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసారాన్ని పరిరక్షించేందుకు అంతరపంటల సాగును ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నా ఈసారి మాత్రం దాన్ని ఒక విధానంగా తీసుకురావాలని చూస్తున్నదని, ఈ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని విశ్లేషించారు. 

 ప్రత్యామ్నాయ పంటలే మేలు..

సాగునీరు అందుబాటులో ఉందని వరి పంటే ఎప్పటికీ పండిస్తామనుకోవడం సరికాదు. భూసారం తగ్గి, పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. దీన్ని అరికట్టాల్సిందే. లేదంటే భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం పడుతుంది. వరికి ప్రత్యామ్నాయం వరి కానే కాదు. వానకాలంలో వరి, యాసంగిలో వరి సాగు చేస్తే దిగుబడిలో మార్పు వస్తుంది. ఖర్చు పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వరిసాగయ్యే ప్రాంతాల్లో మక్కజొన్న, నువ్వులు, ఆవాలు తదితర పంటలు పండిం చాలి. తద్వారా భూసారం పెరుగుతుంది. తిరిగి వరిపండిస్తే చీడపీడలు తగ్గుతాయి. దిగుబడి ఖర్చు తగ్గుతుంది. ఇది అనేక దేశాల్లో అనుసరిస్తున్న విధానం.  అందుకే అక్కడి రైతులు లాభాల బాటలో మనకన్నా ముందున్నారు. వందల రేట్ల ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తున్నది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాను తీసుకుంటే సాధారణ వరి విస్తీర్ణం ఈసారి గణనీయంగా పెరిగింది. కరోనా, లాక్‌డౌన్‌ వంటి కారణాలతో ఈసారి ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయించింది. పండిన పంటను కొనుగోలు చేసింది. ఎప్పటికీ ప్రభుత్వమే కొనుగోలు చేయదు కదా! ఈ కోణంలో చూసినప్పుడు కచ్చితంగా పంట విధానంలో మార్పులు తీసుకురావాల్సిందే అన్నది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. 

ఆందోళన వద్దు..

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తె చ్చే వ్యవసాయ విధానం రైతులకు మేలు చేస్తుంది. క్రాప్‌కాలనీలు ఏర్పాటు చేసి ఏ ప్రాం తంలో ఏ పంట పండిస్తే రైతులకు తద్వారా రా ష్ర్టానికి ప్రయోజనం జరుగుతుందన్న అంశంపై సీఎం  కేసీఆర్‌ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నా రు. రైతుగా ఆయన ఆలోచించి తీసుకునే నిర్ణయం అంతిమంగా మేలు చేస్తుంది. ఏ ఒక్క రైతుకూ నష్టం జరగొద్దు అనే దే ఆయన ప్రధాన ఉద్దేశం. అందుకే విస్తృతమైన పరిశోధన చేస్తున్నారు. వచ్చే వానకాలం నాటికి జిల్లాలో 75వేల ఎకరాల్లో పత్తి, 72వేల ఎకరాల్లో వరి, 25వే ల ఎకరాల్లో మక్క, పదివేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు, మరో రెండు నుం చి మూడు వేల ఎకరాల్లో ఇతర పంట లు పండుతాయని అంచనా వేశాం. కొద్దిగా మార్పులుంటే ఉండొ చ్చు కానీ పెద్ద మార్పులు ఉండవు. 

-కే దామోదర్‌రెడ్డి, ఏడీఏ

ఇయ్యాల కాకపోతే రేపైనా...

నాచిన్నప్పుడు గీ కానంగ నాట్లు వే యకపోయేది. గిప్పుడు ఎవరైనా వ రి సాగు చేస్తుండ్లు. సీఎం సారు చెప్పిన ట్లు గిప్పుడు మారితేనే మంచిది. ఎప్పటికైనా మారాల్సిందే. పున్నానికి మారకపోతే అమాసకైనా మారాలె కదా. రైతుకు లాభం ఉన్న ముచ్చట ఏదైనా మంచిదే. సన్నాలు పండిత్తే ధర గిట్టుబా టు అయితదా..? సర్కారేమన్నా ఉపాయం జెత్తే మంచిది. 

-కంబాల శ్రీనివాస్‌, రైతు, ఎల్కతుర్తి

మారితే మంచిదే..

 సీఎం సారు చెప్పినట్లు అందరూ ఒకేరకమైన పంటలు పండించే బదులు, తలోరకం పండిత్తేనే మంచిది. ఎనుకట ఎకరం భూమి ఉంటే ఇంటికి కావాల్సినన్నీ పంటలు వేసేది. ఇప్పుడు మంచిగా నీళ్ల సౌలతున్నది. కరంట్‌ కష్టం లేదు. గదే పంట ఊకూకే ఏత్తే ఏం ఫాయిదా ఉంటది. భూమిల బ లం తగ్గుద్ది కదా. 

 -బొజ్జ గోపాల్‌, రైతు, ఎల్కతుర్తి


logo