బుధవారం 03 జూన్ 2020
Warangal-city - May 15, 2020 , 01:29:55

‘రాజధాని’ కిటకిట

‘రాజధాని’ కిటకిట

  • వరంగల్‌ నుంచి వెళ్లిన మొదటి రైలు
  • వైద్య పరీక్షలు చేసిన సిబ్బంది

ఖిలావరంగల్‌ : పోలీసు పహారాలో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మొదటి రైలు సురక్షితంగా బయలుదేరి వెళ్లింది. 50 రోజుల తర్వాత వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో సందడిగా మారింది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే రాజధాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (02434) గురువా రం మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణికులతో వరంగల్‌కు చేరుకుంది. ఈ రైలులో వరంగల్‌ నుంచి విజయవాడ, చెన్నైకి వెళ్లేందుకు 117 మంది ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రిజర్వేషన్‌ చేయించుకున్నారు. వీరు ఉదయం 9.30 గంటలకు భౌతిక దూరం పాటిస్తూ రైల్వే స్టేషన్‌ ఎదుట క్యూలైన్‌లో నిలుచుకున్నారు. ఈ-టికెట్ల పరిశీలన తర్వాత నోడల్‌ అధికారుల పర్యవేక్షణలో 117 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆర్పీఎఫ్‌, జీఆర్పీ అధికారులు ప్రయాణికులను రైలు ఎక్కించారు. 

ప్రయాణికులకు హోం క్వారంటైన్‌..

న్యూఢిల్లీ నుంచి వరంగల్‌కు రాజధాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ప్రయాణికులను పోలీసులు అప్రమత్తం చేశారు. రైలు ఆగిన తర్వాత ఏ ఒక్క ప్రయాణికుడిని కూడా బయటికి అనుమతించలేదు. బోగి దిగిన చోటనే భౌతిక దూరంలో కూర్చోబెట్టారు. రైలు ప్లాట్‌ఫాం నుంచి వెళ్లి పోయిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన 94 మంది ప్రయాణికులకు  వైద్యసిబ్బంది పరీక్షలు చేశారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని చేతిపై హోం క్వారంటైన్‌ ముద్ర వేశారు.  

రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే నరేందర్‌..

వరంగల్‌ రైల్వేస్టేషన్‌ను తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ సందర్శించారు. రైలు కంటే ముందు వచ్చిన ఆయన విజయవాడ, చెన్నైకి వెళ్తున్న వరంగల్‌ ప్రయాణికులతో మాట్లాడారు. 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్‌, కాజీపేట సబ్‌డివిజన్‌ ఏవో పూర్ణచందర్‌, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, సీసీఐ శ్రీనివాస్‌, సర్వేలైన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కృష్ణారావు, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మదన్‌మోహన్‌రావు, నోడల్‌ ఆఫీసర్‌, వరంగల్‌ తహసీల్దార్‌ ఎండీ ఇక్బాల్‌, ఆర్పీఎఫ్‌ ఏఎస్‌సీ పీ రామ్మూర్తి, వరంగల్‌ ఏసీపీ ప్రతాప్‌కుమార్‌, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్లు ఎం రవిబాబు, వీ వినయ్‌కుమార్‌, కొవిడ్‌-19 సభ్యుడు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


logo