గురువారం 04 జూన్ 2020
Warangal-city - May 14, 2020 , 02:45:27

ఊరూరా ఉపాధి

ఊరూరా ఉపాధి

  • పల్లెల్లో జోరుగా ఉపాధి హామీ పనులు
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జాబ్‌ కార్డులు 7,12,282 
  • కార్యదర్శులకు అదనపు బాధ్యతలు

లాక్‌డౌన్‌ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. దుకాణాలు, పరిశ్రమలు మూతపడడంతో అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేద కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నది. లాక్‌డౌన్‌ను ఎంతో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉపాధి పనులను ముమ్మరం చేసి పేదలకు ఊరటనిస్తున్నది. కొత్తగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నవారికి సైతం ఉపాధి కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జాబ్‌ కార్డులు 7,12,282 ఉన్నాయి.

సుబేదారి: జిల్లాలోని ధర్మసాగర్‌, ఐనవోలు, వేలేరు, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవ రపల్లి, కమలాపూర్‌ మండలాల్లోని 130 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఊపందు కున్నాయి. మొత్తం 48, 545 జాబ్‌కార్డులు ఉండగా, లక్షా 14 వేల 550 మంది కూలీలు ఉన్నారు. ఏప్రిల్‌ చివరివారం నుంచి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో రోజు కూలీ రూ. 211 ఉండగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం రూ. 237 ఇస్తున్నారు. కూలీలకు మాస్క్‌లు, సామాజిక దూరం నిబంధనలతో గ్రామాల్లో అధికారులు పనులు చేయిస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో ప్రభుత్వం ఆ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పదిరోజుల నుంచి రోజుకు సగటున పది వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, కొత్తగా 137 జాబ్‌ కార్డులు ఇచ్చి నట్లు డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. 

రూరల్‌ జిల్లాలో..

వర్ధన్నపేట: కష్టకాలంలో ఉపాధి హామీ పనులు పేదలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో 1,46,485 కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా. 3,09,378 మంది కూలీలు ఉన్నారు. అధికారులు కొత్తగా 1,212 జాబ్‌ కార్డులు ఇ వ్వగా, 3,482 మంది పనులకు హాజరవుతున్నారు. గత మార్చి నెల వరకు రోజు సగ టు కూలి రూ.153 ఉండగా, వేసవి అలవెన్స్‌, కరోనా నేపథ్యంలో రూ. 237 చెల్లిస్తు న్నది. దీంతో పాత కూలీలతోపాటు కొత్తగా జాబ్‌కార్డులు పొందిన వారికి  దినసరి కూలి గిట్టుబాటు అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పనులు కావాలని అడిగిన ప్రతి కూలీకి కూడా ప్రభుత్వం పని కల్పిస్తున్నది. 

భూపాలపల్లి జిల్లాలో..

భూపాలపల్లి టౌన్‌: జిల్లాలోని 11 మండలాల్లో  1,09,813 జాబ్‌ కార్డులు ఉండగా, 2,68,687 మంది సభ్యులు ఉన్నారు. కాగా కొత్తగా కరోనా భయంతో పట్టణాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు వచ్చి ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి కొత్తగా  226 జాబ్‌కార్డులు ఇచ్చారు. ఇందులో 750 మంది కూలీలు పనులు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న సాయంతోపాటు పింఛన్లు ఆదుకుంటుండగా, ఉపాధిహామీ ప నులు ధీమా ఇస్తు న్నా యని కూలీలు పేర్కొంటున్నారు. గ్రామాల్లోని యువకులు సైతం ఉపాధి బాట పడుతున్నారు.

జనగామ జిల్లాలో..

జనగామ రూరల్‌: లాక్‌డౌన్‌లో ప్రజలు ఉపాధి హామీ పనులకు పోటెత్తుతున్నారు. జిల్లాలో మొత్తం జాబ్‌ కార్డులు 1,14,921 కాగా, కొత్తగా 353 మందికి జాబ్‌ కార్డులు ఇచ్చారు. గత నెలలో 35 వేల నుంచి 39 వేల మంది కూలీలు పనులకు హాజరుకాగా, మే మొదటి వారంలో 42 వేల మంది పనులకు వచ్చారు. కూలి పెరగడంతో పెద్ద ఎత్తున పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా పనులతో పేద కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది. 

ములుగు జిల్లాలో..

ములుగు, నమస్తేతెలంగాణ: వలస కూలీలకు ఉపాధి హామీ పథకం అండగా నిలిచింది. జిల్లాలోని 9 మండలాల్లో 83,028 మందికి జాబ్‌కార్డులను జారీ చేశారు. కొత్తగా 200 మందికిపైగా జాబ్‌ కార్డులు ఇచ్చినట్లు ఇన్‌చార్జి డీఆర్‌డీవో పారి జాతం తెలిపారు. ప్రస్తుత వేసవిలో ఉపాధి హామీ కూలీల వేతనాల్లో అదనపు భత్యం చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో..

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,09,490 జాబ్‌కార్డులుండగా, 4,77, 713 మంది పనులకు హాజరవు తున్నారు. కొత్తగా 1014 జాబ్‌ కార్డులు జారీ చేయగా, 2,947 మంది కూలీలు పనులకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణాల నుంచి పల్లెలకు వచ్చిన వారికి జాబ్‌కార్డులు ఇవ్వడంతో వారికి ఉపాధి లభించినట్లయింది. డబ్బులు కూడా కూలీల బ్యాంకు ఖాతాలో పడు తుండడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.


logo