సోమవారం 01 జూన్ 2020
Warangal-city - May 14, 2020 , 02:45:30

నేటి నుంచి రైళ్ల రాకపోకలు

నేటి నుంచి రైళ్ల రాకపోకలు

  • సాధారణ ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక రైళ్లు

ఖిలావరంగల్‌, మే 13 : వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో 50 రోజుల తర్వాత సాధారణ ప్రయాణికుల రైళ్లు గురువారం నుంచి కూత పెట్టనున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా నిత్యం సుమారు 30 గూడ్సు రైళ్లు, వలస కార్మికులను స్వరాష్ర్టాలకు తరలించే శ్రామిక్‌ రైళ్లు మాత్రమే నడిచేవి. సాధారణ ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా రైల్వే శాఖ తెలంగాణకు మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌, ఢిల్లీ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి బెంగళూరు రైల్వేస్టేషన్లకు రాకపోకలు సాగించే విధంగా రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది.

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు షెడ్యూల్‌

న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే 02434 రాజధాని సూపర్‌ఫాస్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు గురు, శనివారాల్లో ఉదయం 11.48 గంటలకు చేరుకుంటుం ది. విజయవాడకు మధ్యాహ్నం 2.35 గంటలకు, చెన్నైకి రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అలాగే చెన్నై నుంచి న్యూఢిల్లీ నుంచి వెళ్లే 02433 రాజధాని సూపర్‌ఫాస్ట్‌ ప్రత్యేక రైలు విజయవాడ జంక్షన్‌, వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది. ఈ రైలు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు శుక్రవారం, ఆదివారం మధ్యాహ్నం 3.22 గంటలకు చేరుకుంటుంది. వరంగల్‌, నాగ్‌పూర్‌, బల్లార్షా, ఝాన్సీ, పల్వాల్‌, న్యూఢిల్లీ రైల్వే జంక్షన్లలో మాత్రమే రైలు ఆగుతుంది. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లోని బుకింగ్‌ కౌంటర్లు తెరుచుకోవు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లేదా ఐఆర్‌సీటీసీ యాప్‌లో టికెట్‌ కొనుగోలు చేసిన ప్రయాణికులు మాత్రమే రైల్వేస్టేషన్‌కు రావాలని సూచించారు. 

‘ప్రయాణికుల వివరాలు తీసుకోవాలి’

హన్మకొండ/ఖిలావరంగల్‌/కాజీపేట: రైళ్ల ద్వారా జిల్లాకు వచ్చే ప్రయాణికుల వివరాలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. ఈ మేరకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌ను సీపీ రవీందర్‌, వైద్యశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. కాగా, ప్రయాణికులను పరిశీలించేందుకు రైల్వే స్టేషన్లకు ఆయన ప్రత్యేక నోడల్‌ టీంలను ఏర్పాటు చేశారు. కాగా, ఉత్తర భారతదేశానికి ప్రయాణికులు, వలస కూలీలను తీసుకెళ్తున్న రైళ్లను బుధవారం ఉదయం కాజీపేట రైల్వే జంక్షన్‌లో నిలిపి ప్రయాణికులకు అధికారులు అన్నపానీయాలు అందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెంగుళూరు- న్యూఢిల్లీ మధ్య నడిచే(రాజధాని ఏసీ) ప్రత్యేక రైలు, కర్నూల్‌ టౌన్‌ నుంచి రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌కు వెళుతున్న శ్రామిక్‌ రైలు బుధవారం కాజీపేటలో ఆగాయి.


logo