బుధవారం 03 జూన్ 2020
Warangal-city - May 12, 2020 , 01:41:44

రవాణా సేవలకు ఆర్టీసీ సమాయత్తం

రవాణా సేవలకు ఆర్టీసీ సమాయత్తం

  • విధులకు మూడో వంతు ఉద్యోగులు హాజరు

సుబేదారి, మే 11: రవాణా సేవలకు ఆర్టీసీ సమాయత్తమవుతున్నది. కరోనావైరస్‌ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 23 నుంచి ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. 50 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెడ్‌ జోన్లు మినహా ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో భౌతిక దూరం పాటిస్తూ 50శాతం ఆక్యుపెన్సీతో ఆర్టీసీ సేవలు అందించాలని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తోడు రాష్ట్రంలో ఆర్టీసీ సేవలపై ఈ నెల 15న నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం నుంచి ఏ సమయంలోనైనా సేవలపై ఆదేశాలు రావచ్చనే ఉద్దేశంతో డిపోలలో 1/3 ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని వరంగల్‌ 1, వరంగల్‌ 2, హన్మకొండ, భూపాలపల్లి, తొర్రూరు, జనగామ, మహబూబాబాద్‌, నర్సంపేట, పరకాల డిపోల పరిధిలోని మేనేజర్లు, సూపర్‌వైజర్లు, 20 మంది చొప్పున డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు విధులకు హాజరయ్యారు. మొత్తం 9 డిపోల పరిధిలో 4500 మంది ఉద్యోగులుండగా, అందు లో మూడోవంతు ఉద్యోగులు విధులకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం డ్యూ టీకి వచ్చిన మెకానిక్‌లు బస్సుల మరమ్మతును చేపట్టారు. అలాగే ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరు, ఇద్దరు కూర్చునే సీట్లలో ఒకరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో 50 సీట్లున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 29 మంది, 55 మంది సీటింగ్‌ కెపాసిటీ ఉండే పల్లె వెలుగులో 32 మంది ప్రయాణించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పల్లె వెలుగు బస్సులకు ప్రయాణికుల తాకిడితో పాటు స్టేజీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించడం, వారిని స్టేజీల వారీగా ఎలా తీసుకోవడం అనే విషయాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. 


logo