బుధవారం 03 జూన్ 2020
Warangal-city - May 10, 2020 , 02:39:48

రైతులు ఖుష్‌.. ప్రజలు ఖుష్‌..

రైతులు ఖుష్‌.. ప్రజలు ఖుష్‌..

  • ఫలించిన ధరల నియంత్రణ వ్యూహం
  • కష్టకాలంలో అగ్గువ ధరకే తాజా కూరగాయలు
  • రైతు కష్టం వృథా కాకుండా పక్కాగా ఏర్పాట్లు
  • సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ప్రజలు, రైతుల హర్షం

కష్టకాలంలో సామాన్యుల బాధలు ఎలా ఉన్నా.. దళారులు మాత్రం దండిగా దోచుకుంటారు. కరోనా లాక్‌డౌన్‌లోనూ అదే జరుగుతుందని అంతా భయపడ్డారు. కానీ, సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు దళారులకు వెన్నులో వణుకుపుట్టించాయి. రేట్లు పెంచితే జైలులో వేస్తామన్న మాటలు.. మంత్రంలా పనిచేశాయి. పైగా పంటను నేరుగా అమ్మేందుకు రైతులకు వెసులుబాటు కల్పించడంతో ప్రజలకు అగ్గువకే తాజా కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ నిర్ణయంతో పంట వృథా పోకుండా రైతుకు లబ్ధి జరుగడంతోపాటు తాజా కూరగాయలు తక్కువ ధరకే ప్రజలకు లభించాయి. నారింజ, సంత్ర, కర్బూజ లాంటి ఫలాలు సైతం విరివిగా లభించడంతో ప్రజలు వాటిని కొనేందుకు ఆసక్తి చూపారు.

-నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌

కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కూరగాయలు, నిత్యావసర వస్తువులకు జనం ఇబ్బందిపడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు పండుగ చేసుకోవడంతోపాటు జనానికి నిండుగా తాజా కూరగాయలు లభించాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కూరగాయలు సాగు చేసిన రైతులు నేరుగా ప్రజలకు అమ్ముకుని లాభాలు పొందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని జంగేడు, వేశాలపల్లి, గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, కాశీంపల్లి, కొంపెల్లి తదితర గ్రామాలతోపాటు జిల్లాలోని గంగారం గ్రామంలో రైతులు పండించిన కూరగాయలు భూపాలపల్లికి దిగుమతి అవుతున్నాయి. స్వయంగా రైతులే కూరగాయలను విక్రయిస్తూ లాభాలు అర్జిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రం పక్కనే ఉన్న పాల్‌సాబ్‌పల్లి, అబ్బాపురం, శ్రీరాములపల్లి, జాకారం, కుమ్మరిపల్లి, బాణాలపల్లి గ్రామాల్లోని రైతులు పండించిన కూరగాయాలను జిల్లా కేంద్రంలోని అంగడి మైదానం వద్ద ఏర్పాటు చేసిన రైతుబజార్‌కు తరలిస్తున్నారు. దళారుల బెడద లేకుండా నేరుగా ప్రజలకు తక్కువ ధరకే అమ్మి గిట్టుబాటు ధర పొందుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలంలోని మరియపురం, గంగదేవిపల్లి, ఎలుకుర్తి, మచ్చాపురం గ్రామాల్లో ఏకంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కూరగాయల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో రైతుల పండించిన కూరగాయలను కొనుగోలు చేసి ఎలాంటి లాభం లేకుండా ప్రజలకు విక్రయిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కూరగాయల అమ్మకాలకు 32 ఎకరాలున్న ఓసిటీ మైదానంలో అధికారులు తాత్కాలిక మార్కెట్‌ ఏర్పాటు చేశారు. అధిక ధరలను అదుపు చేసేందుకు ధరల పట్టికలను అందుబాటులో ఉంచారు. విశాలమైన మార్కెట్‌ ఏర్పాటుతో లైసెన్స్‌ ఉన్న వ్యాపారస్తులతోపాటు కూరగాయలు పండించే రైతులు సైతం నేరుగా విక్రయాలు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దళారి వ్యవస్థ లేకుండా రైతులు పండించిన పంటను నేరుగా మార్కెట్‌, వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు చేయడంతో లాభం చేకూరింది. 

నియంత్రణలో సక్సెస్‌

అధికారులు పక్కా ప్రణాళికతో ధరల నియంత్రణలో సక్సెస్‌ అ య్యారు. లాక్‌డౌన్‌ పేరుతో కృత్రిమ కొరత సృష్టించకుండా విజిలె న్స్‌, మార్కెటింగ్‌ అధికారులు నిఘా పెట్టారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయించారు. దీంతో లాక్‌డౌన్‌లో ప్రజలపై అధిక ధరల భారం పడలేదు. ప్రతి వేసవికాలంలో కూరగాయల ధరలు మండిపడుతుండేవి. దానికి విరుద్ధంగా లాక్‌డౌన్‌ కష్టకాలంలో కూరగాయల ధరలు దిగొచ్చాయి. దళారులు లేకుండా రైతులు నేరుగా అమ్మకాలు చేయడంతో వినియోగదారులకు తాజా కూరగాయలు తక్కువ ధరలకు లభించాయి. 

ఉద్యాన సాగుతో లాభపడ్డాం

కూరగాయలు ఎక్కువగా పండించినా ఎలాంటి నష్టం రాలేదు. ఏటా పంట పండిన తరువాత అమ్ముకునేందుకు ఇబ్బంది పడేవాళ్లం. రవాణా చార్జీలు ఎక్కువయ్యేది. లాక్‌డౌన్‌ ఉండడంతో గ్రామంలోనే తిరిగి అమ్ముకున్నం. పెట్టబడిపోను లాభాలు వచ్చినయి. 

-నాగమణి, మరియపురం, వరంగల్‌ రూరల్‌

చేను వద్దకే వచ్చి కొంటున్నరు

కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు ఇంట్లోనే ఉంటున్నరు. కూరగాయల అమ్మకాలు బాగా జరుగుతున్నయి. చేను వద్దకే వచ్చి కొంటున్నరు. ధరలు కూడా మంచిగాఉండటంతో లాభాలు వస్తున్నయి. 

-చీకటి నాగమ్మ , కల్వల రైతు, మహబూబాబాద్‌ జిల్లా

మంచి లాభాలు వచ్చినయి..

 ఎన్నో ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న. ఇప్పుడు టమాట, బెండ, గోరుచిక్కుడు, బీరకాయలు పండించిన. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు చాలా భయపడ్డాను. కానీ, రైతులకు సడలింపులు ఇచ్చారు. ములుగు అంగడి మైదానంలోని రైతు బజార్‌లో దళారుల జోలి లేకుండా ప్రజలకు నేరుగా కూరగాయలు అమ్మిన. మంచి లాభాలు వచ్చినయి.

-వెంకట్‌ రాజిరెడ్డి, రైతు, అబ్బాపురం,ములుగు జిల్లా


జనగామ జిల్లాలో మొత్తం 916 మెట్రిక్‌ టన్నుల కూరగాయల దిగుబడి వచ్చింది.  ఇందులో 664 మెట్రిక్‌ టన్నులు జిల్లాలో పంపిణీ జరుగగా, 252మెట్రిక్‌ టన్నులు ఇతర జిల్లాలకు సరఫరా అయ్యా యి. వీటిలో టమాట 30 ఎకరాల్లో 240 మెట్రిక్‌ టన్నులు, వంకాయ 22 ఎకరాల్లో 176,  బెండకాయ 15 ఎకరాల్లో 90, దోసకాయ 5 ఎకరాల్లో 20, కాకరకాయ 22 ఎకరాల్లో 88, పచ్చిమిర్చి 15 ఎకరాల్లో 120, ఆకుకూరలు 25 ఎకరాల్లో 50 మెట్రిక్‌ టన్నులతో పాటు ఇతర కూరగాయల దిగుబడి వచ్చింది.                  

     - లత, ఉద్యాన శాఖ అధికారి , జనగామ జిల్లాlogo