ఆదివారం 31 మే 2020
Warangal-city - May 10, 2020 , 02:39:49

రైతు పక్షపాతి కేసీఆర్‌

రైతు పక్షపాతి కేసీఆర్‌

  • ఆర్థికమాంద్యంలోనూ ఆగని రైతుబంధు
  • తెలంగాణలో సాగునీటి విప్లవం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • దేవరుప్పులలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
  • తొర్రూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

తొర్రూరు/దేవరుప్పుల/పర్వతగిరి,మే 9 : కరోనా వైరస్‌తో ఆర్థికమాంద్యం ఏర్పడినా అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతురుణమాఫీకి నిధులు విడుదల చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని 14వ వార్డులో సాయిరాం ఐరన్‌ గ్రూప్‌ ప్రతినిధులు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి దాతృత్వంతో వార్డు కౌన్సిలర్‌ ఎన్నమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరుపేదలు, హమాలీ కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి జనగామ జిల్లా దేవరుప్పులలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు పూర్తిచేయడంతో సాగునీటి సమస్య తీరిందని, తాగునీటి కొరత లేదని అన్నారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ ఉద్యోగి., సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అంటేనే పిల్లనిచ్చే రోజుల నుంచి నేడు వ్యవసాయదారుడు అంటేనే ఆదరించే రోజు వచ్చిందని, దీనికి సీఎం కేసీఆరే కారణమని అన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ వస్తే ఇలా ఉంటుందని ప్రజలకు తెలిపిన ఆయన తన మాటను అక్షరసత్యం చేసి చూపారని తెలిపారు. ఆర్థికమాంద్యాన్ని లెక్క చేయక రైతుబంధు, రైతు రుణమాఫీకి నిధులు విడుదల చేసి మరోసారి అపరభగీరథుడని నిరూపించుకున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో దాతలు, నేతలు ముందుకొచ్చి పేదలకు బాసటగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు. పర్వతగిరికి చెందిన డీలర్‌ అర్షం ముత్తయ్య శనివారం మృతి చెందగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు - ఉషా దంపతులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ముత్తయ్య కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని వారు నెమరు వేసుకున్నారు. కార్యక్రమాల్లో తొర్రూరు డీఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, ము న్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు సీతారాములు, శ్రీనివాస్‌, కర్నె సోమయ్య, దేవరుప్పులలో దయాకర్‌, సుందరరాంరెడ్డి, మల్లేశ్‌, చింత రవి, నర్సింహారెడ్డి, జలేంధర్‌రెడ్డి, పద్మ, ఓడపల్లి రవి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌కు విరాళం అందజేత

కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం సహాయనిధికి ఇటీవల లక్కమారి కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు అందజేసిన రూ.3,45,197 విరాళం చెక్కును శనివారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందజేశారు. అదే విధంగా మరో రూ.25,590 చెక్కును కూడా అందజేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. logo