ఆదివారం 31 మే 2020
Warangal-city - May 09, 2020 , 02:48:51

షాపులకు నంబర్‌ కోడింగ్‌

షాపులకు నంబర్‌ కోడింగ్‌

  • ఆరెంజ్‌ జోన్‌లోకి రాగానే ఓపెన్‌
  • సరి, బేసి సంఖ్యల పద్ధతిలో తెరుచుకునేలా చర్యలు
  • గ్రేటర్‌ పరిధిలో 18,742 దుకాణాలు

వరంగల్‌, నమస్తే తెలంగాణ : అర్బన్‌ జిల్లా రెడ్‌జోన్‌ నుంచి కొద్దిరోజుల్లో ఆరెంజ్‌ జోన్‌లోకి రానుంది. సరి, బేసి సంఖ్యలో షాపులు తెరిచేలా గ్రేటర్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహానగరపాలక సంస్థ పరిధిలో షా పులను మూడు కేటగిరీలుగా విభజిస్తూ నంబర్‌ కోడింగ్‌ ప్రక్రియ చేపట్టారు. దుకాణాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. నిత్యావసర సరుకులు, మెడికల్‌ షాపులు, దవాఖానలు, ఎరువులు, విత్తనాలు, సిమెంట్‌, ఐరన్‌, శానిటరీ, ఎలక్ట్రికల్‌, మార్బుల్‌, ఫ్లైవుడ్‌ షాపులను ఏ కేటగిరీగా గుర్తించారు. ఇందులో గుర్తించిన షాపులు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వర కు తెరుచుకోవచ్చు. బీ కేటగిరీలో బట్టల షాపులు, కంగన్‌హాళ్లు, స్టీల్‌, ప్లాస్టిక్‌, బంగారం, ఫుట్‌వేర్‌ తదితర షాపులను గుర్తించారు. సరి, బేసి సంఖ్యల పద్ధతిలో ఈ షాపులను రోజు విడిచి రోజు తీసే అవకాశం కల్పించారు. సీ  కేటగిరీలో హోటళ్లు, బేకరీలు, సినిమా థియేటర్లు, షా పింగ్‌ మాళ్లు, బ్యూటీపార్లర్లు, వ్యాయామశాలలు, స్పోర్ట్స్‌ కాం ప్లెక్స్‌, విద్యాసంస్థలను గుర్తించారు. 

రెండు రోజుల్లో కోడింగ్‌ పూర్తి..

గ్రేటర్‌ పరిధిలో 18,742 షాపులున్నాయి. ఏ కేటగిరీలో 6,059 షాపులు, బీ కేటగిరీలో 10,734 షాపులు, సీ కేటగిరీలో 1,949 షాపులు ఉన్నాయి. శుక్రవారం నుం చి బల్దియా అధికారులు నంబర్‌ కోడింగ్‌ ఇస్తున్నారు. ఏ కేటగిరీలో ఉన్న షాపులకు గ్రీన్‌ కలర్‌, బీ కేటగిరీలో ఉన్న షాపులకు ఆరెంజ్‌ కలర్‌, సీ కేటగిరీలో ఉన్న షాపులకు రెడ్‌ కలర్‌ కోడింగ్‌ ఇస్తున్నారు. బీ కేటగిరీలో ఉన్న షాపుల నంబర్‌ కోడింగ్‌లో ఏ రోజు తెరుచుకోవాలనే అంశాన్ని సైతం సూచిస్తున్నారు. సరి, బేసి సంఖ్య పద్ధతిలో బీ కేటగిరీలోని దుకాణాలు వారంలో మూడు రోజులు తెరుచుకునే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో షాపులకు నంబర్‌ కోడింగ్‌ పూర్తవుతుందని, అర్బన్‌ జిల్లా ఆరెంజ్‌ జోన్‌లోకి రాగానే కేటగిరీల వారీగా షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.


logo