ఆదివారం 31 మే 2020
Warangal-city - May 09, 2020 , 02:49:02

రైతు సంక్షేమంపై సీఎం దృష్టి

రైతు సంక్షేమంపై సీఎం దృష్టి

  • అదే కేసీఆర్‌ ఆశ, శ్వాస, ధ్యాస
  • రక్తదాతలు ఆపదల్లో ఉన్న వారికి ప్రాణదాతలే
  • రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు చిరస్మరణీయం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయపర్తి, మే 08: రైతు సంక్షేమంపైనే సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టారని, అదే ఆయన ఆశ, శ్వాస, ధ్యాస అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రెడ్‌క్రాస్‌ 100 ఏళ్ల ఆవిర్భావ దివోత్సవాన్ని ఎంపీపీ కార్యాలయ ఆవరణలో సొసైటీ జిల్లా చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రెడ్‌క్రాస్‌ పతాకాన్ని ఆవిష్కరించి స్థానిక వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సమకూర్చిన నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, దాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం సృష్టిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ తెలంగాణలోనూ ఆర్థిక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అన్నారు. అయినప్పటికీ రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ పంట రుణాల మాఫీ, రైతుబంధు సాయానికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని యావత్‌ ప్రపంచం అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛందంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. ఆపదల్లో ఉన్న వారికి రక్తదాతలు ప్రాణం పోస్తారని, ప్రతి ఒక్కరూ మూడు నెలలకొకసారి రక్తదానం చేయాలని ఆయన కోరారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను అధికార యం త్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు. దక్షిణాఫ్రికా ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కోర్‌ కమిటీ కన్వీనర్‌ వెంకట్‌రావు తాళ్లపల్లి నేతృత్వంలో ‘దయన్న స్పెషల్‌ ఫోర్స్‌' పేరుతో ప్రత్యేకంగా ముద్రించిన మాస్కులను పలువురు ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లికి అందించారు. మండల కేంద్ర శివారులో నాటిన మొక్కలకు నీళ్లు పట్టారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి స్వయంగా మాస్కులు తొడిగారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌ రావు, జిల్లా నాయకులు బిల్లా సుధీర్‌రెడ్డి, మునావత్‌ నర్సింహానాయక్‌, డీఆర్‌డీవో మిట్టపల్లి సంపత్‌రావు, డీఎల్పీవో నాగపురి స్వరూప, డీఎంహెచ్‌వో తాళ్లపల్లి మధుసూదన్‌, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో రామ్మోహనాచారి, మండల వైద్యాధికారి వెంకటేశ్‌, రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ గారె నర్సయ్య పాల్గొన్నారు.


logo