గురువారం 04 జూన్ 2020
Warangal-city - May 07, 2020 , 02:22:50

కరోనాను జయించిన పదేళ్ల పాప

కరోనాను జయించిన పదేళ్ల పాప

  • గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి

రెడ్డికాలనీ, మే 06: పదేళ్ల పాప కరోనాను జయించింది. గతనెల 21న హన్మకొండ మండలం పూరిగుట్ట తండాకు చెందిన 10 ఏళ్ల పాప కొవిడ్‌-19 పాజిటివ్‌తో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న పాప బుధవారం డిశ్చార్జి అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మీ జవాన్‌ అయిన పాప తండ్రి ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన వారితో కలిసి మార్చి 18న రైలు ప్రయాణం చేశాడు. దీంతో అధికారులు జవాన్‌ను హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఆ సమయంలో పాప తల్లిదండ్రులకు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్‌ వచ్చింది. కొద్దిరోజుల తరువాత పాపకు పాజిటివ్‌ రాగా, ఏప్రిల్‌ 21న గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఇటీవల పాపకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో అక్కడి వైద్యాధికారులు ఆమెను డిశ్చార్జ్‌ చేశారని వరంగల్‌ అర్బన్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా పాపను ఇంటికి పంపించారు. కాగా గాంధీ దవాఖానలో పాపకు అటెండెంట్‌గా ఉన్న తల్లికి ఇటీవలె కరోనా పాజిటివ్‌గా (జీహెచ్‌ఎంసీ పరిధిగా పరిగణించడం విశేషం) తేలడంతో  ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నది. కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మొత్తం 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పాపతో పాటు 26 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో జిల్లా నుంచి కేవలం ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు ఉండడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌గా మారే అవకాశం ఉన్నట్టు జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. logo