సోమవారం 01 జూన్ 2020
Warangal-city - May 07, 2020 , 02:22:54

బారులు తీరిన చైతన్యం

బారులు తీరిన చైతన్యం

  • గీత దాటని జనం
  • భౌతిక దూరం పాటించిన ప్రజలు
  • 44 రోజుల తర్వాత షాపుల ఎదుట కిటకిట 
  • ఇంటర్‌ పరీక్షా పత్రాల 
  • మూల్యాంకనానికి  ఏర్పాట్లు 
  • అదనంగా మరో రెండు కేంద్రాలు 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఒకటా.. రెండా..? ఏకంగా 44 రోజులు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జనం ప్రభుత్వ సడలింపులతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రభుత్వం మాట ప్రత్యేకించి సీఎం కేసీఆర్‌ ముచ్చటని జనం ఎంత సావధానంగా ఆచరిస్తారనేది మరోసారి నిరూపితమైంది. దేశంలో కరోనా వైరస్‌ విస్తృతికి అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే శ్రీరామ రక్ష అని ఆయన దేశానికన్నా ముందే వెల్లడించారు. జనతా కర్ఫ్యూకు దేశంలో ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకోకముందే మద్దతు పలికారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ను ప్రకటించి ఊరుకోకుండా లాక్‌డౌన్‌ అంటే ఏమిటి? దాన్ని పక్కాగా అమలు చేస్తే వచ్చే ఫలితాలు ఎట్లా ఉంటాయో జనం చేత ఆచరింపజేసి చూపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఏ చిన్న అవాంతరం లేకుండా విజయవంతంగా కొనసాగుతున్నది. అయితే, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ కొన్ని కఠిన నిర్ణయాలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లలో నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా సడలింపులు చేశారు. దీంతో 44 రోజుల అనంతరం జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటే శాసనంగా స్వీకరించి తొలిరోజు భౌతిక దూరాన్ని పాటించారు. ఓరుగల్లు పోరు చైతన్యాన్ని ప్రదర్శించారు. నిర్మాణ రంగంతో ముడిపడిన సిమెంట్‌, ఐరన్‌, హార్డ్‌వేర్‌, శానిటరీ తదితర 100 దుకాణాలు, ఎలక్ట్రికల్‌, ఎరువుల దుకాణాలు తెరవడంతో ఆయా రంగాలపై ఆధారపడిన అందరూ తిరిగి తమతమ విధులకు హాజరయ్యారు. అదీ భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్‌ ధరించి చైతన్యం చూపారు. అయితే తొలిరోజు హమాలీలు, కూలీల కొతర ఏర్పడడంతో వ్యాపారస్తులు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆయా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 

రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

లాక్‌డౌన్‌తో పేపర్‌ దిద్దుడు (మూల్యాంకనం) వాయిదా పడిం ది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌, జాతీయ విద్యా సంస్థల ఎంట్రెన్స్‌లు దృష్టిలో పెట్టుకొని పరీక్షా పత్రాల దిద్దుబాటు జరగాల్సిందేనని నిర్ణయించింది. దీంతో జిల్లాలో ఇంటర్‌బోర్డు అధికారులు ఆ దిశగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం ఆదేశంతో రాష్ట్ర ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఒమర్‌ జలీల్‌ పేపర్‌ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు, విధివిధానాలపై బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించిన ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను గతం నుంచి వరంగల్‌ నగర కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా ఇక్కడే చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనర్‌ ఆదేశాలతో వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హన్మకొండ కుమార్‌పల్లి తోటబడి, హన్మకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలను వాల్యుయేషన్‌ కోసం గుర్తించారు.  

ఆరు సబ్జెక్టులు.. ఏడు లక్షల సమాధాన పత్రాలు 

ఈ సారి ఇంటర్‌ ఫస్టియర్‌ ఆరు, సెకండ్‌ ఇయర్‌ ఆరు సబ్జెక్టులకు మొత్తం 7లక్షల సమాధాన పత్రాలు వరంగల్‌కు చేరాయి. ఈ పేపర్లను దిద్దడానికి రెండు వేల మందిని నియమించగా, ఇందులో 1500 మంది ఎగ్జామినర్లు, క్యాంపు ఆఫీసర్లు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. గతంలో హన్మకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఒక సెంటర్‌ ఉండేది. ఒక్క గదిలో 60 మంది పేపర్లు దిద్దేవారు. ఈ సారి లాక్‌డౌన్‌ కారణంగా ఒక్క గదిలో 20 మంది మాత్రమే ఉండాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో మూడు సెంటర్లలో వాల్యుయేషన్‌ కొనసాగుతుందని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల ఇంటర్‌ విద్యాశాఖ అధికారి (డీఐఈవో) ప్రశాంత తెలిపారు. గురువారం నుంచి హన్మకొండ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో పేపర్‌ కోడింగ్‌ నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి వచ్చే ఎగ్జామినర్లకు తగిన వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని డీఐఈవో తెలిపారు. 


logo