సోమవారం 01 జూన్ 2020
Warangal-city - May 06, 2020 , 01:15:42

ఆబ్కారీ ఆరా..!

ఆబ్కారీ ఆరా..!

  • వైన్‌షాపుల్లో విస్తృత తనిఖీలు
  • మద్యం నిల్వలపై  ప్రభుత్వానికి నివేదిక 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో గత 44 రోజులుగా ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు మూసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్సైజ్‌ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీజ్‌లను తొలగించి ఆయా షాపుల్లో ఎంత స్టాక్‌ ఉంది? ఏయే లిక్కర్‌ ఎంత స్థాయిలో ఉంది? వంటి వివరాలను సేకరించారు. మొత్తంమీద రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సాగుతున్న కాలంలోనే ఎక్సైజ్‌ అధికారులు వైన్‌షాపుల్లో తనిఖీ చేపట్టడం మందు బాబులకు కిక్‌ కబురే ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 17 బృందాలు 59 వైన్‌ షాపులను తనిఖీ చేశాయి. తనిఖీ చేసే సమయానికి షాపులో ఉన్న స్టాక్‌ ఎంత? అన్న విషయానికే ఎక్కువ (లాక్‌డౌన్‌ సందర్భంగా షాపు సీజ్‌ చేసిన సమయానికి ఉన్న స్టాక్‌తో సంబంధం లేకుండా) ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ములుగు ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని మద్యం దుకాణాల్లో ఎస్సై భారతి తనిఖీలు నిర్వహించారు. మద్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగులోని మహి, పూజ, ఎస్‌ఎస్‌, గణేశ్‌ వైన్స్‌తోపాటు వెంకటాపురం, మల్లంపల్లి మద్యం షాపుల్లో నిల్వలను పరిశీలించినట్లు తెలిపారు. ఆయా షాపుల్లోని మద్యం నిల్వల్లో అవకతవకలను గుర్తించి స్టాక్‌ రిజిస్టర్లను సీజ్‌ చేసినట్లు చెప్పారు. దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యం బాటిళ్ల సంఖ్యను నమోదు చేసుకున్నామన్నారు. అలాగే  ఏటూరునాగారం మండల కేంద్రంలోని మూడు మద్యం షాపుల్లో స్టాక్‌ వివరాలను ఎక్సైజ్‌ సీఐ ఫకీరా నమోదు చేసుకున్నారు. భూపాలపల్లి మండలంలోని మద్యం షాపుల్లో ఎక్సైజ్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మొగుళ్లపల్లిలోని రెండు వైన్‌షాపుల్లో  ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. షాపుల వారీగా నిల్వ ఉన్న మద్యాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి  మండల కేంద్రంలోని సిరి, వీరభద్ర, భద్రకాళీ వైన్స్‌ షాపులను ఆర్డీవో కొమురయ్య, తహసీల్దార్‌ విజయ్‌ తనిఖీ చేశారు. షాపుల్లోని స్టాక్‌ వివరాలను నమోదు చేసుకున్నా రు. జనగామ జిల్లా కేంద్రంలోని అన్ని మద్యం షాపుల్లో ఎక్సైజ్‌ ఎస్సై సుధీర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 19 దుకాణాల్లో స్టాక్‌ను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక  సమర్పించినట్లు ఆయన తెలిపారు. దేవరుప్పుల మం డల కేంద్రంలోని రెండు వైన్స్‌ దుకాణాల్లోని స్టాక్‌ను ఎక్సైజ్‌ ఎస్సై అంజయ్య నేతృత్వంలో కానిస్టేబుళ్లు పరిశీలించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని అన్ని వైన్‌ షాపుల్లో నర్సంపేట ఎక్సైజ్‌ సీఐ శశికుమారి, ఎస్సై నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆయా షాపుల్లో మద్యం నిల్వలను పరిశీలించి నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఎక్సైజ్‌ అధికారుల విస్మయం!

నిల్వల వివరాలను సేకరించేందుకు మద్యం దుకాణాలను సందర్శించిన ఎక్సైజ్‌శాఖ అధికారులు నివ్వెరపోయారు. కొన్ని షాపుల్లో మద్యం నిల్వలు లేకపోగా మరికొన్ని దుకాణాల్లో కేవలం బీర్లు మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మద్యం షాపుల్లోని నిల్వలు లాక్‌డౌన్‌ సమయంలో మాయం కావడం వారిని విస్మయపరిచింది. మద్యం దుకాణాల్లో ఉన్న స్టాక్‌ వివరాలను వెంటనే అందించాలని మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ అధికారులు బృందాలుగా ఏర్పడి వరంగల్‌రూరల్‌ జిల్లాలో 56 వైన్‌షాపులు, 7 బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మద్యం నిల్వల వివరాలను సేకరించారు. 60శాతానికి పైగా మద్యం దుకాణాల్లో స్టాక్‌ లేకపోవడం, తక్కువగా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిసింది. ప్రధానంగా నర్సంపేట, పరకాల పట్టణాల్లోని మెజారిటీ షాపుల్లో మద్యం మాయమైనట్లు ఎక్సైజ్‌ అధికారుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న మద్యం దుకాణాల యజమానులు లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తమ షాపుల్లోని స్టాక్‌ను బయటకు తీసి మార్కెట్‌లో అమ్మినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌కు ముందు సీల్‌ వేసిన సమయంలో మద్యం దుకాణాల్లో ఉన్న స్టాక్‌, ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిశీలించిన ఎక్సైజ్‌ అధికారులు పలు షాపుల నుంచి మద్యం అక్రమంగా మార్కెట్‌కు తరలించారని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.


logo