సోమవారం 01 జూన్ 2020
Warangal-city - May 03, 2020 , 02:51:22

పశుగ్రాసం ఫుల్‌

పశుగ్రాసం ఫుల్‌

  • మూగజీవాలకు తీరిన ఆకలి
  • యాసంగిలో పెరిగిన వరి, మొక్కజొన్న సాగు
  • ఉమ్మడి జిల్లాలో జోరుగా పంటలు
  • కరోనా కాలంలోనూ నిండుగా గ్రాసం

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌ : ఒకప్పుడు పశుగ్రాసం కోసం జిల్లాలు, రాష్ర్టాలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి.. పంటలు పండుతేనే మూగజీవాల ఆకలి బాధతీరేది. లేకుంటే సంతలకు విక్రయించుకోవాల్సి వచ్చేది. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ సర్కారు అధికారంలోకి రావడంతో సాగు నీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడంతో గోదావరి జలాలు బీడు భూములకు అందుతున్నాయి. దీంతో చెరువులను నింపడంతోపాటు పలు ప్రాంతాల్లో కాల్వల ద్వారా వరి సాగు పెరిగింది. ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ ద్వారా జలాలు రావడంతో సస్యశ్యామలమైంది. ఈ యాసంగి సీజన్‌లో ధాన్యంతోపాటు మొక్కజొన్న దిగుబడులు గణనీయంగా పెరిగాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 1,47,181ఎకరాల్లో వరి, మక్కజొన్న పంటలను రైతులు సాగు చేశారు. ఈ జిల్లాలో 1,81,554 ఎద్దులు, ఆవులుండగా, 1,29,628 బర్రెలు ఉన్నాయి. వీటికి 3.66 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరం. ప్రస్తుతం జిల్లాలో 3.890 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం నిల్వ ఉంది. కావాల్సిన పశుగ్రాసం కంటే అదనంగా 0.230 మెట్రిక్‌ టన్నుల ఉండడంతో రైతులు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎకరం గడ్డిని రూ. నాలుగు వేలకు విక్రయిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి పంట వేయడంతో పశుగ్రాసం కొరతలేకుండా పోయింది. ఈ జిల్లాలో 38,125 తెల్ల పశువులు ఉండగా, 67,161 నల్ల పశువులున్నాయి. వీటికి 1.49 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగవుతున్నాయి. పొలాల్లో ఉండే గడ్డిని రైతులు మిషన్లతో కట్టలు కట్టిస్తున్నారు. మొత్తంగా చూస్తే వరి కోతలు పూర్తయ్యాక 1.64 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అంటే పశువులకు అవసరానికంటే 15 వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా నిల్వ ఉండనుంది. జిల్లాలో సుమారు 30 వరకు గడ్డికట్టేయంత్రాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లాలో ఈ యాసంగిలో 40,509 ఎకరాల్లో వరి, మొక్కజొన్న 2597 ఎకరాల్లో సాగైంది. జిల్లాలో 2.13 లక్షల మూగ జీవాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి రోజు ఒక జీవికి  నాలుగు కిలోల పశుగ్రాసం అవసరం ఉండగా 1.54 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ప్రతిరోజు  జీవాలకు కావాల్సిన  దాని కన్నా 1.58 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. జీవాలకు ప్రధానంగా గత జనవరి నుంచి వచ్చే జూన్‌ వరకు వార్షిక ప్రణాళిక ప్రకారం కావాల్సిన 600 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. జూన్‌ నుంచి వానకాలం ప్రారంభమవుతున్నందున పశువులకు, గేదెలకు పచ్చిగడ్డి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 70 శాతం అటవీ ప్రాంతం ఉండడంతో పాటు యాసంగి పంటగా జిల్లాలో 40 వేల ఎకరాల్లో వరి సాగు చేయడంతో అధికంగా పశుగ్రాసం అందుబాటులోకి రానుంది. వరంగల్‌రూరల్‌ జిల్లాలో 2,11,393 ఆవులు, ఎద్దులు, బర్రెలు ఉన్నాయి. వీటికి 2.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎండుగడ్డి అవసరమని అధికారులు అంచనా వేశారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాల రాకతో యాసంగిలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ప్రస్తుతం జిల్లాలో 3.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎండుగడ్డి అందుబాటులో ఉంది. మార్కెట్‌లో ఎండుగడ్డికి ధర కిలోకు సగటున రూ.3 పలుకుతుంది. అందుబాటులో ఉన్న ఎండుగడ్డిని పశువుల యజమానులు భద్రపరిచే పనిలో ఉన్నారు. 

దుర్భిక్ష ప్రాంతంలోనూ పెరిగిన సాగు

ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న జనగామ జిల్లాలోనూ వరి, మొక్కజొన్న సాగు పెరిగింది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్ల నిర్మాణం జరగడం వల్ల చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో జిల్లాలో 1,14,647 ఎకరాల్లో వరి, లక్షా 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఈ జిల్లాలో ఎద్దులు 1,01,886, బర్రెలు 1,19,521, గొర్రెలు 6,16,805, మేకలు 1,14624 ఉన్నాయి. వీటికి  2.63 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరం ఉంటుంది. ఇందులో 2.510 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది. వరికోతలు ఇంకా కొనసాగుతున్నందున గ్రాసం అవసరానికి మించి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఈ యాసంగిలో 65,418 ఎకరాల్లో వరి, 16,981 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పశుగ్రాసం 1,579 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా 1,678 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉందని అధికారులు చెబుతున్నారు. 


logo