శనివారం 30 మే 2020
Warangal-city - May 03, 2020 , 02:49:55

అండగా ఉందాం.. ఆదుకుందాం..

అండగా ఉందాం.. ఆదుకుందాం..

  • ఓర్పుగా ఉంటూ కష్టాలకు ఎదురీదుదాం
  • రోజుకు 1.50 లక్షల ఎంటీల ధాన్యం కొనుగోళ్లు
  • వలస కూలీలను స్వస్థలాలకు పంపుతాం
  • మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి/తొర్రూరు, నమస్తే తెలంగాణ/పెద్దవంగర, పర్వతగిరి: ‘ప్రజాప్రతినిధులూ.. ప్రజలకు అండగా నిలవండి. దాతలను సంప్రదించి, వారితో విరాళాలు సేకరించి, నిరుపే దలను ఆదుకోండి. ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని వారికి రక్షణగా నిలుద్దాం.  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును గౌరవించి ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుందాం’ అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో శనివారం వారు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రోజూ లక్షా 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అన్నారు.  కాళేశ్వరం ప్రాజె క్టు నీటి వల్ల గతంలో కంటే అధిక దిగుబడులు వచ్చాయన్నారు. హమాలీలు, గన్నీ బ్యాగులు, రవాణా సదుపాయాలు, గోదాములు వంటి అనేక సమస్యలు న్నా కావాల్సిన దానికన్నా డబుల్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు, రైతులకు అర్థం అయ్యేలా వివరించాలని మంత్రులు నేతలకు సూ చించారు.  ప్రజలకు, రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నంతగా గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో రైతుల్ని ఆదుకుంటామ ని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు భరోసా ఇచ్చారు. ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రైతులకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందని నేతలకు సూచించారు. ఈ సమయంలోనే పార్టీ ప్రజా ప్రతిని ధులు, నేతలు, శ్రేణులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు కావాలని పిలుపుని చ్చారు. ప్రజల గుండెల్లో పార్టీని, ప్రభుత్వాన్ని నిలపాలని సూచించారు. కరోనా కష్టకాలంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ సాయం అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొ న్నారు.  రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకునేలా సమన్వయం చేయాలని మంత్రులు సూచించారు. అదేవిధంగా  వలస కూలీలను వారి సొంత ఊళ్లకు తరలించడంలో సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దాకా ప్రయత్నాలు చేయాలన్నారు. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, జన గామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జనగామ జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

400 మంది గర్భిణులకు నిత్యావసరాలు పంపిణీ

తొర్రూరులో వందేమాతరం ఫౌండే షన్‌ డైరెక్టర్‌ రవీంద్ర ఆధ్వర్యంలో దాత ల సహకారంతో గిరిజన, చెంచు, కోయ గూడేలు, తొర్రూరు పరిసర ప్రాంతాలకు చెందిన 400 మంది గర్భిణులకు నిత్యావసర సరుకులు, పోషకాహారం కిట్లను అందజేసే కార్యాచరణ చేపట్టగా శనివారం నితిన్‌ భవన్‌ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి ఎన్నో పాశ్చాత్య దేశాలకు నేడు అనుసరణీయంగా మారిందని, మన సంస్కృ తే మన ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశంలో ఎన్నో రాష్ర్టాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. వీఎంఎఫ్‌ డైరెక్టర్‌ రవీంద్ర గర్భిణులకు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. అదేవిధంగా తొర్రూరులోని సాయిరాం ఐరన్‌ షాపు యజమాని, బిల్డర్‌ జమ్ముల అశోక్‌రెడ్డి రూ.2 లక్షలు, అశ్విని థియేటర్‌ పక్షాన బోనగిరి వెంకన్న, పాండురంగ రూ. లక్ష చెక్కును మంత్రి దయాకర్‌రావుకు విశ్రాంతి భవనంలో అందజేశారు. అలాగే పెద్దవంగర మండల కేంద్రంలో శనివారం సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 200 మంది నిరుపేదలకు మంత్రి ఎర్రబెల్లి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో గోదాంల నిర్మాణాలకు స్థల సేకరణతోపాటు పనులను వేగవంతం చేయాలని ఆర్డీవో ఈశ్వరయ్యకు సూచించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రికి తెలంగాణ జాగృతి నాయకులు కోరబోయిన విజయ్‌కుమార్‌, మారుపెల్లి మాధవి 5 వేల మాస్కులను అందజేశారు. అదేవిధంగా పర్వతగిరిలోని తన స్వగృహంలో నూతనంగా నిర్మిస్తు న్న ఇంకుడు గుంతలను మంత్రి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, జెడ్పీటీసీలు మంగళపల్లి శ్రీనివాస్‌, జ్యోతిర్మయి, ఎంపీపీలు చిన్న అంజయ్య, రాజేశ్వరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కాకిరాల హరిప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ గుండె బాబు, గాంధీనాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షుడు సీతారాములు, శ్రీనివాస్‌, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, ఎస్సై నగేశ్‌, కౌన్సిలర్లు, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, ఎంపీడీవో అపర్ణ, సర్పంచ్‌ లక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఐలయ్య, సోమారెడ్డి పాల్గొన్నారు. 


logo