శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - Apr 26, 2020 , 02:57:47

సర్కారు దవాఖానే.. దిక్కూ మొక్కు

సర్కారు దవాఖానే.. దిక్కూ మొక్కు

  • కరోనా దెబ్బకు కార్పొరేట్‌ వైద్యం కకావికలం
  • అత్యవసర సమయాల్లో ఆదుకుంటున్న సర్కారు వైద్యం
  • ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తున్న రోగులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : సర్కారు దవాఖానలకే రోగులు వెళ్తున్నారు. మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం పేదలు, మధ్యతరగతి ప్రజల్లో కలుగడమే ఇందుకు కారణం. ఒకప్పుడు వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ఏ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లినా వందలాదిగా పేషెంట్లు కనిపించేవారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న సమస్యలకు సైతం చికిత్స కోసం వచ్చేవారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దాదాపుగా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ పనిచేయడంలేదు. దీంతో రోగులు అటు వైపు వెళ్లడంలేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో సిబ్బంది రావడంలేదని ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు సాకులు చెబుతున్నా ఇందులో నమ్మదగిన అంశాలు కనిపించడంలేదు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చాక క్రమంగా వైద్యరంగాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. హాస్పిటల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అన్నిరకాల జబ్బులకు చికిత్స అందుతుండడంతో ప్రజలంతా ప్రభుత్వ దవాఖానలకే వస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.

ఓపీ సేవలు బంద్‌ ..

సర్వకాల సర్వావస్థల యందు సర్కార్‌ దవాఖానే దిక్కూ మొక్కూ. కరోనా దెబ్బకు కార్పొరేట్‌ వైద్యం పటాపంచలైంది. ఓపీల్లేవ్‌. ఇన్‌పేషెంట్లు. అదీ అత్యవసరం..బాగా తెలిసిన వారైతే తప్ప అనుమతి లేదు. ఇదీ ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల తీరు. కరోనాతో ప్రైవేట్‌ ఆస్పత్రులు కళావిహీనమయ్యాయి. మా దగ్గర ఓపీ సేవలు బంద్‌ అనే బోర్డులు అనేక ప్రైవేట్‌ ఆస్పత్రుల ముందు దర్శనమిస్తున్నాయి. నిత్యం జాతరను తలపించే వరంగల్‌ మహానగరంలోని ఆస్పత్రుల గేట్లకు తాళాలు కనిపిస్తున్నాయి. కేవలం రెండు మూడు దవాఖానల్లోనే అత్యవసర సేవలను అందిస్తున్నారు. అదికూడా అన్నీ నిర్దారించుకున్న తరువాతే పేషెంట్లు, వారి అటెడెంట్స్‌ను లోపలికి అనుమతిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 184 ప్రైవేట్‌ ఆస్పత్రులు, 46 నర్సింగ్‌హోమ్స్‌ ఉన్నాయి. ఇందులో అత్యధిక దవాఖానలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దివాళా తీయడం ఖాయమని వాటి నిర్వాహకులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, తుమ్ములున్న వారేవరైనా వస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలోనే తాము ఆస్పత్రులు తెరవడం లేదని జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు పేర్కొంటున్నారు. మరోవైపు ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ గణనీయంగా తగ్గింది. కరోనాకు ముందు ఎంజీఎం ఓపీలో రోజుకు 1500 నుంచి 2000 మంది వరకు రోగులు వచ్చేవారు. కరోనా అనంతరం మూడు నుంచి నాలుగు వందలు మించడం లేదని ఓపీ రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎంజీఎంలో డయాబెటిక్‌ పేషెంట్లకు వారి నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం డయాలసిస్‌ చేస్తున్నారు. ఎంజీఎంలో అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉన్నా గతంతో పోలిస్తే ప్రజలు ఎక్కువ రాకపోవడానికి లాక్‌డౌన్‌ వల్ల పూర్తి విశ్రాంతి తీసుకోవడమే కారణంగా చెబుతున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదాలు లేకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. 

ప్రభుత్వ దవాఖానలపైనే నమ్మకం

 లాభార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ దవాఖానల్లో భారీగా ఫీజులుండడంతో పేదలు ఇబ్బందిపడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.. సర్కారు దవాఖానల్లో సౌకర్యాలు పెరగడం, మెరుగైన చికిత్స అందిస్తుండడంతో రోగులంతా అటువైపే వెళ్తున్నారు. కరోనా వైరస్‌ దెబ్బకు మహబూబాబాద్‌ జిల్లాలో ప్రైవేట్‌ దవాఖానల తలుపులు తెరుచుకోలేదు. పేరుకే ప్రజాసేవ అని చెబుతున్నా ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనగామ జిల్లాలో 60 ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ఉన్నా వీటిలో 10 దవాఖానలైనా పనిచేయడంలేదు. ములుగు జిల్లా కేంద్రంలో ఐదు ప్రైవేటు ఆస్పత్రులతో పాటు మల్లంపల్లి, గోవిందరావుపేట, పస్రాలో ఉన్న ఒక్కో దవాఖాన, ఏటూరునాగారంలోని మూడు ప్రైవేటు దవాఖానల్లో జ్వరం, ప్రసూతి సేవలకు చికిత్స అందించేవారు. 

ఈ నేపథ్యంలో జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సర్కారు వై ద్యం అందుతోంది. ఒకప్పుడు భూపాలపల్లి, నర్సంపేట, పరకాల పట్టణాల్లోని పలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు నిత్యం వందలాది మంది రోగులు వస్తుండేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో పేషెంట్లు రావడంలేదని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి. జ్వరం, జలుబుతో బాధపడుతున్న రోగులు వస్తే ప్రభుత్వ దవాఖానలకు పంపుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ జిల్లాల పునర్విభజన చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, వసతులు కల్పించడంతో ప్రజలంతా ప్రభుత్వ దవాఖానాలకే వస్తున్నారు. మరోవైపు నకిలీ వైద్యుల ఆట కట్టించడంతో పాటు వారు అందించే అనవసరపు చికిత్స విధానంపై కేసులు నమోదు చేయడంతో ప్రైవేటు ఆస్ప్రతుల జోరు తగ్గి సర్కారు దవాఖానలకు ప్రాధాన్యం పెరిగింది.

ఎంజీఎం సేవలు అద్భుతం

హెల్త్‌ స్కీం కార్డులు ఉన్నవారికి సైతం ప్రైవేట్‌ దవాఖానల్లో ఓపీ వైద్యసేవలు అందించడం లేదు. లాక్‌డౌన్‌ సాకుతో వైద్యసేవలను నిలిపివేసి అత్యవసరసేవల పేరుతో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వ్యా పారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రైవేట్‌కు దీటుగా ఎంజీఎం దవాఖాన వైద్య సేవలు అందిస్తున్నది. 

-ఎం ప్రవీణ్‌కుమార్‌, ప్రైవేట్‌ ఉద్యోగి

మూసే ఉంటున్నాయి

జనగామలో దవాఖానలుండే వీధులు బోసిపోయాయి. హాస్పిటల్స్‌కు తాళాలేసి కనిపిస్తున్నాయి. కరోనా భయంతో డాక్టర్లు ఎవరూ వస్తలేరు. డాక్టర్లే భయం భయంగా ఉంటే ఎట్లా. ప్రభుత్వ వై ద్యులు పనిచేస్తాండ్లు కదా. వాళ్లు కూడా డాక్టర్లే కదా.

-నాగేశ్వర్‌రావు, జనగామ ప్రైవేట్‌ దవాఖానలు 

ఎందుకు తెరుచుకోవడం లేదు

చిన్నచిన్న జ్వరాలస్తేనే బోలెడు పరీక్షలు చేసి, డబ్బులు దోచుకునే ప్రైవేట్‌ దవాఖానలు ఇప్పుడెందు కు మూతబడ్డాయి. కరో నా వైరస్‌తో తమ ప్రాణాలకు ఆటంకం కలుగుతుందని తాళాలు వేసుకున్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించాలి 

-బొమ్మనపల్లి శ్రీనివాసాచారి, ఎల్‌ఐసీ ఏజెంట్‌, మహబూబాబాద్‌

అత్యవసరమైతేనే రావాలి

కరోనా సీజన్‌లో ప్రజలకు నిరంతరం వైద్యసేవలను అందించాల్సి ఉన్నప్పటికీ దవాఖానలో పనిచేసే సిబ్బంది ముందుకు రావడంలేదు.వారి కుటుంబసభ్యుల ఒత్తిడితో  దవాఖానలను మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఎవరు దవాఖానలకు రావడంలేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసరమైన వారికే చికిత్స అందిస్తున్నాం.

-డాక్టర్‌ ప్రవీణ్‌చందర్‌, ములుగు 

గర్భిణులకు సేవలు అందిస్తున్నాం

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సేవలు అందిస్తున్నాం. గర్భిణులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. సాధారణ పరీక్షలు, ఓపీలను చూడడం లేదు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. దగ్గు, జలుబు ఉన్న రోగులు వస్తే వారిని ప్రభుత్వ దవాఖానలకు పంపిస్తున్నాం. రోగులు కూడా సహకరిస్తున్నారు. 

-డాక్టర్‌ నవత, గైనకాలజిస్ట్‌, నర్సంపేట

ఇలాగే కొనసాగితే కష్టమే 

ఎమర్జెన్సీ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నవారికి వైద్యసేవలు అందుతున్నాయి. హన్మకొండలోని  దవాఖానలో అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాం. కరోనా ప్రభావంతో పెద్దపెద్ద దవాఖానలు దివాళా తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ స్వీయనిర్బంధంలో ఉండడం వల్ల 30 శాతం రోగాలు తగ్గిపోయాయి. పనిచేసే సిబ్బంది కూడా రావడంలేదు. లాక్‌డౌన్‌ తీసేసినా ఇంకో సంవత్సరం కూడా పరిస్థితి ఇలాగే కొనసాగేలా ఉంది.

-కరుణాకర్‌ రెడ్డి, కార్పొరేట్‌ దవాఖాన చైర్మన్‌, హన్మకొండ 

అత్యవసర సేవలకే రావాలి

పెద్ద పెద్ద దవాఖానల్లోనూ ఓపీ సేవలను నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తున్నాం. మామూలు సమస్యలతో దవాఖానలకు రావొద్దు. ఐఎంఏ తరఫున టెలీ మెడిసిన్‌ ఏర్పాటు చేశాం. అన్ని రకాల వైద్యసలహాలు, సూచనలు చేస్తున్నాం. దగ్గు, జ్వరం, తలనొప్పి కోసం వస్తే ప్రభుత్వ దవాఖానలకు పంపిస్తున్నాం. 

- డాక్టర్‌ కొత్తగట్టు శ్రీనివాస్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు


logo