శనివారం 06 జూన్ 2020
Warangal-city - Apr 25, 2020 , 03:04:08

చెడగొట్టు వాన

చెడగొట్టు వాన

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం, ఐనవోలు మండలంతోపాటు కమలాపుర్‌లోని పలు గ్రామాలు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేట, జనగామ జిల్లాలోని లింగాలఘనపురం, దేవరుప్పుల మండలాల్లో ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం పడింది. లింగాలఘనపురంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలో చెట్లు నేలకొరిగాయి. ధాన్యం కుప్పలు తడిశాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాళ్లవాన పడింది. కాళేశ్వరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ కరంటు తీగలపై పడింది. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, చెన్నాపూర్‌, దామరంచపల్లి, కనిపర్తి గ్రామాలతో పాటు మల్లంపల్లిలో రాళ్ల వర్షం కురిసింది.  మహాముత్తారంలో పడిన వర్షానికి ధాన్యం తడిసింది. పలువురి ఇళ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో వర్షంతో కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలకు నష్టం కలిగింది. గ్రామాల్లో చెట్ల కొమ్మలు సైతం విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అజంజాహి మిల్స్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్‌ షెడ్లు కూలిపోయాయి.


logo