శనివారం 06 జూన్ 2020
Warangal-city - Apr 23, 2020 , 03:04:00

కష్టంలో ఆదుకున్నోడే సిపాయి

కష్టంలో ఆదుకున్నోడే సిపాయి

 • కంట్రోల్‌ ఉన్నదని నిర్లక్ష్యం చేస్తే అసలుకే మోసం 
 • ధాన్యం కొనుగోలు ఆగదు.. ఎరువులు తెచ్చిపెడుతున్నం
 • సైనికుల లెక్క పనిచేసేవాళ్లకు మనోధైర్యం ఇవ్వాలి 
 • ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో మంత్రి ఎర్రబెల్లి 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ‘ప్రజల ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేసి కాపాడుతం. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం. వైరస్‌ కంట్రోల్‌లో ఉన్నదని నిర్లక్ష్యం చేయొద్దు. తెల్వకుంట పానాల మీదికి వస్తుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో దాతలు ముందుకొస్తున్నరు. ఇంకా ముందుకు రావాలి. కష్టకాలంలో ఆదుకున్నోడే సిపాయి..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కరోనా వైరస్‌ కట్టడిలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అసలుకే మోసం వ స్తది. సీఎం కేసీఆర్‌ పిలుపునకనుగుణంగా లాక్‌డౌన్‌ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన కోరారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు పండించిన పంటలను రూ.30 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదని వివరించారు. మంత్రి ఎర్రబెల్లి బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

  నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ పొడిగించిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది? 

  ఎర్రబెల్లి : ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైందేనని అన్ని వర్గాల ప్రజలు అంటున్నరు. పొడిగించకుంటే చాలా ఇబ్బందులు వచ్చేవి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అసలుకే మోసం వస్తది. అందుకే అందరూ మరింత జాగ్రత్తగా ఉండాలె.  

  రాష్ట్రంలో సూర్యాపేట, నిజామాబాద్‌ వంటి జిల్లాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి.  వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి అదుపులో ఉన్నట్టేనా? 

  ఉన్నట్టుండి పూరిగుట్టలో పదేండ్ల బాలికకు కరోనా సోకింది. ఇలాంటి కేసులు కొద్దిగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముందు జాగ్రత్తే మందు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కొద్దిగా పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు వైద్యు లు చెబుతున్నారు. ములుగు జిల్లాలో పాజిటివ్‌ వచ్చి న ఇద్దరు కోలుకున్నరు. మహబూబాబాద్‌, జనగామలో కూడా కోలుకుంటున్నరు. అర్బన్‌లో కూడా చాలా మందే ఇంటికి వచ్చిండ్లు. 

  కరోనాపై రాత్రింబవళ్లు కష్టపడే వైద్యులకు సరైన సౌకర్యాలు లేవనే వాదన ఉంది. దీనికి మీరేమంటారు? 

  మొదట్లో కొంత ఇబ్బందులున్నమాట నిజమే. కానీ ఎంజీఎంలో, జనగామలో వైద్యులకు కావాల్సిన పీపీ ఈ కిట్లు పంపిణీ చేసినం. అన్ని ఆస్పత్రులకు అవస రం అయితే ఎంత ఖర్చయినా వెనుకాడం. నిజానికి డాక్టర్లు దేవుళ్ల కంటే ఎక్కువ కష్టపడుతున్నరు. ఎవరికీ ఏమీ కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నం. పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్క ర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు అందరూ కుటుంబాల ను, పిల్లలను వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్న రు. ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకుంటది. 

  ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం ఎలా ఉంది? 

  ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు రోడ్లమీదే ఉండి ప్రజలకు ధైర్యం ఇవ్వాలని సీఎం చెప్పారు. నేను, మంత్రి సత్యవతి రాథోడ్‌, మా ఎమ్మెల్యేలు అంద రూ, గ్రామాల్లో సర్పంచ్‌లు బాగా కష్టపడుతున్నరు. పల్లె ప్రగ తి ఫలితం ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నది. ఇక ఆరు జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్‌, ఎస్పీలు బాగా కష్టపడుతున్నారు. సమన్వయంతో పనిచేయడం వల్లే కరోనా కట్టడిలో ఉంది.  

  నిరుపేదలకు సాయం చేసేందుకు కొన్ని వర్గాలు ముందుకొస్తున్నాయి? దీనిపై మీరు ఏం చెబుతారు?  

  దాతలు ముందుకొస్తున్నరు. నేను మా ట్రస్ట్‌ నుంచి దాతల సాయంతో ఇప్పటికే రూ. కోటి జమచేసి ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా నిరుపేదలకు, పారిశుధ్య కార్మికులకు, ఆటో డ్రైవర్లు, ఆశవర్కర్లకు సహాయం చేస్తు న్న. ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలు వాళ్ల నియోజకవర్గాల్లో సహాయం చేస్తున్నారు. ఎమ్మెల్సీలు కూడా ముందుకొచ్చి చేస్తున్నరు. ఇంకా దాతలు ముందుకురావాలి.  

  ఒకవైపు రైతులు పండించిన పంటల కొనుగోలు సాగుతున్నది. రైతులు కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు? దీనికి మీ సమాధానం? 

  ఈ పరిస్థితి త్వరగా పోవాలె అంటే మనం లాక్‌డౌన్‌ ను ఇంకా కట్టుదిట్టంగా పాటించాలి. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రైతులు పండించిన పంటలను అన్నింటినీ కొంటామని సాక్షాత్తు సీఎం ప్రకటించా రు. రైతులెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. మొ న్న క్యాబినెట్‌ మీటింగ్‌ల అన్ని రకాల పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎరువులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం.  

  వ్యవసాయ కూలీల సమస్యను అధిగమించడానికి ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మీరు కేంద్రాన్ని కోరారు? దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారా? 

  దేశమంతా ఇదే డిమాండ్‌ ఉన్నది. కరోనా వల్ల పల్లె ల్లో కూలీల సమస్య ఉన్నమాట వాస్తవమే. అయినా ఉపాధి పనులకు ఢోకాలేదు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని దేశంలో కేంద్రాన్ని కోరిన తొలి రాష్ట్రం తెలంగాణే. సీఎం కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడారు. దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. 


  logo