గురువారం 04 జూన్ 2020
Warangal-city - Apr 21, 2020 , 02:48:02

నిబద్ధతకు నజరానా..

నిబద్ధతకు నజరానా..

  • రెప్పవాల్చని పోలీస్‌కు రెట్టింపు ఉత్సాహం
  • 10 శాతం సీఎం గిఫ్ట్‌తో హర్షాతిరేకాలు
  • కష్టకాలంలోనూ సేవలకు గుర్తింపు

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి,  తెలంగాణ : కరోనా కాలంలో కాఠిణ్యాన్ని పక్కనపెట్టి కరుణత్వం చూపుతున్న పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నజరానా ప్రకటించారు. వారి విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధతకు ఏమిచ్చినా తక్కువే అని కొనియాడారు. కంటిమీద కును కు లేకుండా పహారా కాస్తున్న పోలీసులకు వారి వేతనాల్లో పది శాతం సీఎం గిఫ్ట్‌ ఇచ్చారు. కరోనా కట్టడిలో అతిముఖ్యమైన లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రోడ్లమీద జనం గుమికూడకుండా చేయడం, సాయంత్రం నాలుగు నుంచి తిరిగి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. పోలీసులంటే బెదిరిచ్చుకొని తింటారు. ‘ఖాకీ యూనిఫాం చూపి గల్లా ఎగరేస్తారు.. నక్రాల్‌ చేస్తే థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారు’లాంటి రకరకాల మాటలు చెల్లుబాటులో ఉన్నా ఈ కరోనా కాలంలో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. లాఠీలు విసిరే చేతులను జోడించి ఇళ్లల్లోనే ఉండమని విజ్ఞప్తి చేస్తున్నారు. హోం గార్డు నుంచి జిల్లా, కమిషనర్‌, అత్యున్నత స్థాయి అధికారుల వరకు విధి నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. ఇప్పుడంతా సమాజంలో శాంతిభద్రతల సమస్య కాదు, కరోనా కట్టడి సమస్యే అంటున్నారు. నెత్తి మీద సూరీడు ప్రతాపం చూపుతున్నా సకాలంలో గుక్కెడు నీళ్లుదొరక్కపోయినా వంతుల వారీగా కరోనా కట్టడికి తామే వంతెనగా గస్తీ తిరుగుతున్నారు. తొవ్వల మీదే బువ్వ తింటూ క్వారంటైన్‌ ప్రకటించిన ప్రాంతాల్లో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ముఖ్యమంత్రి గిఫ్ట్‌గా వారి వేతనాలకు అదనంగా 10 శాతం ప్రకటించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. తమ కష్టానికి తగిన గుర్తింపు అని పేర్కొనడమే కాకుండా తమ కర్తవ్యాన్ని మరింత పెంచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు 5500 మంది పోలీసులు సీఎం గిఫ్ట్‌ను అందుకోబోతున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాలతోపాటు మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అన్ని స్థాయిల పోలీసులు సీఎం నిర్ణయానికి సెల్యూట్‌ చేయడమే కాకుండా ఈ ప్రకటన తమ బాధ్యతను మరింత పెంచే క్రమంలో పొందిన గౌరవం మాత్రమే కాదని, ఈ నిర్ణయం సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని చెబుతున్నారు. 

సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది

లాక్‌డౌన్‌తో  రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బందికి వేతనంతోపాటు 10 శాతం అదనంగా ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన వారిలో ఉత్సాహాన్ని నింపింది. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు వారు కృషి చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల శ్రేయస్సే ప్రాధాన్యంగా పని చేస్తున్న పోలీ సులను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. 

- డాక్టర్‌ వీ రవీందర్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. కష్టకాలంలోనూ పూర్తిస్థాయి వేతనంతో పాటు అదనంగా 10 శాతం ఇవ్వడం సంతోషంగా ఉంది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ జిల్లాలో పని చేస్తున్న పోలీసులందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. 

- నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ. మహబూబాబాద్‌

పోలీసులపై మరింత బాధ్యత 

పోలీసుల సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌ 10 శాతం అదనపు వేతనం అందించడంతో మరింత బాధ్యత పెరిగింది. కరోనా కట్టడికి పోలీసు  సిబ్బంది రాత్రింబవళ్లూ విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని వమ్ము చేయకుండా జయశంకర్‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సమర్థవంతంగా పనిచేస్తాం.

 -డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ (ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్ల్లాల ఎస్పీ)



logo