బుధవారం 03 జూన్ 2020
Warangal-city - Apr 14, 2020 , 03:16:36

పాస్‌బుక్‌ లేకపోయినా కొంటాం

పాస్‌బుక్‌ లేకపోయినా కొంటాం

  • మక్కలకు ఎకరానికి 25 క్వింటాళ్ల నిబంధన తొలగింపు
  • ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
  • రైతులు ఆందోళన చెందొద్దు
  • వరంగల్‌లో గన్నీ బ్యాగుల తయారీ కేంద్రం
  • లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలి
  • సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

 వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి/హన్మకొండ నమస్తే తెలంగాణ, ఏప్రిల్‌ 13: పట్టాదారు పాసుపుస్తకం లేని రైతులు పండించిన మక్కలు, ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. హన్మకొండ నందనా గార్డెన్‌లో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల్లో మక్కలు, ధాన్యం కొనుగోలు, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలపై సోమవారం రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతుల నుంచి మక్కలు, ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. మక్కలకు సంబంధించి గతంలో ఉన్న ఎకరానికి 25 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన ప్రభుత్వం తొలగించిందని, వ్యవసాయ విస్తరణ అధికారి పంట దిగుబడిని అంచనా వేసి టోకెన్‌ ఇస్తే సరిపోతుందని, పూర్తి మార్గదర్శకాలను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారని దయాకర్‌రావు వెల్లడించారు. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయనున్నామని, రైతు 50 శాతం ప్రభుత్వం మిగతా 50 శాతం కూలి చెల్లించాలని పేర్కొన్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరపై రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తే అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. కొనుగోలు చేసిన పంటలకు స్టోరేజీ సమస్య లేకుండా అవసరమైన గోడౌన్లు సమ కూర్చాలని, ప్రైవేటు భవనాలు, ఫంక్షన్‌ హాల్స్‌ను గుర్తించాలని అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో గన్నీ బ్యాగుల తయారీ కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, త్వరలోనే భూ సేకరణ చేసి ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల తోపా టు దేశం, ప్రపంచం అంతా హర్షిస్తున్నదన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నా రు. అన్నదాతలు గుంపులుగా రావొద్దని,  టోకెన్లు జారీ చేసిన క్రమంలో కొనుగోలు చేస్తా మన్నారు. రైతులు సొంత గన్నీ సంచుల్లో పంట తెచ్చుకొంటే ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం చెల్లి స్తున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎమ్మెల్యేలు తనిఖీలు, ప్రారంభోత్సవాలు చేయొద్దని, ఎందుకంటే వారు వెళ్తే భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా ఉండే అవకాశం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించేలా పోలీసులు నిఘాపెట్టాలని సీపీని కోరారు. కొనుగోలు చేసిన పంటలకు స్టోరేజీ సమస్యలు లేకుండా కలెక్టర్లు అవసరమైన గోదాములు గు ర్తించాలన్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో పంటలను నిల్వ చేసుకొనే రైతులకు వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు సీఎం తీసుకొనే నిర్ణయాలకు కట్టుబడి ఉందామన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు కొనసా గనున్న లాక్‌డౌన్‌కు సహకరించాలని మంత్రి ప్రజలను కోరారు. అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు  92 కేంద్రాలు ఏర్పాటు చేసి  33 ప్రారంభించామన్నారు. 33లక్షల గొనె సంచులు అవసరమున్నట్లు తెలిపారు. అలాగే మక్కల కొనుగోలుకు 58 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 113 కేంద్రాలు ప్రారంభించామని, మక్కల కొనుగోలుకు ఇప్పటివరకు 52 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 52,709 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామని వివరించారు. 30,84, 700 గన్నీ సంచులు అందుబాటులో ఉండగా, ఇంకా అవసరం ఉన్న 14 లక్షల గన్నీ సంచులను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అరూరి రమే శ్‌, చల్లా ధర్మారెడ్డి, సతీశ్‌కుమార్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, మార్క్‌ఫెడ్‌ జీఎం భాస్క రాచారి, జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, డైరెక్టర్లు,  అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారులు పాల్గొన్నారు. 

హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కారం

  • రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మార్క్‌ఫెడ్‌ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాలపై ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తాం. రైస్‌ మిల్లుల వద్ద హమాలీల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. నిధుల కొర త లేదు. ప్రభుత్వం రూ.32 కోట్లు కేటాయించింది. ప్రభుత్వానికి క్వింటాలుకు రూ.400 నుంచి రూ. 500ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉన్నా లెక్క చేయకుండా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.10లక్షల గోనె సంచులు కొనుగోలు చేసేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశాం.


logo