బుధవారం 27 మే 2020
Warangal-city - Apr 09, 2020 , 02:36:46

సైబర్‌ రొమాన్స్‌ @2000 కోట్లు

సైబర్‌ రొమాన్స్‌ @2000 కోట్లు

ఒంటరి యువకులకు వలపు వల

అందమైన ప్రొఫైల్స్‌తో బోల్తాకొట్టించే కాల్‌సెంటర్లు

డేటింగ్‌సైట్లు, ఫ్రెండ్‌షిప్‌ యాప్‌ల పేరిట మోసాలు

నెలకు రూ.2 కోట్ల వరకు కొల్లగొడుతున్న ఒక్కో కాల్‌సెంటర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ధనవ్యామోహం, స్త్రీవ్యామోహం కొన్నిసార్లు మనిషిని ఎంతకైనా దిగజారేలా చేస్తుంది. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇంటర్నెట్‌లో డేటింగ్‌ వెబ్‌సైట్‌లు, ఫ్రెండ్‌షిప్‌యాప్‌ల పేరుతో వల విసురుతూ.. అమ్మాయిలతో స్నేహం, రొమాంటిక్‌ చాటింగ్‌ పేరిట ఒంటరిగా ఉండేవారిని టార్గెట్‌ చేసుకుంటున్నారు. వీరి చేతికి చిక్కుతున్నది ఎక్కువ శాతం విద్యావంతులే. సైబర్‌ రొమాన్స్‌ కోసం ఇంటర్నెట్‌లో వివిధ పేర్లతో 14వేలకు పైగా వెబ్‌సైట్లు ఉండగా, వాటి చాటున మన దేశంలో ఏటా రూ.2000 కోట్ల వరకు మోసాలు జరుగుతున్నాయన్నది అనధికారిక అంచనా. ఇంటర్‌నెట్‌ ఆధారంగా జరిగే మోసాలలో సైబర్‌ రొమాన్స్‌ నాలుగో స్థానంలో ఉంది.

ముగ్గులోకి గుంజి మోసం చేస్తారు

సామాజిక మాధ్యమాల్లో అకౌంట్‌లేని యువత ఉండరు. అవివాహితులు, విద్యార్థులు, ఒంటరివారిని మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. వీరిని ఆకర్షించడానికి ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లో అమ్మాయిల పేరుతో ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. లేదా వారు ఎక్కువగా లాగినయ్యే వెబ్‌సైట్లలో డేటింగ్‌సైట్‌లకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్లను పోస్ట్‌ చేస్తారు. లేదా వారి ఈ మెయిల్‌ అడ్రస్‌లు సంపాదించి, నేరుగా వాటికే పంపుతారు. లేదా ఫోన్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతారు. ఒక్కసారి వారి రిక్వెస్ట్‌ను అంగీకరించగానే వారి ప్రణాళిక మొదలవుతుంది. తొలుత ఫోన్‌ సంభాషణ మొదలవుతుంది. లేదా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌లలో మొదట చాటింగ్‌ చేస్తారు. ఆ తరువాత అది ఆడియో, వీడియో కాల్స్‌ దశకు చేరుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య లైంగికపరమైన సంభాషణలు, చర్యలు (ఫోన్‌లోనే) జరుగుతాయి. బాధితుడికి తెలియకుండా నేరగాళ్లు ఈ తతంగమంతటినీ రికార్డు చేస్తారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ పేరిట కొంతమొత్తం లాగుతారు. తరువాత డేటింగ్‌కు వచ్చే అమ్మాయి భద్రతకోసమంటూ భారీ మొత్తంలో డిపాజిట్‌ చేయాలంటారు. తియ్యటి గొంతుతో మాట్లాడే అమ్మాయి రొమాంటిక్‌ సంభాషణలతో సదరు బాధితుడిని ముగ్గులోకి దించుతుంది. తన అవసరాలకంటూ చిన్న మొత్తంలో ఆమె కూడా డబ్బు లాగడానికి ప్రయత్నిస్తుంది. బాధితుడికి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే బెదిరింపులు మొదలవుతాయి. వీడియో చాటింగ్‌ రికార్డులను బయటపెడుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తారు. దీంతో బాధితుడు నిండా మునుగుతాడు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన మహిళ అతడి నుంచి రూ.12 లక్షల వరకు స్వాహా చేసింది. 

కాల్‌సెంటర్‌ ఆదాయం నెలకు రూ.2 కోట్లు

డేటింగ్‌ పేరుతో ఆకర్షించే ముఠాలు దేశ్యాప్తంగా కాల్‌సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాలలో యువతులను ఉద్యోగాలలో నియమించుకొని వారి ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొన్నిచోట్ల యువకులే వాయిస్‌చేంజ్‌ యాప్‌లతో యువతుల్లాగా ఫోన్లలో మాట్లాడుతుంటారు. కాల్‌సెంటర్‌లో పనిచేసే ఒక్కో యువతి రోజుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు బాధితుల నుంచి వసూలు చేయాలని టార్గెట్లు నిర్ణయిస్తారు. ఈ విధంగా ఒక్కో కాల్‌సెంటర్‌ నెలకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది.

సర్వీస్‌ ప్రొవైడర్లతో కుమ్మక్కు

వలలో పడ్డ యువకుడికి, మోసగాళ్లు నియమించిన అమ్మాయికి మధ్య సాగే ‘రొమాంటిక్‌' సంభాషణ కనిష్ఠంగా 20 నిమిషాలు ఉంటుంది. ఇందుకోసం కాల్‌సెంటర్ల ముఠా ఇచ్చే ప్రీమియం నంబర్‌కే యువకులు ఫోన్‌ చేయాలని చెప్తారు. ఈ నంబర్లు కొన్నిసార్లు తొమ్మిది అంకెల్లోనే ఉంటాయి. దీనికి ఫోన్‌ చేసినప్పుడు ఒక నిమిషానికి రూ.15 నుంచి రూ.20 వరకు కట్‌ అవుతుంది. యువతి మాట్లాడే సమయాన్ని బట్టి ఆమెకు కూడా కమిషన్‌ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ముఠాలు సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్లను లీజుకు తీసుకొని, సాఫ్ట్‌వేర్‌ సాయంతో అధికమొత్తంలో యువకుల ఫోన్‌ నుంచి బిల్‌ కట్‌ చేయించి తమ ఖాతాల్లో వేసుకుంటారు. 

బట్టలు విప్పించారు

గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన త్యాగి (పేరు మార్చాం) ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. పలు డేటింగ్‌ సైట్లలో సభ్యత్వం తీసుకున్నాడు. ఓ యువతి అతడిని వీడియో చాటింగ్‌ చేద్దామని ఆహ్వానించింది. ఇద్దరూ వెబ్‌క్యామ్‌ ముందు చేరారు. ఆ యువతి తన ముఖం కనిపించకుండా వస్ర్తాలను తొలగించి నగ్నంగా నిలుచుంది. ఇటువైపు త్యాగిని కూడా అలాగే బట్టలు విప్పేయాలని చెప్పింది. ఇద్దరి మధ్య అలా దాదాపు ఓ అరగంటపాటు చాటింగ్‌ జరిగింది. మూడు గంటల తరువాత త్యాగి ఫోన్‌కు ఓ లింకుతో కూడిన సమాచారం వచ్చింది. దాన్ని క్లిక్‌ చేయగా, తాను బట్టలులేకుండా ఉన్న వీడియో కంటపడింది. అదే సమయంలో ఫోన్‌చేసిన యువతి.. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టానని, దానిని తొలగించాలంటే వెంటనే తన అకౌంట్‌కు రూ.లక్ష ట్రాన్స్‌ఫర్‌ చేయాలని బెదిరించింది. త్యాగి తనవద్దనున్న రూ.80వేలు వెంటనే ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో ఆ వీడియోను తొలగించింది. 

అప్రమత్తతతోనే అడ్డుకట్ట

సైబర్‌ రొమాన్స్‌ లేదా డేటింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా జరిగే మోసాలను అప్రమత్తతతోనే ఎదుర్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చాలామంది నిర్వాహకులు తాము అందించే డేటింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా మోసాలు జరిగితే బాధ్యత తమది కాదంటూ షరతులు పెడుతుంటారు. మీకు పంపిన ఫొటోలోని యువతి ఎవరో గూగుల్‌ ఇమేజ్‌ మ్యాచింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. డబ్బు ప్రస్తావన వచ్చిందంటే వెంటనే అనుమానించాలి. 


logo