గురువారం 28 మే 2020
Warangal-city - Apr 09, 2020 , 02:34:04

దాతృత్వాన్ని చాటండి

దాతృత్వాన్ని చాటండి

పేదలకు ఆసరాగా నిలువండి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెలంగాణ/పర్వతగిరి : మానవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అందరూ కృషి చేయాలని, అన్ని వ్యవస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్న తరుణంలో వ్యాపారులు, ధనవంతులు పెద్దమనుసుతో పేదలకు అండగా నిలిచేందుకు దాతృత్వాన్ని చాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఐదు కేజీల బియ్యం, దాతల సహకారంతో మాస్కులు, శానిటైజర్లను అందజేయడంతో పాటు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుపర్చే ప్రక్రియలో భాగంగా టెక్నాలజీని వినియోగించుకొని వలంటీర్ల సహకారంతో కావల్సిన సరుకులు నేరుగా ఇంటికి సరఫరా చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా పర్వతగిరి మండల కేంద్రంలో మహిళలకు మాస్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతిసారి ప్రభుత్వ నిధులతో చేసే అభివృద్ధి లెక్కకు వచ్చేది కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసినవారే నిజమైన ప్రజాప్రతినిధులుగా మిగులుతారని అన్నారు. వార్డుల్లో ఎవరూ అనారోగ్యం పాలైనా వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కౌన్సిలర్లపై ఉంటుందన్నారు. దాతలు తనను కలిసి ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలుస్తామని దాతృత్వాన్ని చాటుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు స్వయంగా తీసుకెళ్లి విరాళాలు ఇప్పిస్తున్నానని తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 28 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇవన్నీ జమాతేతో ముడిపడి ఉన్నవేనని, ఢిల్లీకి వెళ్లి కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న వారి కుటుంబాలకు ఇది సోకకపోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వచ్చిన ఫలితాల్లో అన్ని నెగెటివ్‌ రిపోర్టులు రావడంతో ఊపిరి పీల్చుకున్నామని, కరోనా విస్తరించకుండా అధికారులు కూడా బాగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

మహబూబాబాద్‌ కలెక్టర్‌ పనితీరు బాగుంది

మహబూబాబాద్‌ జిల్లాలో కరోనా కట్టడికి, నిత్యావసర, కూరగాయల ధరలు పెరుగకుండా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కష్టపడి పని చేస్తున్నారని, వారి పనితీరు బాగుందని మంత్రి దయాకర్‌రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, తహసీల్దార్‌ రమేశ్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ జినుగ సురేందర్‌రెడ్డి, కమిషనర్‌ గుండె బాబు, సీఐ వీ చేరాలు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ మండల, పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్‌, బట్టల వర్తక సంఘం ప్రతినిధులు కూరపాటి సోమయ్య, పెరుమాండ్ల చక్రపాణి, వ్యాపారులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. 


logo