శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - Apr 09, 2020 , 02:32:04

యాసంగి ధాన్యం కొనుగోలుకు రెడీ

యాసంగి ధాన్యం కొనుగోలుకు రెడీ

1.80 లక్షల టన్నులు కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక

తొలుత 113 కేంద్రాలకు అనుమతి

అవసరాన్ని బట్టి మరిన్ని సెంటర్లు

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు

ధాన్యం కొనుగోలుపై జిల్లా అదనపు  కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి

వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: ‘యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. తొలి విడత 113 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాం. వీటి నిర్వహ ణ బాధ్యతలు పీఏసీఎస్‌లు, ఐకేపీ, జీసీసీకి అప్పగించాం. అవసరానికి సరిపడా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. రైతుకు ముందుగానే కూపన్లు ఇస్తాం. కొన్న ధాన్యాన్ని జిల్లాలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు కేటాయిస్తాం. మిల్లులకు తరలించేందుకు ఐదుగురు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారు. గన్నీ సంచుల కొరత కూడా ఉండదు’ అని వరంగల్‌ రూరల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ఆర్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఓపెనింగ్‌కు జరిగిన ఏర్పాట్లపై ఆయన ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. 

1.80 లక్షల టన్నుల లక్ష్యం..

యాసంగి సీజన్‌లో 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక రూపొందించాం. వీటిని జిల్లాలో ని 27 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు ఇస్తాం. మిల్లువారీగా ధాన్యం కేటాయింపుపై నేడో రేపో స్పష్టత రానుంది. తొలివిడత 113 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం వీటి ఏర్పాటుతో కొనుగోలు ప్రారంభిస్తాం. మొత్తం 230 సెంటర్లు నెలకొల్పాలనే ప్రతిపాదన ఉంది. ధాన్యం కొనుగోలు ఊపందుకుంటున్న కొద్దీ మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మంజూరైన 113 సెంటర్లలో పీఏసీఎస్‌లకు 71, ఐకేపీకి 41, జీసీసీకి ఒకటి లెక్కన కొనుగోలు కేంద్రాలను కేటాయించాం.

ప్రతి రైతుకూ కూపన్‌

ప్రతి రైతుకూ వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో) కూపన్‌ ఇస్తారు. ఏ రోజు, ఏ సమయంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి అనేది అందులో ఉంటుంది. ఆ ప్రకారం రైతులు సెంటర్లకు తేవాలి. ధాన్యం క్వాలిటీని కూడా ఏఈవోలే పరిశీలిస్తారు. జిల్లాలో గన్నీ సంచుల కొరత ఉండదు. ప్రస్తుతం ఇంకో పది లక్షల గన్నీ సంచులు అవసరం. ప్రభుత్వం వీటిని కేటాయించే అవకాశం ఉంది. అది జరగక పోతే రైస్‌మిల్లర్లు, చౌకడిపోల డీలర్లు, ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న పాత గన్నీ సంచులను తీసుకుంటం.

కొనుగోలు కేంద్రాల వద్ద జాగ్రత్తలు

కరోనా వ్యాప్తి నివారణకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జాగ్రత్తలు తీసుకుంటాం. కచ్చితంగా మాస్కులు లేదా కర్చీఫ్‌ వాడేలా, సామాజిక దూరం పాటించేలా చర్య లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనొద్దని సంబంధిత అధికారులకు చెప్పాం. కరోనాపై అవగాహన కల్పిస్తాం. సెంటర్లలో తాగునీటి వసతి కల్పించాలని నిర్వాహకులను ఆదేశించాం. కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించే డీపీఎంలు, ఏపీఎంలకు శిక్షణ ఇస్తాం.


logo