బుధవారం 03 జూన్ 2020
Warangal-city - Apr 08, 2020 , 02:28:31

ఇక సడలింపులు లేవ్‌

ఇక సడలింపులు లేవ్‌

హన్మకొండ నమస్తే తెలంగాణ : వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని, ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం వారు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి  అర్బన్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాలో వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి, ధాన్యం, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో వైరస్‌ నియంత్రణకు సంబంధించిన నివేదికలను సేకరించామన్నారు. సీఎం ఆదేశాల మేరకు పకడ్బందీ చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికీ పాజిటివ్‌ కేసు నమోదు కాలేదన్నారు. ఇంతలోనే ఢిల్లీ సంఘటనతో కొంత ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. అక్కడికి వెళ్లిన వారిలో వరంగల్‌ అర్బన్‌  జిల్లాకు చెందిన 25 మందిలో 23 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. వారి సన్నిహితులు 227 మందిని గుర్తించామని, వారిలో 113 మంది నమూనాలను పంపగా 35 మందికి నెగెటివ్‌ రిపోర్టు రావడం శుభపరిణామమన్నారు. రూరల్‌ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. అలాగే, జనగామలో విదేశాల నుంచి వచ్చిన 64 మందికి నెగెటివ్‌ రిపోర్టులు వచ్చాయన్నారు. ఢిల్లీకి ముగ్గురు వెళ్లి రాగా వారిలో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చిందని, వారి బంధువులకు నెగెటివ్‌ వచ్చిందన్నారు. ములుగు జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 12 మందికి నెగెటివ్‌ రిపోర్టు రాగా, ఢిల్లీకి వెళ్లిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. వారి బంధువులు, కుటుంబ సభ్యులకు సంబంధించి 32 మంది రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. విదేశాల నుంచి భూపాలపల్లి జిల్లాకు వచ్చిన 48 మందికి నెగెటివ్‌ రిపోర్టు రాగా, ఢిల్లీకి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. మహబూబాబాద్‌ జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన 119 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఇద్దరిలో ఒక్కరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. వీరి సన్నిహితులు 26 మంది రక్త నమూనాలను పరీక్షించగా అన్నీ నెగెటివ్‌ వచ్చాయన్నారు. అలాగే, వైరస్‌ నియంత్రణలో భాగంగా నగరంలోని 15 ప్రాంతాలను నో మూవ్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. వారి కోసం 26 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలు, నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

లాక్‌డౌన్‌ సందర్భంగా రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో వారు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఉమ్మడి జిల్లాలో 835 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రైతుల పంటను కొనుగోలు చేసేందుకు  సీఎం కేసీఆర్‌ రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ఉమ్మడి జిల్లా పరిధిలో 265 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా కలెక్టర్లు ఆర్జీ హన్మంతు, ఎం హరిత, సీపీ రవీందర్‌, గ్రేటర్‌ కమిషనర్‌ సత్పతి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రావు, వరంగల్‌ అర్బన్‌ డీఎంహెచ్‌వో లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.  


logo