బుధవారం 03 జూన్ 2020
Warangal-city - Apr 01, 2020 , 02:14:56

ధైర్యంగా ఎదుర్కొందాం..

ధైర్యంగా ఎదుర్కొందాం..

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘ఇది మనకు పరీక్షా సమయం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అసలుకే మోసం వస్తుంది. మీ వెనుక మేమున్నాం. కరోనా నియంత్రణకు సహకరించండి. లాక్‌డౌన్‌ సమయంలో సంయమనం పాటించండి. రైతులెవరూ అధైర్య పడొద్దు. పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌  అన్నారు. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కరోనా కట్టడికి మనం పాటిస్తున్న, అనుసరిస్తున్న చర్యల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు వరంగల్‌లాంటి అనేక నగరాలు, పట్టణాలు సేఫ్‌గా ఉన్నాయన్నారు. మార్చి 13, 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మసీదులో జరిగిన సమావేశాలకు వెళ్లి, అక్కడ కరోనా ప్రబలంగా ఉన్న ఇండోనేషియాలాంటి అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్లతో కలిశారన్నారు. వాళ్లల్లో కొందరు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారని తేలిందని, ఇప్పుడు వాళ్లంతా స్వచ్ఛందంగా పరీక్షలకు ముందుకు రావాలని కోరారు. ఒకవేళ వారు రాకపోతే, ట్రేస్‌ అవుట్‌ చేసే పనిని పోలీసులు, అధికార యంత్రాంగం తీసుకుంటుందన్నా రు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపరచడానికి, సౌకర్యాల కల్పనకు మేఘా కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కృష్ణారెడ్డి ముందుకొచ్చారని అన్నారు. వీరి స్ఫూర్తితో వర్తక, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రులు పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూలేనివిధంగా రూ.30వేల కోట్లతో రబీ కొనుగోలు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశామన్నారు. వివిధ రాష్ర్టాలకు చెందిన వలస కూలీలను కంటికి రెప్పలా చూస్తామని, ఇప్పటికే వారిని సేఫ్‌ ప్లేస్‌కి తరలించామన్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల క్రయ విక్రయాలు, వాటి ధరలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా ఉంచిందన్నారు.  సరుకులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు, ఉద్యోగుల మాదిరిగానే పనిచేస్తున్న మీడియా సిబ్బందికి కూడా రూ.50లక్షల ఇన్సూరెన్స్‌ ఇప్పించాలని  టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌లెనిన్‌ మంత్రులను కోరారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మం తు, హరిత, సీపీ రవీందర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ రాజయ్య, ఒడితెల సతీశ్‌కుమార్‌, జెడ్పీ చైర్మ న్లు డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, గండ్ర జ్యో తి, మేయర్‌ గుం డా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎం జీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ శ్రీనివాస్‌రావు, కేఎం సీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య, ఏనుమాముల మార్కెట్‌ చైర్మన్‌ చింతం సదానందం, అధికారులు పాల్గొన్నారు.


logo