బుధవారం 27 మే 2020
Warangal-city - Mar 31, 2020 , 02:49:00

కూపన్‌ పద్ధతిన ధాన్యం కొనుగోలు

కూపన్‌ పద్ధతిన ధాన్యం కొనుగోలు

వరంగల్‌ రూరల్‌ జిల్లాప్రతినిధి/నమస్తేతెలంగాణ: యాసంగి ధాన్యాన్ని రైతుల నుంచి కూపన్‌ పద్ధతిన కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ప్రణాళిక రూపొందిస్తున్నారు. పంట చేతికొచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లేలా రైతులకు కూపన్లు అందజేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని సీఎం కేసీఆర్‌ తాజాగా అధికారులను ఆదేశించారు. అంతేకాదు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున వరి పంట కోయడంలోనూ రైతులకు సహకరించాలని చెప్పారు. అవసరమైతే రైతులకు వరికోత యంత్రాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. దీంతో ఇప్పటికే వ్యవసాయ, పౌరసరఫరాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు యాక్షన్‌ ప్లాన్‌పై సమావేశమై సమీక్ష జరిపిన కలెక్టర్‌ ఎం హరిత సోమవారం జిల్లాలోని తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రధానంగా యాసంగి సీజన్‌లో ప్రతి రైతు నుంచి ప్రభు త్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని, పంట కోత నుంచి ధాన్యం విక్రయించుకోవడం వరకు రైతులకు ఎక్కడా సమస్య తలెత్తవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. రైతులందరూ ధాన్యం అమ్ముకునే వరకు కొనుగోలు కేంద్రా లు నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు.

86,844 ఎకరాల్లో వరి..

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు చెరువుల్లోకి వస్తుండడం, భూగర్భ జలమట్టం పెరుగడం వల్ల ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలో వరి పంట సాగు వి స్తీర్ణం పెరిగింది. 86,844 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా రు. సుమారు 2.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా వేశారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతున్నది. గత వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం జిల్లాలో 110 సెంటర్ల ద్వారా రైతుల నుంచి నేరుగా 1.77 లక్షల టన్నుల ధా న్యం కొనుగోలు చేసింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఇం తకంటే ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండ డం, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అదనపు సెంటర్లు నెలకొల్పాల్సి ఉన్నందున 250 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. కనీసం 223 కేంద్రాలైనా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సెంటర్లను పెంచాలంటే తేమ కొలి చే, వేయింగ్‌ మిషన్లు కావాలి. వీటికి తోడు ట్రాన్స్‌పోర్టు, హమాలీ వ్యవస్థను కూడా తయారు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ సాధ్యమయ్యేనా? అనే ప్రశ్న అధికారులను వెంటాడుతోంది. అదనపు సెంటర్ల ఏర్పాటు కు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న 110 సెంటర్ల ద్వారా రైతుల యాసంగి ధాన్యాన్ని నూరుశాతం కొనే దిశలో అడుగులు వేస్తున్నారు. రూరల్‌ జిల్లా లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో మంగళవారం మంత్రి ఎర్రబెల్లి అర్బన్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.

జనగామ జిల్లాలో..

జనగామ జిల్లా ప్రతినిధి : జిల్లాలో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో 1.14లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ మేరకు 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లు బంద్‌ ఉండడంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రేపటి నుంచి వ్యవసాయ అధికారులు రైతులకు కూపన్లు జారీ చేయనున్నారు. 

ఏప్రిల్‌ పది నుంచి మక్కల కొనుగోళ్లు

తొర్రూరు, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనల ప్రకారం ఏప్రిల్‌ 10 నుంచి తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తొర్రూరు పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ కాకిరాల హరిప్రసాద్‌ సోమవారం తెలిపారు. 


logo