శనివారం 30 మే 2020
Warangal-city - Mar 29, 2020 , 02:00:19

చకచకా పనులు

చకచకా పనులు

  • అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో కూరగాయల మార్కెట్‌
  • శరవేగంగా పూర్తయినషెడ్ల నిర్మాణం, విద్యుత్‌ లైట్ల ఏర్పాటు
  • నేటి నుంచి అమ్మకాలు ప్రారంభం
  • పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

వరంగల్‌, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడానికి సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గం. ఈ మేరకు వరంగల్‌ కూరగాయల తాత్కాలిక మార్కెట్‌ను సువిశాలమైన 32 ఎకరాల అజంజాహి (ఏజే) మిల్లు గ్రౌండ్‌లో  ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం నుంచి కూరగాయల అమ్మకాలు అజంజాహి మిల్లు గ్రౌండ్‌లోనే జరుపనున్నారు. ఈ మేరకు అధికారులు తాత్కాలిక మార్కెట్‌కు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే షెడ్లు, సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌, ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ వేల మంది కూరగాయల కోసం ప్రస్తుతం ఉన్న లక్ష్మీపురం మార్కెట్‌కు వస్తున్నారు. స్థలం చిన్నగా ఉండడంతో సామాజిక దూరం పాటించడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో కరోనా వైరస్‌ నియంత్రణ కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రత్యేక చొరవతో సువిశాల అజంజాహి మిల్లు గ్రౌండ్‌లోకి తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు సమన్వయం తో అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో మార్కెట్‌ ఏర్పాట్లు  చేశారు. 

అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ ఏర్పాట్లను తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, నగర పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్‌ పరిశీలించారు. సామాజిక దూరం పాటించేలా ప్రత్యేకంగా చేసిన మార్కింగ్‌లను వారు చూశారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కొనుగోలుకు వచ్చిన ప్రజలను వారు సూచించారు. విక్రయదారులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించాలని వారు అధికారులను కోరారు. ఆదివారం ఉదయం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగనున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని అన్నారు.  

ప్రారంభించిన ఎమ్మెల్యే నన్నపునేని

అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో ఆదివారం నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు. కాగా, శనివారం రాత్రి ఎమ్మెల్యే నరేందర్‌ కొబ్బరి కాయకొట్టి మార్కెట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంగయ్య, బల్దియా ఎలక్ట్రికల్‌ ఈఈ లక్ష్మారెడ్డి, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.logo