సోమవారం 25 మే 2020
Warangal-city - Mar 28, 2020 , 02:56:35

ఆర్టీసీ అత్యవసర సేవలు

ఆర్టీసీ అత్యవసర సేవలు

  • ఎంజీఎం మెడికల్‌ ఉద్యోగుల కోసం ఏడు బస్సులు 
  • కలెక్టర్‌ ఆదేశంతో అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు

సుబేదారి, మార్చి 27: కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో  ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ అధికారులు, సిబ్బంది అత్యవసర సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వపరంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువుగా మారిన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి వరంగల్‌ రీజియన్‌ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది గురువారం నుంచి రవాణా సేవలు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. దీంతో ఎంజీఎంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి రవాణాపరంగా సమస్య వచ్చింది. ఈ విషయాన్ని ఎంజీఎం సూపరింటెండెంట్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ నుంచి ప్రత్యేక సర్వీస్‌లు ఎంజీఎం ఆస్పత్రి వరకు నడిపించాలని కలెక్టర్‌, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలివ్వడంతో గురువారం నుంచి   సేవలు ప్రారంభమయ్యాయి. వరంగల్‌ నగరంలో రూట్‌ నంబర్‌ 1లో మడికొండ నుంచి ఎంజీఎం, రూట్‌ నంబర్‌ 3లో కాజీపేట నుంచి ఎంజీఎం వయా హంటర్‌రోడ్డు, రూట్‌నంబర్‌ 11లో కాజీపేట నుంచి ఎంజీఎం వయా సుబేదారి, హన్మకొండ చౌరస్తా ద్వారా, అలాగే హసన్‌పర్తి నుంచి ఎంజీఎం, నాయుడు పెట్రోల్‌ పంపు నుంచి ఎంజీఎం, గొర్రెకుంట నుంచి ఎంజీఎం, ఆరెపల్లి ఏనుమాముల మార్కెట్‌ నుంచి ఎంజీఎం ఆస్పత్రి వరకు ఒక్కో బస్సు చొప్పున నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో కేవలం ఎంజీఎం దవాఖాన వైద్యులు, సిబ్బంది మాత్రమే ప్రయాణించనున్నారు. ఇతరులు ప్రయాణించడానికి అనుమతి లేదు. ఆర్టీసీ అత్యవసర సేవల బస్సు ఆపరేషన్స్‌ హన్మకొండ డిపో నుంచి నడుస్తాయి. వీటికి సంబంధించిన ఆపరేషన్స్‌పై గురువారం హన్మకొండ ఎన్‌జీవోస్‌ కాలనీ రోడ్డులోని హన్మకొండ డిపోలో సిబ్బందికి డిపో మేనేజర్‌ మోహన్‌రావు తగు సూచనలు ఇచ్చారు. 


logo