జనతా కర్ఫ్యూకు జనం జేజేలు

- స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు
- డివిజన్లో తెరుచుకోని వ్యాపార, వాణిజ్య సంస్థలు
- చప్పట్లు కొట్టి మద్దతు పలికిన ప్రజలు, అధికారులు
పరకాల, నమస్తే తెలంగాణ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూకు జనం జేజేలు పలికారు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూలో భాగంగా ఇళ్లకే పరిమితమై తమ మద్దతు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌లు ఇచ్చిన పిలుపులో ప్రజలు భాగస్వాములయ్యారు. పరకాల ఆర్డీవో కిషన్, ఏసీపీ శ్రీనివాస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజలు రోడ్లెక్కలేదు. పరకాల ఏసీపీ కార్యాలయం వద్ద ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్లోని సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ఆర్డీవో కార్యా లయంలో ఆర్డీవో ఎల్.కిషన్, సిబ్బంది కరోనా నివారణలో భాగంగా చప్పట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.
వర్ధన్నపేటలో...
ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌లు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఆదివారం ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో సర్పంచులు జనతా కర్ఫ్యూను పాటించాలని కోరుతూ శనివారం రాత్రి గ్రామాల్లో టాం టాం చేయించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వారి వివరాలను నమోదు చేసుకున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి ప్రచార రథ వాహనాలను ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏసీపీ గొల్ల రమేశ్ సూచనల మేకు సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది ప్రజలు వాహనాలపై తిరగకుండా చర్యలు తీసుకున్నారు. మండలంలో దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మున్సిపల్ కమిషనర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు శనివారమే దుకాణదారులకు దుకాణాలు తీయొద్దని నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని జాతీయ రహదారిపై ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో యువకులు రహదారిపైకి వచ్చి పోలీసు అధికారులతో కలిసి చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పరకాల టౌన్లో..
కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం ఉదయం నుంచే పట్టణ ప్రజలు రోడ్ల మీదకు రాకుండా స్వచ్ఛందంగా స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ఆర్డీవో కిషన్ ఉదయమే జనతా కర్ఫ్యూపై పట్టణమంతా తిరుగుతూ సమీక్షించారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సీఐ మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ పి.శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోడ్ల మీదకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించి తిరిగి ఇండ్లలోకి పంపించారు. మున్సిపల్ చైర్పర్సన్ సోద అనిత రామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందించిన సిబ్బంది, అధికారుల సేవలను గుర్తిస్తూ ప్రజలు చప్పట్లతో అభినందించారు.
రాయపర్తిలో...
మండలంలోని 39 గ్రామాల్లోని ప్రజలు ఆదివారం ఇండ్లలోనే గడుపుతూ టీవీలకు అతుక్కుపోయారు. మండల కేంద్రంలో జనతా కర్ఫ్యూను ఆర్డీవో మహేందర్‌జీ ఆకస్మీకంగా తనిఖీ చేసి తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు, సర్పంచ్ నర్సయ్యకు పలు సూచనలు చేశారు.
సంగెంలో...
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలో జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతమైంది. ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని గ్రామాలకు వెళ్లి ఎవరైనా రోడ్ల మీద కనపడితే వారికి విషయం చెప్పి ఇండ్లకు పం పించారు. ఆర్డీవో మహేందర్‌జీ మండల కేంద్రాన్ని సందర్శిం చి వివరాలను తహసీల్దార్ సుహాసినిని అడిగి తెలుసుకున్నారు.
కరోనా మహమ్మారిని పారదోలేందుకు 24 గంటలు కష్టపడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బందికి సాయంత్రం 5 గంటలకు తమ ఇండ్లలోనే ప్రజలు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ సెంటర్లో ఎంపీపీ కందకట్ల కళావతి మండల రైతు సమన్వయసమితి అధ్యక్షుడు కందకట్ల నరహరి పలువురు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు.
గీసుగొండలో...
ప్రధాని నరేంద్ర మోదీ , సీఎం కేసీఆర్ ఇచ్చిన జనతా కర్ఫ్యూలో ఆదివారం ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని వైద్యాధికారులు శ్రీనివాస్,మాధవీలత వారిని కలిసి సూచనలు చేశారు. మచ్చాపురంలో ఆర్డీవో మహేందర్‌జీ సందర్శించి పరిస్థితిని తహసీల్దార్ కనకయ్యను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని ఊకల్ క్రాస్ వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఎవరిని బయటకు రాకుండా చేయటంతో పాటు వచ్చే వారికి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నా ప్రజల కోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మకూరులో...
మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. సాయంత్రం 5గంటలకు ఇంటి ముందుకు వచ్చి జనతా కర్ఫ్యూ విజయవంతమైనందుకు సంతోషంతో చప్పుట్లు కొట్టారు.
నడికూడలో...
మండల కేంద్రంలో ప్రజలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.
శాయంపేటలో...
కరోనా కట్టడికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూ ఆదివారం విజయంతమైంది. దీంతో అన్ని గ్రామాల్లోనూ రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. మాందారిపేట స్టేజీపై పరిస్థితిని పరకాల ఏసీపీ శ్రీనివాస్ పర్యవేక్షించారు. శాయంపేట సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్‌కుమార్‌లు గ్రామాల్లో పర్యటించారు. పెద్దకోడెపాక, తహర్‌పూర్, జోగంపల్లి తదితర చోట్ల ఎస్సై ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షించారు. మండలంలోని ప్రగతిసింగారం గ్రామంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి వైద్యులకు సంఘీభావంగా చప్పట్లు కొట్టారు.
పర్వతగిరిలో..
మండలంలోని అన్ని గ్రామాలు, గిరిజన తండాల్లో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కార్యక్రమంలో ఎస్సై ప్రశాంత్‌బాబు, ఆర్ఐ వల్లాల సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్‌కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్‌లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్‌వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్‌పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..