సోమవారం 25 మే 2020
Warangal-city - Mar 23, 2020 , 02:15:12

జయహో జనతా

జయహో జనతా

  • 31 దాకా ఇదే స్ఫూర్తి కొనసాగాలి
  • ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వ నిర్ణయం 
  • సహకరించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి  
  • ఉచితంగా నెలగ్రాసం ఇచ్చేందుకు యంత్రాంగం కార్యాచరణ 
  • మనిషికి 12 కిలోల బియ్యం.. కార్డుకు రూ.1500 అందజేతకు నిర్ణయం
  • కరోనా వైరస్‌పై ప్రజాయుద్ధం
  • జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు
  • ఇళ్లు విడిచి బయటకు రాని జనం
  • ఇండోర్‌ గేమ్స్‌తో చిన్నాపెద్దా ఆటవిడుపు

ఎక్కడి వారు అక్కడే.. స్వీయ నియంత్రణ, నిర్బంధంతో ఇళ్లకే పరిమితమైన జనం.. చరిత్రలో ఎన్నడూ కనని, వినని రీతిలో ఉద్యమస్ఫూర్తిని చాటారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కరోనాపై యుద్ధభేరిని మోగించారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు.. ఇల్లా సబ్బండవర్గాలూ భాగస్వామ్యమయ్యాయి. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు మార్మోగాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ నెల 31 వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. అత్యవసర, నిత్యావసర సేవలకు మినహాయింపునిచ్చారు. తెల్లరేషన్‌ కార్డులో పేరున్న ఒక్కొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం, రూ. 1500 సాయం అందించేందుకు నిర్ణయించారు.

  వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో స్ఫూర్తి. ఎక్కడివాళ్లు అక్కడే ఇండ్లళ్లకు పరిమితమై స్వీయ నియత్రణ, స్వీయ నిర్బంధమై ఉద్యమస్ఫూర్తిని చాటారు. మార్చి 22, ఆదివారం 2020 జిల్లా చరిత్రలో మరిచిపోని రోజు. కరోనా వైరస్‌వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లాలో ఎక్కడా జనం రోడ్ల మీదికి వచ్చిన దాఖలా లేదు. నేతలు, జనం వేర్వేరు కాదని ని రూపించిన సందర్భం. ఉదయం నుంచి ఇండ్లల్లో టీవీలకు పరిమితం కావడం, పిల్లలతో కాలక్షేపం చేసిన తల్లిదండ్రులు. ఉద్యోగులు, కార్మికులు, రైతులు వెరసి మానపురుగు రోడ్లమీదికి వచ్చి న దాఖలాలు దుర్బినేసి చూసినా కనిపించని వైనం. కరోనా వైర స్‌ వ్యాప్తి నిరోధానికి దేశ ప్రధాని ఇచ్చిన పిలుపును సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన పిలుపు మొత్తంగా ఎక్కడి జనం అక్కడ ఇండ్లడ్లలోకి స్వీయనిర్బంధంలోకి వెళ్లిపోయారు. మనుషులంతా పుట్టకముందు అమ్మ కడుపులో హాయిగా ఉన్నట్టే జయహో జనతా కర్ఫ్యూ నీడన కాలం వెళ్లదీశారు. ఆదివారం నాటి స్ఫూర్తి మరికొన్ని రోజులు చాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈనెల చివరి వరకు (మార్చి 31 వరకు) ఇదే రీతిన స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. 

దీర్ఘకాలిక దుఃఖాన్ని జయించాలంటే తాత్కాలికమైన.. 

నిత్యం పనులతో అలసిపోయిన జనం. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సేదతీరారు. ఎక్కడివాళ్లు అక్కడ ఇంటిపట్టున ఉండిపోయారు. ఉదయం ఆరు గంటలకే పేపర్‌ గుమ్మంవాలిపోయింది. నిత్యావసర సరుకుల్లో ప్రధానమైన పాలను పొద్దున్నే తెచ్చుకొని ఒక్కరోజే కదా! అని అనుకుంటూ ఉండగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలిక దుఃఖాన్ని జయించాలంటే తాత్కాలిక నిర్బంధం తప్పదన్న అభిప్రాయంతో జనం వచ్చారు. ఇప్పటికే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడి చిక్కిశల్యమైన అపారమైన మానవమనుగడ, ఆర్థిక విధ్వంసం ప్రశ్నార్థకమైన దురావస్థ రాకుండా ఉండాలంటే ఈనెలాఖరు వరకు సర్కారు విధించిన గడువును తాత్కాలిక ఇబ్బందులు పడైనా సరే అనుభవించాలన్న నిశ్చితాభిప్రాయానికి వస్తున్నారు. అందుకు ప్రపంచంలో సంపన్నదేశమే అయినా, ఆర్థికంగా, సహజ వనరుల పరంగా, మానవ మేధస్సు  పరంగా ఎదురులేని ఇటలీ వంటి దేశంలో రోజుకు వందల కొద్దీ కరోనా మరణాలు సంభస్తున్నాయి. ఆదేశం కోలుకోలేని ధైన్యస్థితిలోకి వెళ్లిన ఉదంతాలను జనం సామాజిక మాధ్యమాల్లో తిప్పుతూ జనచేతనం కలిగిస్తున్నారు. సాక్షాత్తు ఇటలీ దేశాధ్యక్షుడే కన్నీళ్లు పెట్టుకునే దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఇటువంటి దుస్థితి పగవాడికీ రాకూడదని, మనం అప్రమత్తంగా లేకపోతే, ప్రభుత్వం నిర్దేశిత నియమాన్ని పాటించకుండా ధిక్కరిస్తే ఏడ్వనికి మాత్రమే కాదు కనీసం మనిషి అంతిమ సంస్కారానికి ఎవరూ ఉండరన్న స్పృహను ఎరుక చేసుకుని ఏకశిలాపురి ఈనెల 31 వరకు హాయిగా కష్టాన్నైనా భరిస్తాం. కానీ కరోనాను అరికడతాం అన్న నిర్ణయానికి వస్తున్నారు. 

ఇండ్లకే పరిమితమైన నేతలు ..

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి రాష్ట్రస్థాయి దాకా సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు ఇలా ఎవరికి వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉండిపోయారు. తమతమ నియోజకవర్గాల  నాయకులు, కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ ప్రజల యోగక్షేమాలపై ఆరా తీశారు. సాయంత్రం ఐదు గంటలకు జనం మాదిరిగానే ఎవరి ఇంటి నుంచి వారు బయటికి వచ్చి చప్పట్లతో సంఘీభావ సంకేతాన్ని ప్రకటించారు. ఎంపీ పసునూరి దయాకర్‌ తనకిష్టమైన పెయింటింగ్‌ వేస్తూ కుటుంబ సభ్యులతో ఉండిపోయారు. ప్రభుత్వ చీప్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, మాజీ  ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, డాక్టర్‌ టీ రాజయ్య,  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు సహ నేతలంతా ఇళ్లకే పరిమితం అయి కాలక్షేపం చేశారు. 

ఇదే స్ఫూర్తి మార్చి 31 దాకా..

జనతా కర్ఫ్యూను జయప్రదం చేసినట్టుగానే ఎక్కడికక్కడ జనం ఇంటిపట్టునే ఆదివారం నుంచి ఈ నెలాఖరు వరకు ఇదే స్థితి కొనసాగుతుందని, దీనికి ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసర, నిత్యావసర సేవలు అందించే కేంద్రాలు అదీ కూడా పరిమితికి లోబడిన వారినే అనుమతి ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రైళ్లను ఈనెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ఈనేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేట్‌ వాహనాలు ఏవీ రోడ్ల మీదికి రాకూడదని సంచలనమైన కఠిన నిర్ణయం తీసుకున్నది. ఈ కఠిన నిర్ణయం వెనుక జనం సుభిక్షింగా, సురక్షితంగా ఉండాలనే కరుణరస నిర్ణయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఉచితంగా నెలగ్రాసం..రూ.1500 పైకం 

రెక్కాడితే గానీ డొక్కాడని వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు రానియ్యమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కార్మిక, కర్షక వర్గాల యోగక్షేమాల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈనెల చివరికి వరకు జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య కోసం జనం కోసం మనం. మనం కోసం మనం. అందరి కోసం అందరం అన్న నినాదంతో ఈ కరోనా వ్యాప్తి కాలాన్ని ఎదుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆహార భద్రతా కార్డులున్న ప్రతిఒక్కరికీ నెలగ్రాసం ఇస్తామని, అదీ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీన్ని ఆరు నుంచి 12 కిలోలుగా పంపిణీ చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం కార్డుకు రూ.1500 చొప్పున పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌, జిల్లా వైద్య ఆరోగ్య, పౌరసరఫరాల శాఖ ఈ పంపిణీ ఏర్పాట్లపైనా కార్యాచరణ ప్రణాళికల్ని రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అర్బన్‌ జిల్లాలో 2,66,447 కార్డులున్నాయి. వీటిలో 2,53,860 ఆహారభద్రతా కార్డులు కాగా, 12,568 అంత్యోదయ కార్డులు, 19 అన్నపూర్ణ కార్డులున్నాయి. జిల్లాలో ఉన్న 459 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి నెలా 4500 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తారు. అయితే మనిషికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తే 4500 మెట్రిక్‌ టన్నులు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెల రోజులకు సరిపడా మనిషికి 12కిలోల చొప్పున ఇవ్వాలంటే దానికి డబుల్‌ అవుతుంది. అంటే తొమ్మిది వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయడం, మరోవైపు కార్డుకు రూ.1500 చొప్పున నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు నగదును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బియ్యం లెక్కను పక్కనపెట్టినా తక్షణం పంపిణీ చేసే నగదే దాదాపు రూ.40 కోట్లు (రూ.39కోట్ల, 96లక్షల, 70వేల 500) ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రజల యోగక్షేమాల దృష్ట్యా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరిస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. కరోనా వ్యాప్తి కట్టడికి కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. కానీ, ప్రజలు సహకరించి ఈనెల 31 వరకు మార్చి 22ను నిరవధికంగా పునరావృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 


logo