ఆదివారం 24 మే 2020
Warangal-city - Mar 22, 2020 , 02:32:01

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

  • 16 ఏళ్ల అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి..
  • డీసీఎంగా విధులు నిర్వర్తించిన గండ్రకోటి మల్లేశం
  • దండకారణ్య స్పెషల్‌ జోన్‌ ఏరియా కమిటీ మెంబర్‌గా చింత శ్రీలత..
  • పలు హింసాత్మక ఘటనల్లో ఇద్దరూ నిందితులు..
  • మల్లేశం పేరిట రూ. 5 లక్షలు, శ్రీలత పేరిట రూ. 4 లక్షల రివార్డు
  • తక్షణ సాయం కింది రూ. ఐదు వేల చొప్పున అందజేత
  • వివరాలు వెల్లడించిన వరంగల్‌ సీపీ రవీందర్‌
  • పాల్గొన్న మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి 

వరంగల్‌ క్రైం, మార్చి 21 : మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక 16  ఏళ్ల ఆజ్ఞాతం జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు మావోయిస్టు దంపతులు. మహబూబాబాద్‌ జిల్లా ఇంటికన్నె గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ డివిజనల్‌ కమిటీ మెంబర్‌ (డీసీఎం) గండ్రకోటి మల్లేశం అలియాస్‌ మల్లయ్య అలియాస్‌ కిరణ్‌, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్‌కు చెందిన చింతల శ్రీలత అలియాస్‌ హైమ దంపతులు శనివారం వరంగల్‌ పొలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వీ రవీందర్‌ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ కార్యాలయంలోసీపీ రవీందర్‌  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దంపతులు ఇద్దరు మావోయిస్టు పార్టీలో కొనసాగించిన కార్యకలాపాల వివరాలు వెల్లడించారు. మల్లేశం నాన్న పెంటయ్య అలియాస్‌ నారాయణ, అన్న కుమారస్వామి అలియాస్‌ కిరణ్‌లు మావోయిస్టు పార్టీలో పనిచేస్తుండగా అన్న కుమారస్వామి 2000 సంత్సరంలో కౌకొండలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. మల్లేశం తండ్రి పెంటయ్య ఆయుధాల తయారీ విషయంలో మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌  చేసి భోపాల్‌ జైలుకు తరలించారన్నారు. 

 ఇంటర్మీడియెట్‌లోనే అజ్ఞాతంలోకి మల్లేశం..

నెక్కొండలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న క్రమంలోనే మధ్యలోనే చదువు ఆపేసి 2003 సంత్సరంలో నర్సంపేట దళం కార్యదర్శి భారతక్క ప్రోత్సాహంతో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై దళ సభ్యుడిగా చేరాడన్నారు. 2004 నుంచి పూర్తి స్థాయి దళ సభ్యుడిగా పని చేస్తుండటంతో పార్టీ ఆయుధాన్ని చేకూర్చిందన్నారు. చిన్న చిన్న రోగాలకు గాయాలకు చికిత్స చేయడంలో మల్లేశంకు అనుభవం ఉండటంతో భారతక్క నాయకత్వంలో డాక్టర్‌గా, టీచర్‌గా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. 2004లో ఒడ్డుగూడెం ప్రాంతంలో మావోయిస్టు దళసభ్యుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా మల్లేశం తీవ్రంగా గాయపడి వరంగల్‌ ప్రాంతంలో రహస్యంగా చికిత్స  పొందారన్నారు. 2005లో తిరిగి నర్సంపేట దళంలో చేరడంతో పార్టీ ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించినట్లు సీపీ తెలిపారు. అదే సమయంలో దళసభ్యురాలు చింత శ్రీలత అలియాస్‌ హైమను వివాహం చేసుకున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీ ప్రజల అభిమానాన్ని కోల్పోవడంతో పార్టీ ఆదేశాల మేరకు దంపతులు ఇద్దరు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి పనిచేశారన్నారు. 2008లో దళ సభ్యుడు శ్రీకాంత్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని మడ్‌ ప్రాంతంలో పేలుడు పదార్థాల వినియోగం తయారీ, కమ్యూనికేషన్‌ పరిజ్ఞానంపై పది నెలల పాటు శిక్షణ పొందినట్లు తెలిపారు. అప్పటి నుంచి దాడులు చేసేందుకు పార్టీకి పేలుడు పదార్థాలను అందించేవాడన్నారు. 2011లో డీసీఎం బాధ్యతలతో పాటు సెంట్రట్‌ రీజినల్‌ బ్యూరో కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జిగా నియమించడంతో దంపతులు ఇద్దరు ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో పని చేశారన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి పలు హింసాత్మక ఘటనల్లో మల్లేశం ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు.2003 సంవత్సరంలో కొత్తగూడం మండలం గంగారం గ్రామానికి చెందిన పుట్టల భూపతిని పొలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నేపంతో హత్య చేశారన్నారు. 2004లో కొత్తగూడెం మండలం కార్లపల్లి గ్రామంలో నర్సంపేట దళ సభ్యులు శంకర్‌, చిన్నక్క, యాదన్నలతో కలిసి ఓ వ్యక్తిని, 2006లో వెంకన్న అనే వ్యక్తిని హత్య చేయడంలో మల్లేశం నిందితుడిగా ఉన్నాడన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో పలు హింసాత్మక ఘటనలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులపై కాల్పుల జరిపిన 9 ఘటనల్లో మల్లేశం నిందితుడిగా ఉన్నారని సీపీ రవీందర్‌ తెలిపారు. 

 దూరపు బంధువుతో ఆజ్ఞాతంలోకి శ్రీలత

కొత్తగూడ మండలం రాంపూర్‌కు చెందిన చింత శ్రీలత అలియాస్‌ హైమ తల్లి 2003 సంత్సరంలో  మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి సానుభూతిపరుడిగా పని చేస్తున్న దూరపు బంధువైన మచ్చ వెంకన్న సహకారంతో 2004లో నర్సంపేట దళంలో శ్రీలత చేరారన్నారు. కొద్ది రోజుల పాటు దళ సభ్యులు సామాను మోసి తర్వాత పూరిస్థ్ధాయి దళసభ్యురాలిగా పని చేసిందన్నారు. 2006 సంవత్సరంలో నర్సంపేట దళసభ్యుడు గండ్రకోటి మల్లేశం అలియాస్‌ మల్లయ్యను వివాహం చేసుకుందని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు భర్తతో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యానికి వెళ్లి పనిచేయడం జరిగిందన్నారు. 2009 సంవత్సరం నుంచి భర్తతో కలిసి సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో కమ్యూనికేషన్‌ విభాగంలో పని చేశారన్నారు. 2010లో దండకారణ్య ఏరియా కమిటీ మెంబర్‌గా పార్టీ బాధ్యతలు అప్పగించారన్నారు. 2015 సంత్సరంలో శ్రీలత గర్భవతి కావడంతో ఛత్తీస్‌గఢ్‌లోని రహస్య ప్రాంతంలో గడిపి పాపకు జన్మనిచ్చిందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పాపను మల్లేశం తల్లికి అప్పగించి దండకారణ్య ఏరియా కమిటీ మెంబర్‌గా పని చేసిందన్నారు. 2005 సంవత్సరంలో ముసుకు కొంరయ్య, సుల్తాన్‌పూర్‌కు చెందిన బానోతు రాజు, 2006 సంవత్సరంలో కార్లాయి గ్రామానికి చెందిన చుంచు వెంకన్నను పొలీస్‌ ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేసిన ఘటనలో నిందితురాలిగా ఉందన్నారు. పలు హింసాత్మక ఘటనల్లో శ్రీలత ప్రత్యక్షంగా పాల్గొననట్లు తెలిపారు. 

 ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి

అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే ఉపాధివకాశాలను మావోయిస్టులు అందిపుచ్చుకోవాలని సీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన మల్ల్లేశం, శ్రీలత దంపతుల పేరిట ఉన్న రివార్డులను త్వరలోనే అందిస్తామన్నారు. తక్షణ సహాయం కింద చెరో రూ. 5000 చెక్కును అందించామన్నారు. మావోయిస్టులు ప్రజల ఆదరణ కోల్పోవడంతో ప్రభుత్వ ఆస్తులను  విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం ఉందన్నారు. అలాంటి వారిపై కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు. లొంగిపొయిన మావోయిస్టులందరికీ పునరావసం కింద ప్రభుత్వం సహాయం అందిస్తూ వ్యవసాయ భూములు, ఇంటి స్థ్ధలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్‌  జిల్లా ఎస్పీకోటిరెడ్డి, వరంగల్‌ పొలీస్‌ కమిషనరేట్‌ అపరేషన్స్‌ అడిషనల్‌ డీసీపీ ఉప్పు తిరుపతి పాల్గొన్నారు. 


logo