గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 21, 2020 , 03:23:26

దూరం.. దూరం..

దూరం.. దూరం..

 • కరోనాపై అప్రమత్తమైన ఉమ్మడి జిల్లా
 • స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటిస్తున్న ప్రజలు
 • వివాహ వేడుకలకు ససేమిరా అంటున్న బంధువులు
 • సర్కార్‌ పిలుపునకు విశేష స్పందన
 • స్వీయ నియంత్రణే శ్రీరామరక్షగా ముందడుగు
 • రోడ్లమీద తగ్గిన రద్దీ
 • సామూహిక ప్రార్థనలకు నో చెప్పిన మతపెద్దలు
 • కలెక్టరేట్‌కు వచ్చి.. వివరాలు వెల్లడిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు
 • 24గంటల ప్రత్యేక హెల్ప్‌లైన్‌ 7993969104 ఏర్పాటు
 • కరోనా వైరస్‌ను గుర్తించేందుకు బయో సేఫ్టీ క్యాబినెట్‌
 • రెండు రోజుల్లో నగరానికి చేరుకోనున్న పరికరం
 • ఎంజీఎంలో కొవిడ్‌-19 బ్లాక్‌
 • పెళ్లి విందు రద్దు.. రెండు ఫంక్షన్‌ హాళ్లు సీజ్‌

ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. ఏ ప్రాంతంలో చూసినా అదే ముచ్చట. ఏ చానల్‌ పెట్టినా అవే వార్తలు.. ట్విట్టర్‌.. ఫేస్‌బుక్‌.. వాట్సప్‌.. ఇలా ఏ సామాజిక మాధ్యమంలోనైనా కరోనా వైరస్‌ను కట్టడి చేయాలన్న పట్టుదల. దాని వ్యాప్తిని అరికట్టాలన్న శపథం. గుంపులు.. గుంపులుగా ఉండకూడదు.. తిరగకూడదనే సామాజిక స్పృహ. స్వీయ నియంత్రణతో కూడిన సామాజిక బాధ్యత. అవగాహనే మందు.. కొద్దిపాటి నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళన అందరిలోనూ ధ్వనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు.. దేవాలయాల్లో నిత్యపూజలు చేసే అర్చకులు.. చర్చిల్లో ప్రార్థనలు చేసే ఫాదర్స్‌, మసీదుల్లో ఆజా చేసే మౌజంలు ఇలా అందరిలోనూ కలిగిన చైతన్యం. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పల్లె, పట్నం తేడాలేకుండా అందరిలోనూ ఒకటే నిశ్చితాభిప్రాయం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. వివాహ వేడుకలకు ససేమిరా అంటున్నారు.

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌  వ్యాప్తి చెందకుండా తక్షణమే రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా ఉన్నతాధికారులకు పిలుపునివ్వటంతో ఉమ్మడి జిల్లా యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లింది.  ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క తేల్చి ఆరోగ్యస్థితిగతులను పరిశీలించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గురువారం వివిధ దేశాల నుంచి వచ్చిన 272 మందిని గుర్తించారు. ఈ నెల 1 నుంచి ప్రపంచ నలుమూలల నుంచి ఎవరెవరు వచ్చారన్నది స్టేట్‌ సర్వైలెన్స్‌ విభాగం ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు జిల్లాకు వస్తున్నాయి. వాటి ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రోజుకు రెండు సార్లు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయితే కొంతమంది నేరుగా తాము లేదా తమ వారు విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని గ్రహించిన అధికారులు వివరాల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటి వాళ్లు వివరాలు వెల్లడించకపోయినా ఇరుగుపొరుగు వారెవరైనా నేరుగా తమ దృష్టికి వచ్చేలా వరంగల్‌ అర్బన్‌ జిల్లా యంత్రాంగం హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24/7 పనిచేసే 799396 9104నంబర్‌కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మ ంతు పిలుపునిచ్చారు. కాగా, గురువారం వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నాయి. మరోవైపు కొంతమంది యువకులు గురువారం నేరుగా అర్బన్‌ కలెక్టరేట్‌కు వచ్చి తాము ఫలానా దేశం నుంచి వచ్చామని స్వచ్ఛందంగా వెల్లడించగా, వారిని కలెక్టర్‌ అభినందించారు. ఇదే స్ఫూర్తి మిగతావారిలోనూ రావాలని ఆకాంక్షించారు. 

రోడ్లపై తగ్గిన రద్దీ.. వెలవెలబోయిన వివాహ వేడుకలు 

కరోనా వైరస్‌పై విస్తృతమైన అవగాహన ప్రజల్లో కలిగింది. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారనటానికి నగర రోడ్లే నిదర్శనం. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారు మాస్క్‌లు ధరిస్తూ ఎవరికివారు వ్యక్తిగత రక్షణకు శ్రీకారం చుట్టారు. నిత్యం రద్దీగా ఉండే హన్మకొండ చౌరస్తా వంటి ప్రాంతాలు జనం లేక వెలవెలబోతున్నాయి. మరోవైపు గురువారం వివిధ వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలు వెలవెలబోవటం విశేషం. 

స్వీయ నియంత్రణలో 272 మంది 

రాష్ట్ర సర్వైలెన్స్‌ టీమ్‌ పంపిన వివరాల ప్రకారం ఈ మధ్యకాలంలో వివిధ దేశాల నుంచి గురువారం నాటికి వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చేరిన వివరాల ఆధారంగా గురువారం సాయంత్రానికి 272 మంది ఉన్నట్టు గుర్తించారు. వీరందరి ఇళ్లల్లోకి వెళ్లి ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు వైద్య పరీక్షలు నిర్వహించాయి. 14 రోజుల దాకా ఎవరూ బయటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇంట్లో ఉండే వీలులేకపోతే తాము ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ శిబిరాలకు తరలిస్తామని హెచ్చరించాయి. అయితే తాము ఇళ్లల్లోనే తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటామని హామీ ఇస్తున్నారు. 

ఎంజీఎంలో కొవిడ్‌-19 బ్లాక్‌

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఒకవేళ ఎవరైనా అనుమానితులు వస్తే వారికి అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంజీఎం దవాఖానలో ప్రత్యేకంగా 20 పడకల ఐసోలేషన్‌ వార్డుతో మరో 25 పడకల విభాగాన్ని అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఉన్న 10 పడకల ఐసీయూను మరో పదికి పెంచి దీనికి కొవిడ్‌-19 బ్లాక్‌ అని నామకరణం చేశారు. అంతేకాకుండా కేఎంసీలోనూ ప్రత్యేక క్వారంటైన్‌ వార్డును ఏర్పాటు చేశారు. 

అందరికీ నెగెటివ్‌..

వివిధ దేశాల నుంచి వచ్చిన 272 మందిలో ప్రస్తుతం ఏ ఒక్కరిలోనూ కరోనా లక్షణాలు లేవని జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. మరోవైపు కరోనా అనుమానంతో వచ్చిన వారి రక్త నమూనాలను సేకరించి వైద్యపరీక్షలు నిర్వహిస్తే ఏ ఒక్కరిలోనూ ఆ వైరస్‌ పాజిటివ్‌గా ఉన్న లక్షణాలు కనిపించలేదని కలెక్టర్‌ వెల్లడించారు. ఇక ఎంజీంలో చేరిన ఆరుగురు అనుమానితుల్లో ఐదుగురికి నెగటివ్‌ వచ్చిందని, వారిని వారి ఇళ్లకు పంపించామని మరోకరి రిపోర్ట్‌ రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 

కట్టడికి ముందుకొచ్చిన మతపెద్దలు 

కరోనా వ్యాప్తిని నిరోధించటానికి ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు వివిధ మతపెద్దలు మద్దతు పలికారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హిందు.. ముస్లిం.. క్రిస్టియన్‌ సహా ఇతర మతాల పెద్దలందరూ ఇవాళ్టి నుంచి నిత్యం చేసే కార్యక్రమా లు మాత్రమే ఉంటాయని, ఆదివారం చర్చిల్లో.. శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును గౌరవిస్తూ ప్రజల ఆరోగ్యానికి పరిమితంగా (పది మందికి మించకుండా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. 

జిల్లాకు కరోనా పరీక్ష పరికరం 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన బయో సేఫ్టీ క్యాబినెట్‌ పరికరాన్ని తెప్పించేందుకు నిర్ణయం తీసుకున్నది. దాదాపు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు ఖర్చయ్యే ఈ పరికరాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి వరంగల్‌ కేఎంసీకి తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పరికరం అందుబాటులోకి వస్తుందని వైద్యాధికారులు పేర్కొన్నారు.    

రెండు ఫంక్షన్‌హాళ్లు సీజ్‌.. ఒక పెళ్లి విందు రద్దు 

ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో హాజరైన రెండు ఫంక్షన్‌ హాల్స్‌ను (హసన్‌పర్తిలో ఒకటి, కేయూసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరొకటి) సీజ్‌ చేశారు. అంతేకాకుండా గురువారం రాత్రి హంటర్‌రోడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించే వివాహ విందును వాయిదా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయగా, వారు ఒకదశలో నిరాకరిస్తున్నారని గ్రహించి సదరు మ్యారేజ్‌ హాల్‌ను సైతం సీజ్‌ చేశారు. గురువారం హన్మకొండ నక్కలగుట్టలోని ఓ మ్యారేజ్‌ హాల్‌లో వారం రోజుల క్రితమే పారిస్‌ నుంచి తిరిగొచ్చిన వ్యక్తి పెళ్లిని దాదాపు1500 మంది అతిథులతో అట్టహాసంగా నిర్వహించడాన్ని జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నది. ఒకదశలో సంఘంలో బాగా పలుకుబడి ఉండటం, న్యాయవ్యవస్థలో సదరు పెళ్లి కుమారుడి తండ్రి సుదీర్ఘకాలం పనిచేయడం వంటి అంశాలను సైతం ప్రజారోగ్యమే తమ ప్రధానకర్తవ్యమని భావించిన జిల్లా యంత్రాంగం పక్కన పెట్టి వివాహ విందును రద్దు చేసుకోవాలని సూచించడంతో ఎట్టకేలకు వారు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. కాగా, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పెళ్లికొడుకు, పెళ్లి కూతురుకు, వారి కుటుంబ సభ్యులకు ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించి పారిస్‌ నుంచి వచ్చిన పెళ్లి కుమారుడిని హోం క్వారంటైన్‌ చేశారు. ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని సూచించారు. 

ఏసీపీల వద్ద మ్యారేజ్‌ హాల్స్‌ కీస్‌

కరోనా వ్యాప్తి నిరోధాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నగరంలోని అన్ని మ్యారేజ్‌ హాల్స్‌ను సీజ్‌ చేయాలని సంబంధిత పోలీసులకు చెప్పామని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ పేర్కొంటూ నగరంలోని అన్ని మ్యారేజ్‌ హాల్స్‌ తాళపు చెవిలు ఏసీపీల కస్టడీలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

ఆ విందు రద్దు వెనుక..

నగరంలో గురువారం జరగాల్సిన వివాహ విందు రద్దు వెనుక జాతీయ స్థాయిలో జరిగిన ప్రచారమే కారణమనే చర్చ సాగుతున్నది. పారిస్‌ నుంచి వచ్చిన పెళ్లికొడుకు రెండు రోజులు క్వార ంటైన్‌ కేంద్రంలో ఉండి వచ్చీ రాగానే పెళ్లి చేసుకున్నాడని జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి ఉ మా సుధీర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను గుర్తించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీరియస్‌గా తీసుకున్నారని, ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌కు, సదరు పెళ్లికొడుకు బంధువులతో నేరుగా మాట్లాడిన నేపథ్యంలో సీరియస్‌ను గుర్తించిన ఇరుపక్షాల పెద్దలు అంగీకరించి వివాహ విందును రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, సదరు జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి వివాహ విందు రద్దు చేయించినందుకు మంత్రి కేటీఆర్‌కు మరోసారి ట్వీట్‌ చేయడం విశేషం. 

అప్రమత్తంగా ఉందాం 

కరోనా వైరస్‌ వ్యాప్తి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని, అయితే ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి విస్తృతి చెందకుండా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్‌లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తృత ప్రజాచైతన్యం అవగాహన, అప్రమత్తతోనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని, ఆదిలోనే నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలను, రెండు రోజుల క్రితం ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాలను వెల్లడించారు. ముందుగా అప్రమత్తంగా ఉన్నదేశాలు, రాష్ర్టాల్లో ఆదిలోనే కరోనాను అరికట్టిన నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత క్రమశిక్షణ, పరిశుభ్రత పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రత విషయంలో కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని ఇరుగుపొరుగు వారు తమకు తెలియజేయాలని, అందుకోసం 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.   

-కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు 

ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత 

ప్రతి ఒక్కరూ ఎవరికి వారు తాను బాగానే ఉన్నాననే భావనతో నిర్లక్ష్యంగా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, అందరూ బాధ్యతగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కరోనాపై ఇప్పటికే అందరిలో సంపూర్ణ అవగాహన వచ్చిందని పేర్కొంటూనే ఎవరికి తోచిన విధంగా వారు విస్తృత అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో వివిధ సామాజిక మాధ్యమాలతోపాటు పలు ప్రచార సాధనాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. వివిధ సామాజిక మాధ్యమాలు, ప్రింట్‌, అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు. ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

-సీపీ డాక్టర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ 


logo