ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Mar 19, 2020 , 03:30:01

ఆచూకీ చెప్తే.. రూ.5 లక్షలు

ఆచూకీ చెప్తే.. రూ.5 లక్షలు

  • మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులపై బహుమానం ప్రకటించిన పోలీసులు 
  • నగరంలో యాక్షన్‌ టీం సభ్యుల పోస్టర్లు 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ‘సమాచారం పోలీసులకు..బహుమతులు మీకు’ అవును నిజమే. వరంగల్‌ మహానగరంలో వెలిసిన పోస్టర్లు. మావోయిస్టు ఆగడాలను అరికట్టేందుకు, ఆదిలోనే వారి ఉనికికి అడ్డుకట్ట వేసేందుకు వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనుసరిస్తున్న వ్యూహం ఇదే. ఇటీవలి కాలంలో మావోయిస్టు యాక్షన్‌ టీంలు తిరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో మావోయిస్టుల ఆటకట్టించేందుకు పోలీసులు నగరంలో వివిధ హోదాల్లో ఉన్న మావోయిస్టు నాయకుల ఫొటోలతో కూడిన పోస్టర్లను అతికించారు. రాష్ట్ర పోలీస్‌ బాస్‌ పర్యటన తెల్లారే నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సహా రద్దీ ఉండే ప్రాంతాల్లో ఇలా పోస్టర్లు దర్శనమివ్వడంతో  మావోయిస్టు కార్యకలాపాలపై విస్తృత చర్చ సాగుతున్నది. ఎట్టిపరిస్థితులోనూ మావోయిస్టు విస్తృతి జరగకుండా చూడటం, వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే ద్విముఖ వ్యూహంతో పోలీసులు రంగం చేసినట్టు స్పష్టమవుతున్నది. ‘ప్రజా పోరాటపు ముసుగులో ఉన్న యాక్షన్‌ టీం నక్సల్స్‌ సభ్యుల ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షల నగదు బహుమానం’ ప్రకటించారు. మావోయిస్టు యాక్షన్‌టీం సభ్యులుగా బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, మంగు అలియాస్‌ పండు, సుధీర్‌, లింగల్‌ అలియాస్‌ రాజేశ్‌, మంగ్తు, అముదల్‌ అలియాస్‌ సంజయ్‌, యాలం నరేందర్‌ అలియాస్‌ సంత్‌, బూర రాకేశ్‌ అలియాస్‌ శివ, కుంజ వీరయ్య అలియాస్‌ లచ్చన్న మొదలైన మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్‌ పోస్టర్లు నగరంలో బుధవారం వెలిశాయి. ఐదారేళ్లుగా మావోయిస్టుల ఉనికి, వారి కార్యకలాపాలు లేకుండా ఉన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో గోదారి తీరం గుండా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారని, సింగిల్‌ టార్గెటే లక్ష్యంగా వారు రంగంలోకి దిగారని పోలీసులు అనుమానిస్తున్నారు. ములుగు, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో కొంతకాలంగా మావోయిస్టుల పేరిట వాల్‌ పోస్టర్లు పడటమే కాకుండా వరంగల్‌ మహానగరంలోని కొంతమంది నాయకులను, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు పాల్పడే వారిని టార్గెట్‌ చేస్తూ కరపత్రాలు, పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయి.  పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేకంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ సంయుక్తంగా ‘ఆపరేషన్‌ ప్రహార్‌'ను నిర్వహిస్తున్నది. అదీపోనూ మావోయిస్టు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నా.. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకమైందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో తిరిగి ఎలాగైనా  ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించాలన్న లక్ష్యంతో వారు ఉన్నారు. ఈ మేరకు నిఘా వర్గాల నివేదికల ఆధారంగా స్వయంగా రాష్ట్ర పోలీస్‌ బాస్‌ గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి ‘ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు కార్యకలాపాలు విస్తరించడానికి వీళ్లేదని, ఆదిలోనే వారి  ఆటకట్టించాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఈక్రమంలో యాక్షన్‌ టీంలు నగరంలోకి  వచ్చాయంటూ ప్రచారాలు జోరుగా సాగుతున్న దశలోనే అడ్డుకట్టవేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే యాక్షన్‌ టీం సభ్యుల సమాచారం అందించిన వారికి నగదు నజరానా ప్రకటించారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మొత్తంగా నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మావోయిస్టు సానుభూతిపరులు, మావోయిస్టు కవర్‌ సంస్థల కార్యకలాపాలపై నిఘా పెంచారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నట్టుగా పోలీసులు పట్టుదలతో ఉన్నారనడానికి ఈ పోస్టర్లే నిదర్శనమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. 

యాక్షన్‌ టీం సభ్యుల కదలికలపై నిఘా పెంచండి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇతర నేరాలతో పాటు, మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యుల కదలికలపై నిఘా పెంచాలని సీపీ రవీందర్‌ అధికారులకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మావోయిస్టులను గుర్తించే దిశగా పోలీస్‌ అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సీపీ ఆధ్వర్యంలో బుధవారం సెంట్రల్‌ జోన్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోలీస్‌ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా  పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆకస్మిక కార్డన్‌ సెర్చ్‌లు, వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యుల ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లను రూపొందించి విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.  ముఖ్యంగా మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులు తారసపడితే  తక్షణమే పోలీసులకు సమాచారం అందించే విధంగా ప్రజలను జాగృతం చేయాలని  అధికారులకు తెలిపారు. సమావేశంలో ఓఎస్డీ, క్రైమ్స్‌ అదనపు డీసీపీ తిరుపతి, లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీసీపీ మల్లారెడ్డితో పాటు, ఏఆర్‌ అదనపు డీసీపీ భీంరావు, ఏసీపీలు జనార్దన్‌, రవీందర్‌ కుమార్‌, జితేందర్‌రెడ్డితో పాటు ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. 

ఓఎస్‌డీగా బాధ్యతలు స్వీకరించిన అదనపు డీసీపీ తిరుపతి 

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వరంగల్‌ విభాగంగా అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వీ తిరుపతి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఓఎస్డీ, క్రైం అదనపు డీసీపీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఏసీబీ విభాగం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బీ ప్రతాప్‌కుమార్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సీసీఆర్‌బీ విభాగం ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇద్దరు అధికారులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వీ రవీందర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.logo