ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Mar 19, 2020 , 03:28:01

అభివృద్ధి పనులు ఆగొద్దు..

అభివృద్ధి పనులు ఆగొద్దు..

  • నెలాఖరులోగా సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలి 
  • ప్రభుత్వ పథకాలకు ఇసుక కొరత సృష్టిస్తే చర్యలు 
  • డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలను పూర్తి చేయాలి 
  • అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి సూచన
  • అభివృద్ధి పనులపై పాలకుర్తిలో అధికారులతో సమీక్ష

పాలకుర్తి రూరల్‌, మార్చి 18 : అభివృద్ధి పనులు ఆగొద్దు..నాణ్యతలోనూ రాజీపడొద్దు. ఈనెలాఖరులోగా ఈజీఎస్‌ నిధులతో నిర్మించే సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.  బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కుడుముల నిఖిలతో కలిసి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీసీ రోడ్లు, ఉపాధిహామీ పథకాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 25 లేదా 26వ తేదీల్లోపు సీసీ రోడ్ల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600కోట్లతో పనులను చేపట్టామన్నారు. నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు అధికారులు ఇసుక కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాల పేరుతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. డంపింగ్‌ యార్డులు, నర్సరీలు, శ్మశాన వాటికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్ల పనులు పూర్తి చేయకుంటే కలెక్టర్‌ ఇతర గ్రామాలకు మార్చే అధికారం కల్పించామన్నారు. ఈజీఎస్‌ నిధులతో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గ్రామాల వారీగా చేపట్టే పనులు, ప్రగతిని పరిశీలించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మెపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. పని దినాలను బట్టి వేతనాలు చెల్లిస్తామన్నారు. 

ఆడ పడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్‌ 

ఆడపడుచులకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా ఉంటూ ఆదుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను కలెక్టర్‌ నిఖిలతో కలిసి మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ పథకం ఆడ పిల్లలకు వరమన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో పాలకుర్తి ప్రథమ స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదన్నారు. సమీక్షలో పీఆర్‌ ఎస్‌ఈ సంపత్‌, ఈఈ సత్యనారాయణ, ఆర్డీవోలు ఎల్‌ రమేశ్‌, మధుసూదన్‌, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, దారవత్‌ జ్యోతి, బస్వ సావిత్రి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, జెడ్పీటీసీలు పల్ల భార్గవి సుందర్‌రామిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పసునూరి నవీన్‌, తీగల దయాకర్‌, ఏసీపీ గొల్ల రమేశ్‌, సర్పంచ్‌లు వీరమనేని యాకాంతారావు, పసునూరి మధుసూదన్‌, ఈదూనూరి నర్సింహారెడ్డి, రాష్ట్ర జీసీసీ మాజీ చైర్మన్‌ దరావత్‌ మోహన్‌గాంధీనాయక్‌, ఎర్రబెల్లి రాఘవరావు, జర్పుల బాలునాయక్‌ తహసీల్దార్లు ఎన్‌ విజయభాస్కర్‌, ఫరీదుద్దీన్‌, రమేశ్‌, డీఈ దిలీప్‌, సంధ్య, ఏఈ పాషా, ప్రశాంతి, సర్పంచ్‌లు ఎంపీటీసీలు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


logo