మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 19, 2020 , 03:26:43

నలు దిశలా నగరేడియల్స్‌

నలు దిశలా నగరేడియల్స్‌

  • 13 కొత్త రేడియల్‌ రోడ్స్‌.. పాతవి ఐదు 
  • ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువైన ప్రయాణం 
  • అమోఘ అనుసంధానం 
  • మాస్టర్‌ ప్లాన్‌లో మాస్టర్‌ పీస్‌లా రోడ్డు కనెక్టివిటీ

అమోఘం.. అద్భుతం.. రోడ్ల అనుసంధానం.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా ప్రయాణించే వీలు.. మాస్టర్‌ పీస్‌లా కనెక్టివిటీ.. ఇదీ మహానగరానికి నగలాగా ఆవిష్కృతం కానున్న రేడియల్‌ రహదారుల స్వరూపం.. నగరం చుట్టూ.. నలుదిక్కులా మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన బృహత్తర రోడ్‌ నెట్‌వర్క్‌.. దేనికదే సాటిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక.. ఇన్నర్‌, ఔటర్‌, రీజనల్‌ రింగ్‌రోడ్లతో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్న అభివృద్ధి.. వీటిని అనుసంధానిస్తూ ప్రస్తుత రవాణా, ప్రయాణ వ్యవస్థను 2041 వరకు అంచనా వేస్తూ రూపకల్పన చేసిన వాస్తవిక ముఖచిత్రం.. నగరంలో ఇప్పటికే ఐదు రేడియల్‌ రోడ్లుండగా, మరో పదమూడింటితో మాస్టర్‌ప్లాన్‌ రూపుదిద్దుకున్నది. భవిష్యత్‌ తరానికి ట్రాఫిక్‌ సమస్యలు లేని బంగారుబాటగా నిలువనున్నది.  


వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: వరంగల్‌ మహానగర ముఖచిత్రమే మారబోతున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ భవిష్యత్‌ తరానికి బంగారు బాటలు వేసింది. దినదినం విస్తరిస్తున్న వరంగల్‌ మహానగరానికి నలుదిశలా రహదారి నగిషీలుగా ప్రతిపాదించింది. అంతర్గత రహదారుల విస్తరణకు మార్గాలు వేస్తూనే మహానగరం చుట్టూ బృహత్తర రోడ్డు నెట్‌వర్క్‌ను మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరిచారు. ఏ రోడ్డుకారోడ్డు.. దేనికదే సాటిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను అన్ని హంగులతో..అన్ని రంగాల్లో దేదీప్యమానంగా వెలిగించేందుకు బృహత్‌ ప్రణాళికలు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ భవిష్యత్‌ తరాలకు భరోసా ఇవ్వనుంది. ఇరుకైన రహదారులుంటే ప్రగతి సంకుచితంగా, అశాస్త్రీయంగా ఉంటుందని, విశాలమైన రహదారులే వికాసానికి నాంది పలుకుతాయని  ప్రభుత్వం భావించి మూడు ప్రధానమైన రోడ్లకు రూపకల్పన చేశారు. 38.8 కిలోమీటర్ల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాదాపు 71 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మరో 159.7 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌కు వలయాలను ఏర్పాటు చేయనున్నారు.  వరంగల్‌ మహానగరాభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వికేంద్రీకృత వికాసం జరగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇన్నర్‌, ఔటర్‌, రీజినల్‌ రింగ్‌రోడ్లకు అనుసంధానం చేస్తూ ప్రస్తుతం ఉన్న రవాణా, ప్రయాణ వ్యవస్థను 2041 సంవత్సరానికి అంచనా వేస్తూ రూపొందించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్‌ సమస్యల్ని అధిగమించడమే కాకుండా నగరం నలువైపులా విస్తరణ, వికాసం జరిగేందుకు అనువుగా ప్రస్తుతం ఉన్న ఐదు రేడియల్‌ రోడ్లకు అదనంగా మరో 13 రేడియల్‌ రోడ్లను ప్రతిపాదిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ఈ మూడు పట్టణాలను కేంద్రంగా చేసుకొని ఎటు నుంచి ఎటైనా సరే సులువుగా, సుఖంగా వెళ్లేందుకు వీలుగా సువిశాలంగా 45 మీటర్లతో రేడియల్‌ రోడ్స్‌ను పొందుపరిచారు. 

మూడు రోడ్లతో అన్నిరోడ్ల కరచాలనం 

ఇన్నర్‌, ఔటర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్లను అనుసంధానం చేస్తూ సువిశాల రోడ్డు కనెక్టివిటీని రూపొందించారు.  ప్రస్తుతం వరంగల్‌ టు హైదరాబాద్‌, వరంగల్‌ టు కరీంనగర్‌, వరంగల్‌ టు ములుగు రోడ్‌, వరంగల్‌ టు ఖమ్మం, వరంగల్‌ టు నర్సంపేట ఈ ఐదు మాత్రమే రేడియల్‌ రోడ్లుగా ఉండడంతో ప్రతి ప్రయాణికుడు నగరం మధ్య నుంచి దూరకాలానికి లోనై అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వాహనాల రద్దీతో శబ్ద, వాయుకాలుష్యం పెరిగిపోయి నగర ప్రశాంత జీవనానికి అవరోధం కలుగుతున్నది. ఈ పరిస్థితిని శాశ్వతంగా రూపుమాపాలని ప్రభుత్వం భావించింది.  ఇప్పటికే సగానికి పూర్తయిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, దాదాపు 14 కిలో మీటర్లు (కడిపికొండ టు నాయుడు పెట్రోల్‌ పంప్‌ (భట్టుపల్లి, ఉర్సుగుట్ట మీదుగా)) పూర్తయిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాదాపు సగం వరకు పూర్తి కావస్తున్న జాతీయ రహదారి 163 (రాంపూర్‌ టు ఆరెపల్లి వయా చింతగట్టు)కు తోడు మాస్టర్‌ప్లాన్‌లో కొత్తగా ఆమోదం పొందిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు నగరం వెలుపల వలయాలు వలయాలుగా విస్తరించడం ద్వారా మహానగరవాసులకు భారీ వాహనాల రద్దీ నుంచి ఉపశమనం కలిగే భరోసాను మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా ప్రభుత్వం వరంగల్‌కు కల్పించింది. వరంగల్‌, కాజీపేట వీటిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ ఉంది. సాధ్యమైనంత మేరకు రైల్వే ట్రాక్‌ అవరోధం నుంచి మినహాయించి రేడియల్‌ రోడ్స్‌ను అనుసంధానం చేయడం విశేషం. (నగరాన్ని ఆనుకొని ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ల(ఖమ్మం (అబ్బనికుంట), హంటర్‌రోడ్డు (విమ్స్‌), కడిపికొండ రైల్వే ట్రాక్‌ మీదున్న వంతెనలతోపాటు కాజీపేట జోడు వంతెనలు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు మరో రైల్వే ట్రాక్‌పై వంతెన).  

 అన్ని ప్రాంతాలకు అనుసంధానం

వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ఈ మూడు ముఖ్యపట్టణాల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా వెళ్లేందుకు వీలుగా రేడియల్‌ రోడ్లు నగర ప్రజలకు రవాణా, ప్రయాణ సదుపాయల్లో భారంలేని విధంగా మాస్టర్‌ ప్లాన్‌ భరోసా ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రోడ్డు కనెక్టివిటీని మరింత వేగం చేస్తూనే మరోవైపు మెరుగైన 13 రోడ్లతో మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకున్నది. పాత రేడియల్‌ రోడ్లు కేవలం 133 కిలో మీటర్లే ఉండగా కొత్తగా ప్రతిపాదించిన రేడియల్‌ రోడ్లు 250.2 కిలోమీటర్ల మేర విస్తరించబోతుండటం విశేషం. వరంగల్‌  అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ  జిల్లాల విస్తరణ, మౌలిక సదుపాయల కల్పనకు భరోసా ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ అంతర్గత, బాహ్య రోడ్లను అనుసంధానం చేస్తూ, పారిశ్రామిక కారిడా ర్‌, గ్రోత్‌ కారిడార్‌, ఐటీ, పర్యాటక, పర్యావరణహిత ప్రాంతాలను కలుపుకొని ఆయా ప్రాంతాల  ప్రయాణికుల ప్రయాణాలను సులభతరం చేసే అద్భుత ఆవిష్కరణగా మాస్టర్‌ ప్లాన్‌లో మాస్టర్‌పీస్‌గా రోడ్డు కనెక్టివిటీ ఉండటం విశేషం.


logo