శనివారం 28 మార్చి 2020
Warangal-city - Mar 17, 2020 , 03:46:42

అన్నదాతలకు వరప్రదాయిని..

అన్నదాతలకు వరప్రదాయిని..
  • మల్కాపూర్‌ రిజర్వాయర్‌తో సాగు, తాగునీటి నిల్వ
  • నిర్మాణానికి అనుమతులతో పాటు టెండర్లు పూర్తి
  • వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాలకు ప్రయోజనం
  • అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి హరీశ్‌రావు

చిలుపూర్‌, మార్చి 16: జనగామ జిల్లా చిలుపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంపై అసెంబ్లీలో మరోమారు చర్చ సాగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో రిజర్వాయర్లను పెంచాలని కోరారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సభలో మాట్లాడుతూ.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని చిలుపూర్‌ మండల పరిధిలోని మల్కాపూర్‌లో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. టెండర్లు సైతం పూర్తయ్యాయని, సీఎం కేసీఆర్‌తో చర్చించి పనులు ప్రారంభించేలా చూస్తామని  పేర్కొన్నారు.  దీంతో ఈ ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. 

నీటి నిల్వ కోసం..

ఎత్తిపోతల పథకం నుంచి తరలించే నీటిని నిల్వ చేసేందుకు మరో భారీ రిజర్వాయర్‌ను 2016 జనవరిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుత చిలుపూర్‌ మండలంలో ఉన్న మల్కాపూర్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసి వ్యాస్కోస్‌ ద్వారా నివేదికను తీసుకుని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రిజర్వాయర్‌ సర్వే, ఇన్వెస్టిగేషన్‌, అంచనాల తయారీ బాధ్యతను వ్యాస్కోస్‌ సంస్థకు అప్పగించారు. 6.21లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టారు. నిర్మాణపు పనులు కొనసాగుతుండగా మొదటి, రెండో దశ పనుల్లో భాగంగా ప్రధాన కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటిల్లో ప్రస్తుతం గోదావరి నీరు తరలుతున్నది. మూడు దశలకు కలిపి మొదట 38.16 టీఎంసీల నీటిని మళ్లిస్తే ప్రభుత్వం అనుకున్న విధంగా 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు సరిపోదనే ఉద్దేశంతో దేవాదుల సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచుతూ అప్పుడే ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఎత్తిపోతల పథకాల అవసరాలకు, నీటి నిల్వల కోసం ఇప్పటి వరకు నిర్మించిన అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం పెంచినప్పటికీ కేవలం 112.7 టీఎంసీల నిల్వకు మాత్రమే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన ఆయకట్టుకు నీటి నిల్వలు లేకపోవడంతో మల్కాపూర్‌లో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  రూ.3,175 కోట్ల నిధులను  సైతం కేటాయించారు. ఇందులో భూమి కోల్పోతున్న రైతులకు పరిహారంతో పాటు, రిజర్వాయర్‌ నిర్మాణానికి అంచనాలు వేశారు.  ప్రస్తుతం గోదావరి నీటితో ఈ నియోజకవర్గ పరిధిలో సాగునీటికి ఏమాత్రం కొరత లేకపోడం వల్ల కొంత ఆలస్యం చేసినట్లు భావిస్తున్నారు. ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ పైన మల్కాపూర్‌ గ్రామం ఉండగా ఆ ప్రాంతంలో రిజర్వాయర్‌ను నిర్మిస్తే ధర్మసాగర్‌ నుంచి పంపింగ్‌ చేయనున్నారు. ఇప్పటికే ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌, మల్లన్నగండి రిజర్వాయర్లకు పంపింగ్‌ జరుగుతున్నది. ఇక మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తే  10.75టీఎంసీల నీరు నిల్వ ఉంటాయి. అవసరాన్ని బట్టి మళ్లీ మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి ధర్మసాగర్‌, హన్మకొండ పట్టణానికి తరలించేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసి ఉంచారు.   

ముంపు బాధితులకు పరిహారం 

రాష్ట్రంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, మధ్యమానేరు ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించింది. రిజర్వాయర్ల నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పరిహారాన్ని సంతృప్తిగా అందించారు. అదే తరహాలో మల్కాపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో నష్టపోయే రైతులకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నీటి నిల్వ వల్ల జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరే  అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.


logo