మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Mar 17, 2020 , 03:34:46

ఎరుపు మెరుపు

ఎరుపు మెరుపు

ఎరుపు పంట మెరుపు మెరిసింది. ఆరుగాలం శ్రమించిన అన్నదాతను మురిపించింది. రైతు రెక్కల కష్టానికి ప్రతిఫలాన్నిచ్చింది. సింగిల్‌ పట్టి మిర్చి రకానికి రికార్డు స్థాయి ధర లభించింది. క్వింటాల్‌కు రూ. 24,500 పలికింది. సదరు రైతు వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం బజ్జూతండాకు చెందిన సోమ్లానాయక్‌ను ఆనందంలో ముంచెత్తింది. కాగా, రెండు రోజుల సెలవుల అనంతరం సోమవారం ఏనుమాముల మార్కెట్‌ తెరుచుకోగా, ఎర్రబంగారం పోటెత్తింది. 65 వేల బస్తాల వరకు అమ్మకానికి వచ్చింది. చెరువుల్లో సమృద్ధిగా నీరుండడం, భూగర్భ జల మట్టాలు పెరగడం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువలు నిండుగా పారడంతో పెద్ద ఎత్తున పంటలు సాగవుతున్నాయి. ఏడాదికేడాది మిర్చి పంట దిగుబడి సైతం పెరుగుతున్నది. విదేశాలకు, ఆంధ్రా పచ్చళ్లకు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నది.

  • మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం
  • సింగిల్‌పట్టి రకానికి రికార్డు స్థాయి ధర
  • క్వింటాల్‌కు రూ. 24,500..
  • విదేశాల్లో మన మిర్చికి భలే గిరాకీ
  • ఆంధ్రా పచ్చళ్లకూ ఇక్కడి నుంచే సరఫరా
  • ఏయేటికాయేడు పెరుగుతున్న పంట దిగుబడి
  • రైతుబంధు పథకం అదనపు ఆసరా అవుతున్నదంటున్న రైతులు

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఏనుమాముల మార్కెట్‌లో ఎరుపు రైతు మెరుపు పంట ఇది. రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావడం, భూగర్భ జల మట్టాలు పెరగడం, కాలువల కింద, చెరువుల కింద, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల కింద ఉన్న రైతుల పంట పండుతున్నది. పడావు పడిన నేలలు పచ్చని పంట సిరులతో తొణికిసలాడుతున్నాయి. సోమవారం వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ మిర్చి యార్డ్‌కు మిర్చి పోటెత్తింది. దాదాపు 65వేల బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 3,03,277 క్వింటాళ్ల మిర్చి వచ్చింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మిర్చి దెబ్బతినడం, దిగుబడిపై ప్రభావం చూపుతుందన్న వాతావరణం నెలకొన్నా.. గత సంవత్సరానికి తీసిపోని విధంగా మిర్చి రైతు ముంగిట ఉందని వ్యసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో గత పది రోజులుగా మార్కెట్‌ ఎత్తుపల్లాలుగా ఉన్నా స్థిరంగానే ధరలుండే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా.. మన రైతులకు పెద్దగా నష్టం వాటిల్లదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత పదిరోజులగా ధరలు తగ్గే అవకాశం ఉందని వినిపించిన మాటలు కేవలం పుకార్లేనని సోమవారం నాటి మార్కెట్‌ స్పష్టం చేసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్‌, బజ్జూతండాకు చెందిన సోమ్లానాయక్‌ సింగిల్‌పట్టి మిర్చి రకానికి క్వింటాల్‌కు 24,500 ధర పలకడంతో ఆ రైతు పట్టరాని సంతోషంతో ఉన్నారు. తాను పదేళ్లుగా మిర్చి పంట పండిస్తున్న ఇంత అధిక ధర ఏనాడూ పలుకలేదని సంబురపడుతున్నాడు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిర్చిసాగు గణనీయంగా పెరిగింది. 2015-2016లో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, అప్పటి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రావడంతో  2016-17లో భారీ దిగుబడి వచ్చింది. అంతేకాకుండా సరిహద్దు జిల్లాల నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తటం విశేషం.  ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు, సమృద్ధిగా నీరు అందుబాటులోకి రావడంతో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. ఐదేళ్లుగా ఒక్క ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే మిర్చి లావాదేవీలను పరిశీలిస్తే ఏటేటా పెరుగుతూ వస్తున్నది. 

పోటెత్తిన ఎర్రబంగారం 

 సోమవారం ఎర్రబంగారంతో కళకళలాడింది. మార్కెట్‌కు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం మిర్చి భారీఎత్తున వచ్చింది. నిర్దేశిత మిర్చియార్డుతో పాటు పల్లి, పసుపుయార్డు షెడ్‌తోపాటు, మార్కెట్‌ ప్రధాన కార్యాలయం చుట్టూ  పత్తియార్డు ప్రాంగణాలన్నీ  మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఈ సీజన్‌ డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌కు 3,03,277 క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. రాత్రి వరకు 21,997 క్వింటాళ్లు (54వేల 993 బస్తాలు) కాంటాలు కాగా మరో పదివేల బస్తాలు మరుసటి రోజు చేస్తామని మార్కెట్‌వర్గాలు పేర్కొన్నాయి.  

సోమవారం మిర్చి ధరలు 

తేజ రకం క్వింటాల్‌కు అత్యధికంగా రూ.13, 800, కనిష్ఠంగా రూ.11వేలు, వండర్‌హాట్‌ రకం అత్యధికంగా రూ.15వేలు, కనిష్ఠంగా రూ.12వేలు, యూఎస్‌ 341 రకం అత్యధికంగా రూ.15,500, కనిష్ఠంగా రూ.12,500, దీపిక అత్యధికంగా రూ.13,300, కనిష్ఠంగా రూ.11,500, 

 దేశీ రకం మిర్చి అత్యధికంగా రూ.20,500, కనిష్ఠంగా రూ.18, 500, సింగిల్‌ పట్టి రకం మిర్చి అత్యధికంగా రూ.24,500, కనిష్ఠంగా రూ.21,500, తాలు రకం మిర్చి అత్యధికంగా రూ.6వేలు, కనిష్టంగా రూ.4వేలు ధర పలికింది. 

కూలీ గుండెలో పనుల సింగిడి

రెండు రోజులు మార్కెట్‌ బంద్‌ ఉండటం. సోమవారం నాడు మార్కెట్‌ అంతా మిర్చి బస్తాలతో నిండిపోవడంతో మార్కెట్‌తో సంబంధం ఉన్న వర్గాలన్నీ సంబురపడుతున్నాయి.  దడువాయి, హమాలీ, ఇతర కార్మికులకు చేతి నిండా పని దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మిర్చి సీజన్‌ డిసెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు ఉన్నా మొదటి ఐదు నెలలు ప్రత్యేకించి మూడు నెలలు మాత్రం మార్కెట్‌లో చేతినిండా పనికి చావు ఉండదని మిర్చి యార్డ్‌లో హమాలీ పని చేస్తున్న మంద సాంబయ్య పేర్కొన్నారు. సంచులు కోసేవాళ్లకు, కళ్లం మీద మిర్చి ఆరబోసేవాళ్లు, అడ్తి, కమీషన్‌ ఏజెంట్లు, ఇలా వివిధ వర్గాలకు చేతి నిండా పనులకు ఢోకాలేదని వారు పేర్కొంటున్నారు. 

దేశదేశాలకు మనమిర్చి 

మన రైతు పండించిన ఎరుపు పంట ఇక్కడి నుంచి దేశదేశాలకు ఎగుమతి అవుతున్నది. ఎక్కువగా ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, మలేషియా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, చైనా, పాకిస్తాన్‌ మొదలైన దేశాలకు ఎగుమతి అవుతున్నది. ఇటీవల చైనా సహా ఇతర దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ పుణ్యమా అని ఎగుమతులపై తాత్కాలికంగా ప్రభావం చూపినా తిరిగి మార్కెట్‌ పునరిద్దరణ అవుతుందన్న ఆశాభావం వ్యాపార వర్గాల్లో నెలకొన్నది. మరోవైపు మిర్చి అంటే ఒకప్పుడు గుంటూరు పెట్టింది పేరు. అయితే ఇదే గుంటూరు, మాచర్ల మార్కెట్ల పరిధిలో మిర్చి ఆశాజనంగా లేకపోవడంతో మన మిర్చికి మంచిగిరాకీ ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పచ్చళ్లకు  ఉపయోగపడే సింగిల్‌ పట్టి మిర్చి రకాన్ని రాజమండ్రి, తాడేపల్లిగూడెం సహా అనేక ఆంధ్రాప్రాంతాల వాళ్లు  కొనుగోలు చేసి తీసుకెళుతున్నారని వరంగల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చిల్లీస్‌ సెక్షన్‌ అధ్యక్షుడు నల్లా సాంబయ్య పేర్కొన్నారు. 

నిల్వకు కొదవలేదు

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ధరల ఎగుడుదిగుడు స్థితికి బెంబేలెత్తిపోవాల్సిన పని లేదని, మిర్చి వ్యాపారులు కానీ, రైతులు కానీ ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజీలే అందుకు నిదర్శనంగా ఉన్నాయి.  మార్కెట్‌కు వచ్చిన మిర్చిలో నాణ్యతకు ఢోకా లేకుండా నిల్వ ఉంచేందుకు 24 కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి.  వీటిలో దాదాపు 26 నుంచి 30లక్షల బస్తాలను నిల్వ ఉంచుకునే సౌకర్యం ఉన్నదని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మన మిర్చికి మంచి గిరాకీ....

పూర్వ వరంగల్‌ జిల్లాలో మిర్చి పంట దిగుబడులు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మన మిర్చికి మంచి గిరాకీ ఉన్నది. దేశంలోని అనేక రాష్ర్టాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన రాష్ర్టాలకు మిర్చి వెళుతున్నది. రైతులకు మంచి ధరలే వస్తున్నాయి. వ్యాపారులకు ఒక్కో సంవత్సరం ఒక్కోరకంగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యాపారం చేసుకునే వారికి లాభం ఎప్పుడూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమందికి నష్టాలు కూడా తప్పవని తెలిసినా ఇదే వ్యాపారం చేస్తున్నారు. 

-నల్లా సాంబయ్య, వరంగల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చిల్లీస్‌ సెక్షన్‌ అధ్యక్షుడు 

ఈసారే మంచిధర...

నేను పదేళ్లుగా మిర్చి పండిస్తున్న. ఈసారి మాత్రం మంచిధర (సింగిల్‌ పట్టి (క్వింటాల్‌కు 24,500, ఈ రోజు మార్కెట్‌లో అత్యధిక ధర సంపన్నుడు) పలికింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు పెండ్లిండ్లు అయినవి. కొడుకు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నోయిడాలో కొన్ని రోజులు చేసిండు. ఢిల్లీలో చేసిండు. ఇప్పుడు హైదరాబాద్‌లో చేస్తుండు. నాకు ఏడెకరాల భూమి ఉన్నది. మూడు ఎకరాల్లో పొలం (విజయమసూరి) వేసిన. ఒక ఎకరం సింగిల్‌పట్టి పెట్టిన. 12 క్వింటాళ్లు వచ్చింది. రైతుబంధు ఆదుకున్నది. పంట పెట్టుబడికి సాయం చేసింది. పుష్కలమైన నీళ్లు. రెండు పంటలు మంచిగ పండుతున్నవి. సర్కార్‌ దయవల్ల ఇప్పటి వరకు మంచిగనే ఉన్న. రైతులందరూ సంతోషంగా ఉండాలని కేసీఆర్‌ చూస్తున్నడు. అందరికీ మంచి ధరలు దక్కాలె. అప్పుడే అందరూ ధనసంపతిగా ఉంటం. 

-సోమ్లానాయక్‌, నల్లబెల్లి మండలం, వరంగల్‌ రూరల్‌ జిల్లాlogo
>>>>>>