శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 16, 2020 , 03:30:17

మట్టి పరీక్షలకు ప్రణాళికలు

మట్టి పరీక్షలకు ప్రణాళికలు
  • పైలట్‌ ప్రాజెక్టుగా ఐదు గ్రామాలు
  • నేటి నుంచి నమూనాల సేకరణ
  • పంటలు ఉన్నచోట తాత్కాలికంగా వాయిదా
  • 2,783 శాంపిల్స్‌ సేకరణ లక్ష్యం
  • రైతులకు మట్టి ఆరోగ్యపత్రాల పంపిణీ

వరంగల్‌ సబర్బన్‌, నమస్తే తెలంగాణ : రైతులు పంటల సాగు విషయంలో నేల స్వభావాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఎరువులు, పురుగు మందులు వేసి అటు భూసారాన్ని నాశనం చేయడంతో పాటు, ఆర్థిక భారాన్ని భుజాలకెత్తుకుంటున్నారు. పంటల దిగుబడిలో ప్రధాన పాత్ర పోషించే భూమి గురించి తెలుసుకోకుండానే నచ్చిన పంటలు వేస్తూ నట్టేటా మునుగుతున్నారు. అయితే, భూమి సామర్థ్ధ్యాన్ని తెలుసుకుని ఆ నేలలో పండే పంటలను పండించడం తో పాటు వాడాల్సిన మేరకు ఎరువులు వాడితే అటు దిగుబడి పెంచుకొని, ఇటు ఖర్చు తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రభు త్వం ఈ విషయం ఏటా చెబుతున్నప్పటికీ రైతులు మా త్రం తమ భూముల్లో మట్టి పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014-15లో రూపొందించిన జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌(ఎన్‌ఎంఎస్‌ఏ) పథకంలో భాగంగా గత ఏడాది ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ఈ సారి కూడా చేపట్టేందుకు  జిల్లా వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. షెడ్యుల్‌ ప్రకారమైతే సోమవారం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. దా దాపు అన్ని భూకమతాల్లో వేసిన పంటలు ఇంకా పూర్తి కాకపోవడంతో కొంచెం నెమ్మదిగా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ సారి ఐదు గ్రామాల్లో ప్రత్యేకంగా..

నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టెనబుల్‌ అగ్రికల్చర్‌(ఎన్‌ఎంఎస్‌ఏ) పథకం కోసం 2020-21 సంవత్సరం పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలోని ఐదు మండలాల్లో ఐదు గ్రామాలను గుర్తించారు. ఇందులో ఎల్కతుర్తి మండలంలో తిమ్మాపూర్‌, కమలాపూర్‌ మండలంలో నేరెళ్ల, హసన్‌పర్తి మండలంలో జయగిరి అనుబంధ గ్రామమైన లక్నవరం, ధర్మసాగర్‌ మండలంలో తాటికాయల, భీమదేవరపల్లి మండలంలో కొప్పూరు గ్రామాలు ఉన్నాయి. ఈ ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం అందరి రైతుల పంట క్షేత్రాల్లో పూర్తి స్థాయిలో మట్టి నమూనాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తారు. జేడీఏ, ఏడీఏ, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఆయా క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) శాంపిల్స్‌ను తీసుకుంటారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్న భూముల ఆధారంగా 5 గ్రామాల్లో మొత్తం 2783 మట్టి నమూనాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న కిట్లను వినియోగించుకోవడంతో పాటు, వరంగల్‌లోని ల్యాబ్‌కు కూడా పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. మళ్లీ మే చివరి వారం వరకు అందరు రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డు(ఎస్‌హెచ్‌సీ)లను పంపిణీ చేయనున్నారు. రైతు భూమిలో ఎలాంటి మినరల్స్‌ ఉన్నాయి? కావాల్సినవి ఏంటి? అనేది వారికి వివరించి కొన్నింటిని ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద అందజేస్తారు. సిఫారసు మేరకే ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తారు.

గత ఏడాది 3,279 మట్టి ఆరోగ్య కార్డులు

పంటలు ఏపుగా పెరగాలనే ఆశతో రైతులు ఇబ్బడి ముబ్బడిగా ఎరువులను చల్లుతున్నారు. దీంతో భూమి లో సారం దెబ్బతినడంతో పాటు మనుషులకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ తరాలకు మనం రోగాలను బహుమానంగా ఇచ్చిన వారమవుతామని గ్రహించిన ప్రభుత్వం భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ర్టానికి ఇవ్వాల్సిన యూరి యా కేటాయింపులను గణనీయంగా తగ్గించింది. దీంతో రైతులకు ఎరువుల వినియోగంలో ప్రావీణ్యతను పెంచితేనే విచ్చలవిడి రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తారని భావించిన సర్కారు ముందుగా భూసార పరీక్షలు నిర్వహించి, భూమిలో వేయాల్సిన ఎరువుల మోతాదు అన్నదాతలకు తెలిసేలా చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగానే జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌లో ఈ భూమికి జవసత్వాలను అందించేందుకు గత ఏడాది నుంచి భూసార పరీక్షలు చేపట్టారు. 2019-20లో భీమదేవరపల్లి మండల కేంద్రంలో, ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లి, ఐనవోలు మండలం పున్నేలు, ఎల్కతుర్తి మండలం కోతులనడుమ, కాజీపేట మండలం తరాలపల్లి, ధర్మసాగర్‌ మండలం సోమదేవరపల్లి, హసన్‌పర్తి మండలం పెంబర్తి, వరంగల్‌ మండలం దేశాయిపేట, కమలాపూర్‌ మండలం మాదన్నపేట, హన్మకొండ మండలం కుమార్‌పల్లి, వేలేరు మండలం సోడాషపల్లి గ్రామాల్లో 3281 మట్టి నమూనాలు సేకరించారు. ఇందులో 3279 మంది రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందజేశారు.logo