ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Mar 16, 2020 , 03:19:59

పోషకాల పాలు

పోషకాల పాలు
  • ములుకనూరు మిల్క్‌లో పుష్కలంగా ఏ, డీ విటమిన్లు
  • ఫోర్టిఫికేషన్‌ చేస్తున్న డెయిరీ నిర్వాహకులు
  • మూడు లక్షల కుటుంబాలకు ప్రయోజనం
  • దేశ జనాభాలో 80 శాతం మందికి ఏ, డీ విటమిన్ల లోపం
  • భారత జాతీయ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడి

భీమదేవరపల్లి: విటమిన్‌ ఏ,డీ లోపం దేశ ప్రజలను వేధిస్తున్నది. దేశ జనాభాలో 80 శాతం మందికి వీటి లోపంతో సతమతమవుతున్నారని భారత జాతీయ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడైంది. రానున్న రోజుల్లో ఈ విటమిన్ల లోపం కారణంగా ప్రజల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ప్రజల్లో దృష్టి లోపం, చర్మవ్యాధులు అధికంగా వస్తున్నాయని నిర్ధారించింది. వాతావరణంలో మార్పులు కూడా ఏ,డీ విటమిన్ల లోపానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విటమిన్లను శరీరం తయారు చేసుకోలేదు. వాటిని మనం ఆహారం రూపంలో మాత్రమే తీసుకోవాలి. డీ విటమిన్‌ మాత్రమే సూర్యుడి నుంచి లభిస్తుంది. దీంతో ప్రపంచ బ్యాంకు, టాటా ట్రస్టు, కేంద్ర ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజల్లో ఏ,డీ విటమిన్‌ లోపాన్ని అధిగమించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మహిళా రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ములుకనూరు మహిళా సహకార డెయిరీలో పోషక విలువలు కలిగిన పాలను మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నది.

విటమిన్‌ ఏ, డీ లోపం లక్షణాలు..

విటమిన్‌ ఏ: విటమిన్‌ ఏ లోపం వల్ల రేచీకటి, జెరప్తాల్మియ, శుక్లపటలం పగలడం, చర్మం గరుకుగా మార డం వంటి సమస్యలు వస్తాయి. దాదాపు 80 శాతం మంది ప్రజలు దృష్టిలోపం, చర్మ సమస్యలకు గురవుతున్నారు. విటమిన్‌ డీ: దీన్ని సన్‌షైన్‌ లేదా సూర్యరశ్మి విటమిన్‌ అని కూడా పిలుస్తారు. సూర్యరశ్మి ద్వారా డీ విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది. డీ విటమిన్‌ లోపం కారణంగా చర్మం, ఎముకలతోపాటు నరాల సమస్యలు ఉంటాయి. ఎముకలు పెలుసుగా మారడం, విడిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే సూర్యుడి నుంచి డీ విటమిన్‌ లభిస్తుంది. ఈ సమయంలో అతినీల లోహిత కిరణాలు ఉండవు. ఏటవాలుగా కిరణాలు ప్రసరించే సమయంలో మాత్రమే ఈ విటమిన్‌ లభిస్తుంది. నుదుటిపై చెమటలు పడతాయి. మామూలు వాతావరణంలో చెమట పడితే డీ విటమిన్‌ లోపంగా భావించాలి. 

పాలలో ఫోర్టిఫికేషన్‌ ప్రక్రియ..

ప్రజల్లో విటమిన్‌ ఏ, డీ లోపం నివారణకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పాల డెయిరీలను ఎంపిక చేసింది. 12 ఏళ్ల లోపు బాలబాలికల్లో ఏ, డీ విటమిన్‌ లోప ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. దీంతో డెయిరీలోని పాలలో విటమిన్‌ ఏ, డీ కలిపి సరఫరా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కేంద్ర ఆరోగ్య సంస్థ భావించింది. దేశంలోని 20 రాష్ర్టాల్లో 25 ప్రాజెక్టుల ద్వారా ఈ ఫోర్టిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. దీని ద్వారా ఏడాదిలోగా రెండు మిలియన్‌ టన్నుల పాలు ప్రజలకు సరఫరా చేయవచ్చని నిర్ధారించారు. ఇప్పటి వరకు 14 రాష్ర్టాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించగా.. 15వ స్థానంలో ములుకనూరు స్వకృషి మహిళా సహకార డెయిరీ చేరింది. ప్రస్తుతం ఈ డెయిరీ నిత్యం 70వేల లీటర్ల పాలను మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నది. దీని ద్వారా సుమారు 3 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో విటమిన్‌ ఏ, డీ లోపాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన పాలు పంపిణీ చేయడంలో ‘ప్లస్‌ ఎఫ్‌' గుర్తింపు పొందిన జాబితాలో ములుకనూరు మహిళా సహకార డెయిరీ నిలిచింది.

మరింత గుర్తింపు..

ఫోర్టిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా ములుకనూరు మహిళా సహకార డెయిరీకి మరింత గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో రంగారెడ్డి, ములుకనూరు సహకార పాల డెయిరీల్లో మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. మిగిలిన డెయిరీల్లో సైతం ఈ ప్రక్రియను కొనసాగించాలి.

- అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి,  ములుకనూరు బ్యాంకు అధ్యక్షుడు

రాష్ట్రంలో ప్రథమం..

రాష్ట్రంలో విటమిన్‌ ఏ, డీ కలిపిన పాలు సరఫరా చేయడంలో ములుకనూరు డెయిరీ ప్రథమంగా నిలిచింది. రంగారెడ్డి జిల్లాలోని సహకార డెయిరీలో సైతం ఈ ఫోర్టిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. విటమిన్‌ ఏ, డీ విటమిన్‌ కలిపిన పాలను తీసుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.  

-గుర్రాల విజయ, డెయిరీ అధ్యక్షురాలు

మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి..

ములుకనూరు మహిళా సహకార డెయిరీ విటమిన్‌ ఏ, డీ కలిపిన పాలు పంపిణీ చేయడం వల్ల మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది. డెయిరీ నుంచి నిత్యం 70వేల లీటర్ల వరకు పాలు సరఫరా చేస్తున్నాం. ప్రజలకు ఆరోగ్యవంతమైన పాలు పంపిణీ చేయడమే ములుకనూరు మహిళా డెయిరీ లక్ష్యం.  

-మార్పాటి భాస్కర్‌రెడ్డి, డెయిరీ జనరల్‌ మేనేజర్‌


logo