గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 16, 2020 , 03:10:42

కరోనాపై కట్టుదిట్టం

కరోనాపై కట్టుదిట్టం

పల్లె, పట్టణాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సంసిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించాయి. సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం సినిమా హాళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు సెలవులను ప్రకటించాయి. మరోవైపు ఆర్టీసీ అధికారులు ప్రయాణ ప్రాంగణాలను, బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న లాలీపాప్‌ హోర్డింగ్స్‌పై పోస్టర్లను అతికిస్తున్నారు. కాగా, కలెక్టరేట్‌, కార్పొరేషన్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌ను యంత్రాంగం రద్దు చేసింది.

  • ఊరూరా అప్రమత్తం
  • సినిమాహాళ్లు.. పర్యాటక ప్రదేశాల మూసివేత
  • నేటి నుంచి విద్యా సంస్థలు బంద్‌
  • మూతపడిన బార్లు, రెస్టారెంట్లు
  • ఎంజీఎంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు
  • అన్ని శాఖల అలర్ట్‌
  • కలెక్టరేట్లు, మున్సిపాలిటీల్లో ‘గ్రీవెన్స్‌' రద్దు

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ప్రభుత్వం కరోనా వైరస్‌పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించి అప్రమత్తం చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో ఎక్కడికక్కడ ఆ నిర్ణయ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. శనివారం రాత్రి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. సినిమా హాళ్లు మూసివేశారు. అప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకొని సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చిన సందర్శకుల కోసం రెండు సినిమా హాళ్లు మధ్యలోనే   ప్రదర్శనలు నిలిపివేశారు. మరోవైపు మిగతా షోలకు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్లపై ప్రభుత్వం తీసుకున్న అప్రమత్తత ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. మ్యారేజ్‌ హాల్స్‌ల్లోనూ ఈ ప్రభావం దర్శనిమిచ్చింది. దగ్గరి బంధువులు, బంధుమిత్రులు మాత్రమే పెళ్లికి హాజరై అది కూడా ఎక్కువసేపు అదే ప్రదేశంలో ఉండకుండా వెనుదిరిగారు. బార్లు, రెస్టారెంట్లు, జిమ్‌ సెంటర్లు మాత్రమే కాదు పార్కుల్లో సైతం ఈ ప్రభావం కనిపించింది. 

విస్తృతమైన అవగాహన 

కరోనా వైరస్‌ వ్యాప్తి కానీ, వ్యాధి సోకిన పాజిటివ్‌ కేసులు కానీ ఇక్కడ లేకపోయినా సరే జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రజారోగ్యమే పరమావధిగా భావించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, అవగాహన కల్పిస్తూ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టమైన విధాన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌ శాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్‌ టీంను వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా దవాఖానల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఒకవైపు పరిసరాలను శుభ్రం చేస్తూనే మరోవైపు కరోనాపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ఆదివారం పోలీసు యంత్రాంగం సైతం ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నలుగురు గుమిగూడి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు వారి పరిధిలోని అన్ని పబ్లిక్‌, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, పార్కులు, సినిమాహాల్స్‌, కోచింగ్‌ సెంటర్ల వద్ద ఎట్టిపరిస్థితుల్లో పది మంది ఒక్కచోట ఉండకూడదని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఎంజీఎంలో కరోనా అనుమానితుల కోసం ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఎల్లవేళలా (24/7) వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.  ప్రజలెవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ భరోసా ఇస్తున్నది. 

ప్రజాఫిర్యాదులు బంద్‌ 

కలెక్టరేట్లు, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేస్తున్న ట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ విభాగాల బాధ్యులు తెలిపారు. 

పర్యాటక ప్రాంతాల్లోనూ...

నిత్యం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులతో సందడిగా మారే పర్యాటక ప్రదేశాలైన ఖిలా వరంగల్‌ కోట, వేయి స్తంభాలగుడి, రామప్ప, లక్నవరం, బొగత జలపాతం వంటి ప్రదేశాల్లోనూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రయాణాలు రద్దు చేసుకోవాలని పర్యాటకులు భావించడంతో ఆయా ప్రాంతాల్లో సందడి కనిపించలేదు. మరోవైపు అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. అంతేకాకుండా కాకతీయ జూపార్క్‌ మూసివేత సమాచారం తెలియకపోవడంతో కొంతమంది కుటుంబ సభ్యులతో వచ్చిన వారికి జూ పార్క్‌ నిర్వాహకులు అసలు విషయం చెప్పడంతో వెనుదిరిగారు.

ఇళ్లకు చేరిన విద్యార్థులు

విద్యా సంస్థలు అన్నీ మూసివేయాలని, అందులో వివిధ యాజమాన్యాల కింద నడుస్తున్న రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల్ని సురక్షితంగా ఇళ్లకు పంపిస్తున్నారు. హాస్టళ్ల మూసివేత నిర్ణయం చేరని తల్లిదండ్రులకు ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వార్డెన్లు ఫోన్లు చేసి వారిని రప్పించి ఇంటికి పంపిస్తున్నారు. దూర ప్రాంతాలకు చెందిన వారు సోమవారం వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారు. 

బస్సుల క్లీనింగ్‌..ప్రయాణ ప్రాంగణాలన్నీ శుభ్రం 

ఉమ్మడి జిల్లాలోని అన్ని బస్‌డిపోలు, ఆ డిపోల పరిధిలో ఉన్న ప్రయాణ ప్రాంగణాలన్నీ  శుభ్రం చేస్తున్నారు. ప్రయాణ ప్రాంగణాలే కాకుండా బస్సులను శుభ్రం చేస్తున్నారు.  ప్రయాణికులు కూర్చునే సీట్లపై వైరస్‌ వ్యాప్తి నిరోధానికి డిస్‌ఇన్‌ఫెక్షన్‌ లిక్విడ్‌తో శుభ్రం చేశారు. ఆర్టీసీ కార్మికులకు నిర్దేశిత శానిటైజర్లను వరంగల్‌-2 డిపోలో డీవీఎం శ్రీనివాస్‌ పంపిణీ చేశారు.

పర్యాటక కేంద్రాల సందర్శన బంద్‌ 

ములుగు, నమస్తేతెలంగాణ/ వాజేడు: కరోనా వైరస్‌ మన రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని పర్యాటక కేంద్రాల సందర్శనను  తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన సందడి ఉన్న ప్రదేశాలైన బొగత జలపాతం, లక్నవరం ప్రాంతాలను వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతిలేదని అన్నారు. తిరిగి పర్యాటక కేంద్రాల సందర్శన అనుమతిని వెల్లడిస్తామని ఆయన వివరించారు. logo