మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Mar 15, 2020 , 04:15:44

బంద్‌.. కరోనా

బంద్‌.. కరోనా
  • కొవిడ్‌-19పై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌
  • ఈ నెల 31 వరకు విద్యా సంస్థలకు
  • కేయూ పరిధిలోని కళాశాలలకూ వర్తింపు
  • తెరిస్తే కఠిన చర్యలకు సర్కార్‌ నిర్ణయం
  • నిట్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 3 వరకు..
  • ఇవాళ్టి నుంచి అన్ని సమావేశాలు రద్దు
  • సినిమా హాళ్లు, మ్యారేజ్‌ హాళ్లకు అనుమతుల ఆంక్షలు
  • నిత్యావసరాలకు ఢోకా లేదు
  • అప్రమత్తత కోసం నిర్ణయం

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ ప్రబలకుండా సర్కార్‌ గట్టి నిర్ణయం తీసుకున్నది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేందుకు, ఆరోగ్యపరమైన అవగాహన కలిగి ఉండటం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇవ్వాటి నుంచి అన్ని రకాల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు సహా వందల మంది గుమిగూడే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం నుంచి ఈనెల చివరి వరకు (మార్చి 31) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా విద్యా సంస్థల్ని తెరిచి ఉంచితే సదరు విద్యా సంస్థల అనుమతులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్న వారివారి సమాచార వ్యవస్థ ద్వారా సెలవులు ఇస్తున్నట్లు సందేశాలు చేరవేశాయి.  అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్‌ పరీక్షల్ని యథాతధంగా కొనసాగిస్తామని ప్రకటించింది. సినిమా హాళ్లను మూసివేయాలనే నిర్ణయంతోపాటు ఫంక్షన్‌ హాల్స్‌పై విధాన నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే బుక్‌ అయిన మ్యారేజ్‌హాల్స్‌ అది కూడా 31 వరకు మాత్రమే ఆయా ఫంక్షన్‌ హాల్స్‌లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి అనుమతి ఉండదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికే పెళ్లిళ్లకు హాజరయ్యేవారు వైరస్‌ వ్యాప్తి చెందకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సభలు, సమావేశాలు మాత్రమే కాదు ఇండోర్‌, ఔట్‌డోర్‌ గేమ్స్‌ను సైతం రద్దు చేస్తున్నట్టు  ప్రకటించింది. 


అప్రమత్తత కోసమే..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దగ్గర అంత తీవ్రమైన పరిస్థితులు లేకపోయినా  ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం ప్రకటించడంతో   జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. నగర పోలీస్‌ కమిషనర్‌ శనివారం రాత్రి  విద్యాసంస్థలు, హాస్టళ్లు, సినిమా హాల్స్‌, మ్యారేజ్‌ హాల్స్‌ ఉన్న ప్రాంతాల పరిధిలోని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేశారు. సినిమా హాల్స్‌ యజమానులకు మూసివేయాలని సమాచారం అందించారు. మరోవైపు విద్యాశాఖ అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈనెల 31 వరకు విద్యా సంస్థలు మూసివేయాలని సమాచారం అందించింది. అంతేకాకుండా వివిధ సమావేశ మందిరాల నిర్వాహకులను అప్రమత్తం చేసింది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి  సహకరించాలని విజ్ఞప్తి చేసింది. 


ఆందోళనకు ఆస్కారం  ఇవ్వొద్దు 

ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన నిఘా వేసింది. వివిధ సామాజిక మాధ్యమాల్లో  అనవసరమైన పోస్టులు పెట్టే వారిపైనా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక నజర్‌ పెట్టింది. అన్ని సామాజిక మాధ్యమాలను నిశితంగా పరిశీలించేందుకు కమిషనరేట్‌ పరిధిలోని సైబర్‌ వింగ్‌ను కమిషనర్‌ అప్రమత్తం చేశారు. వదంతుల్ని ఎవరూ వ్యాప్తి చేసినా సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  


కేయూ బంద్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకతీయ విశ్వవిద్యాలయం, దాని పరిధిలోని కాలేజీలు, అనుబంధ కళాశాలలకు ఈనెల 31వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ కే పురుషోత్తం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 31వ తేదీ వరకు జరిగే సెమినార్‌లు, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాపులు, పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.   

 

ఏప్రిల్‌ 3 వరకు నిట్‌కు సెలవులు

నిట్‌క్యాంపస్‌: కరోనా వైరస్‌ విస్తృతం కాకుండా నిట్‌కు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌ల నిర్వహణను వచ్చే నెల 3 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  logo
>>>>>>