సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 14, 2020 , 13:10:54

వరంగల్‌ లో కరోనాపై సమీక్ష సమావేశం .ముందస్తుగా చర్యలు

వరంగల్‌ లో కరోనాపై సమీక్ష సమావేశం .ముందస్తుగా చర్యలు

 కొవిడ్‌ -19 విభాగం కమిటీతో ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం వరంగల్‌ ఎంజీఎంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల అమలుపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం త్వ రలో 10 పడకలతో ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి సైతం ప్రత్యేక విభాగా న్ని ఏర్పాటు చేసి యంత్ర పరికరాలు సైతం సమకూర్చడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కొవి డ్‌-19 విభాగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై డీఎంహెచ్‌వో నుంచి ఇద్దరు, ఎంజీఎం విభాగం నుంచి ముగ్గురు వైద్యులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని,  వారి ద్వారా ఎంజీఎం కొవిడ్‌-19 విభాగంలో విధులు నిర్వహించనున్న వైద్యులకు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ విభాగంలో వైద్యసేవలు అందించడానికి వైద్యులు సైతం సిద్ధంగా ఉన్నట్లు  ఆయన తెలిపారు. ఎంజీఎం నుంచి పంపిన నమూనాలను పరీక్షించి నిర్ధారించుకున్న తదుపరి అనుమానితుడిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించాలని, లేనిపక్షంలో ఐసోలేటెడ్‌ వార్డులోనే ఉంచి వైద్యసేవలు అందించాలని అధికారులు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. అనుమానితులకు, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం, కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా అనుమానాలను, ఇబ్బందులను దూరం చేయాలని అధికారులు సూచించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో ప్రత్యేక విభాగానికి సంబంధించిన క మిటీ నోడల్‌ అధికారిగా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వీ చంద్రశేఖర్‌, కో-ఆర్డినేటర్‌గా సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో వెంకటరమణ, వైద్యులు పాల్గొన్నారు.

నిట్‌ క్యాంపస్‌లో క్లీనింగ్‌ ముందస్తుగా చర్యలు : రిజిస్ట్రార్‌ 

నిట్‌క్యాంపస్‌, మార్చి 13 : నిట్‌లో కొవిడ్‌-19 ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం నిట్‌ విద్యార్థి కరోనా లక్షణాలతో ఎంజీఎంలో చేరడంతో క్యాంపస్‌లో క్లీనింగ్‌ ప్రక్రియ మొదలైంది. అన్ని విభాగాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించారు. నిట్‌లోని హాస్టల్‌ కాంప్లెక్స్‌లు, మెస్‌ల విభాగాలు, ల్యాబ్‌ల్లో వైరస్‌ క్రిములను అడ్డుకునే రసాయనాలను స్ప్రే చేశారు. రిజిస్ట్రార్‌ ఎస్‌ గోవర్ధన్‌రావు ఆదేశాల మేరకు అన్ని విభాగాల డీన్‌లు, హాస్టల్‌ వార్డెన్‌ క్లీనింగ్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, ఎంజీఎం వైద్యాధికారుల సహకారంతో విద్యార్థులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో క్లీనింగ్‌ ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కొందరు విద్యార్థుల్లో కరోనాపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. కొవిడ్‌-19 లక్షణాలు ఉన్న విద్యార్థి రిపోర్ట్‌పై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మరికొందరు విద్యార్థుల తల్లిదండ్రులు నిట్‌లోని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్‌ మాత్రం నిట్‌లో కొవిడ్‌ భయం ఏమీ లేదని, ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు గుంపులుగుంపులుగా ఉండి చేసే కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని నిట్‌ అధికారులు సూచించారు. తరగతులు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారని అధికారులు తెలిపారు.  

సినీ తారల క్రికెట్‌ వాయిదా..!

ఈ ఏడాది సినీ తారల క్రికెట్‌ వేడుకలు నిట్‌ వరంగల్‌లో నిర్వహించేందుకు లోటస్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. క్రీసెంట్‌ క్రికెట్‌ కప్‌(సీసీసీ)-2020 పేరుతో మార్చి 22న నిట్‌ ఆడిటోరియంలో సినీ తారల క్రి కెట్‌ నిర్వహించనున్నారు. కొవిడ్‌-19 అలర్ట్‌ నేపథ్యంలో నిట్‌లో జరిగే క్రికెట్‌ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు స మాచారం.  మరో వైపు ఈ నెల చివరి వారంలో స్ప్రింగ్‌ స్ప్రీ-2020 నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వేలాదిగా విద్యార్థులు నిట్‌కు రానున్నారు. ప్రస్తు తం నిట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈవెంట్లు నిర్వహించాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తున్నది.


 


logo